AP News: కాశీ వెళ్లొస్తానని చెప్పి.. చిట్టీల పేరుతో రెండు కోట్లు టోకరా..?
చిట్టీల పేరుతో సుమారు రెండు కోట్ల వరకు టోకరా వేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని గుత్తిలో జరిగింది. తాము మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ గుత్తి పోలీసులను ఆశ్రయించారు.
అనంతపురం జిల్లా గుత్తిలో చిట్టీల పేరుతో సుమారు రెండు కోట్ల వరకు టోకరా వేశాడు ఓ ప్రబుద్ధుడు. తాము మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ గుత్తి పోలీసులను ఆశ్రయించారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని బండగెరికి చెందిన బాలకృష్ణ.. గత 20 ఏళ్లుగా గుత్తి పట్టణంలో నివాసం ఉంటున్నాడు. పట్టణంలోనే హోల్సేల్ వ్యాపారం చేస్తూ.. చిట్టిల వ్యాపారం కూడా చేసేవాడు. మొదట్లో నమ్మకంగానే చిట్టీలు పాడుకున్న వారికి డబ్బులు తిరిగి చెల్లించేవాడు. నమ్మకంగా ఉండడంతో చాలా మంది బాలకృష్ణ దగ్గర లక్షల్లో చిట్టీలు కట్టడం మొదలుపెట్టారు.
అలా లక్షల్లో చిట్టీలు కాస్త కోట్లకు పెరిగింది. దీంతో దుర్బుద్ధి పుట్టిన చిట్టీల వ్యాపారి బాలకృష్ణ రెండు కోట్ల రూపాయల చిట్టీల డబ్బుతో పరారై టోకరా పెట్టాడు. ఇరవై రోజుల నుంచి బాలకృష్ణ కనిపించకపోవడం..ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టడంతో బాధితులకు అనుమానం వచ్చింది. 20 రోజుల క్రితం వారణాసి వెళ్లి వస్తానని చెప్పిన బాలకృష్ణ తిరిగి రాకపోవడంతో తాము మోసపోయామని గ్రహించి లబోదిబోమంటూ గుత్తి పోలీసులను ఆశ్రయించారు. దాదాపు 300 మంది బాధితుల నుంచి సుమారు రెండు కోట్ల రూపాయల వరకు చిట్టీల డబ్బులు వసూలు చేసి బాలకృష్ణ పరారైనట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిట్టీ డబ్బులు అడిగిన వారికి ప్రామిసరీ నోట్లను రాసిచ్చాడని… గత నెల 29వ తేదీన వారణాసి వెళ్లి వచ్చాక అందరి డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పిన బాలకృష్ణ.. తిరిగి రాకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.