AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత పనిచేశావురా.. నాలుగు వందల కోసం పిడిగుద్దులు.. ప్రాణాలు వదిలిన వృద్ధుడు!

మానవత్వ విలువలు రోజురోజుకు దిగజారుతున్నాయి అనడానికి విజయనగరం జిల్లాలో జరిగిన ఓ దారుణ ఘటన నిదర్శనం. అప్పు తీసుకున్న నాలుగు వందలు తిరిగి ఇవ్వమని అడిగిన వృద్ధుడిని దారుణంగా కొట్టి చంపాడు ఓ దుర్మార్గుడు. నన్ను వదిలిపెట్టు బాబు అని వేడుకున్నా కనికరించకుండా కిరాతకంగా హింసించారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో సంచలనంగా మారింది.

ఎంత పనిచేశావురా.. నాలుగు వందల కోసం పిడిగుద్దులు.. ప్రాణాలు వదిలిన వృద్ధుడు!
Man Beaten To Death
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Jan 27, 2026 | 1:54 PM

Share

మానవత్వ విలువలు రోజురోజుకు దిగజారుతున్నాయి అనడానికి విజయనగరం జిల్లాలో జరిగిన ఓ దారుణ ఘటన నిదర్శనం. అప్పు తీసుకున్న నాలుగు వందలు తిరిగి ఇవ్వమని అడిగిన వృద్ధుడిని దారుణంగా కొట్టి చంపాడు ఓ దుర్మార్గుడు. నన్ను వదిలిపెట్టు బాబు అని వేడుకున్నా కనికరించకుండా కిరాతకంగా హింసించారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో సంచలనంగా మారింది.

రామభద్రపురం మండలం పాతరేగ గ్రామానికి చెందిన పెద్దింటి తిరుపతి అదే గ్రామానికి చెందిన యాసర్ల సింహాచలం అనే వృద్ధుడి వద్ద నాలుగు వందలు అప్పుగా తీసుకున్నాడు. కొద్ది రోజులు తరువాత తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగాడు. అలా ఎన్ని సార్లు అడిగినా ఇవ్వకపోవడంతో తిరుపతిని సింహాచలం గట్టిగా అడిగి నిలదీశాడు. దీంతో ఆగ్రహానికి గురైన తిరుపతి, సింహాచలం పై దాడికి దిగాడు. సింహాచలంపై చెయ్యి చేసుకొని తోసివేయడంతో సమీపంలో ఉన్న కుళాయి వద్ద దిమ్మపై పడిపోయాడు. అలా పడిన సింహాచలంపై మరోసారి పిడిగుద్దులు గుద్ది తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనలో సింహాచలం తలకు, శరీరంపై తీవ్ర గాయాలు అయ్యాయి. అనంతరం తిరుపతి అక్కడ నుంచి పారిపోయాడు.

అయితే గాయాలపాలైన సింహాచలం ఆసుపత్రికి కూడా వెళ్లలేక ఇంటి వద్దే ఉండిపోయాడు. దీంతో తీవ్ర గాయాలతో రక్తస్రావం అయ్యి అక్కడిక్కడే మృతి చెందాడు సింహాచలం. మరుసటి రోజు తెల్లవారుజామున మంచంపై మృతి చెంది పడి ఉన్న సింహాచలంను కుటుంబసభ్యులు గుర్తించారు. సింహాచలం ఉపాధి నిమిత్తం గతంలో తాడేపల్లిగూడెంకు వెళ్లి పని చేసి ఇటీవలే స్వగ్రామమైన పాతరేగకు తిరిగి వచ్చాడు. భార్య అప్పయ్యమ్మతో కలిసి జీవనం సాగిస్తున్న ఆయనకు పిల్లలు లేరు. ఏకైక తోడైన భర్త మృతి చెందడంతో అతని భార్య అప్పయమ్మ తీవ్రంగా విలపిస్తోంది. సింహాచలం మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..