Vizianagaram: రామాయణ యంగ్ ఇండియన్స్ కాంక్లేవ్ ప్రారంభం.. అబ్బుర పరిచిన ముస్లీం విద్యార్థుల ప్రసంగాలు
యువతలో నైతిక విలువలు, ధర్మబద్ధమైన జీవన విధానంపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో రామనారాయణం ప్రాంతంలో కాంక్లేవ్‌ను నిర్వహించారు. జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వందలాది మంది విద్యార్థులు, ఆధ్యాత్మికవేత్తలు, అధ్యాపకులు ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కాంక్లేవ్‌లో రామాయణంలోని ముఖ్య ఘట్టాలు..

విజయనగరం, జనవరి 26: విజయనగరం జిల్లా రామనారాయణం ప్రాంతంలో శనివారం రామాయణ యంగ్ ఇండియన్స్ కాంక్లేవ్ ఘనంగా ప్రారంభమైంది. యువతలో నైతిక విలువలు, ధర్మబద్ధమైన జీవన విధానంపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కాంక్లేవ్‌ను నిర్వహించారు. జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వందలాది మంది విద్యార్థులు, ఆధ్యాత్మికవేత్తలు, అధ్యాపకులు ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కాంక్లేవ్‌లో రామాయణంలోని ముఖ్య ఘట్టాలు, వివిధ పాత్రల జీవన విధానం, ధర్మం–కర్తవ్యాల ప్రాధాన్యతపై విస్తృతంగా చర్చ జరిగింది. శ్రీ రాముని ఆదర్శ నాయకత్వం, సీతాదేవి త్యాగశీలత, లక్ష్మణుని సేవాభావం, హనుమంతుని అంకితభావం వంటి అంశాలను విద్యార్థులు తమ ప్రసంగాల ద్వారా విశదీకరించారు. రామాయణం కేవలం ఒక ఇతిహాసం మాత్రమే కాకుండా, నేటి సమాజానికి మార్గదర్శకంగా నిలిచే జీవన గ్రంథమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా రామనారాయణం నిర్వాహకులు NCS చారిటబుల్ ట్రస్ట్ నారాయణం నాగేశ్వరరావు, నారాయణం శ్రీనివాస్ లు రామాయణం పై పోటీ పరీక్ష నిర్వహించారు. ఇందులో 58 స్కూల్స్ కి చెందిన సుమారు ఆరు వేల మంది విద్యార్థులు పాల్గొని అవార్డులు సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని అకడమిక్ హెడ్ నారాయణం నిత్యగౌరీ ఏర్పాట్లు పర్యవేక్షించారు.
ఈ సందర్భంగ ఆధ్యాత్మికవేత్తలు మాట్లాడుతూ నేటి యువత ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లు, విలువల లోపానికి రామాయణ బోధనలు సరైన పరిష్కార మార్గాన్ని చూపుతాయని తెలిపారు. నిజాయితీ, సహనం, కుటుంబ విలువలు, సామాజిక బాధ్యత వంటి అంశాలను భావితరాలకు చేరవేయాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం విద్యార్థినీ విద్యార్థులు సైతం చురుకుగా పాల్గొని రామాయణంలోని నైతిక విలువలు, మానవీయ సందేశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించడం అందరిని ఆలోచింపజేసింది. మతాలకు అతీతంగా రామాయణం ఇచ్చే ధర్మ సందేశం సర్వకాలికమని వారు వివరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు ఉత్సాహంగా ప్రశ్నలు అడగడం, తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడం కాంక్లేవ్‌కు మరింత ప్రాధాన్యతను చేకూర్చింది. యువతలో సాంస్కృతిక వారసత్వంపై అవగాహన పెంపొందించే దిశగా ఈ కాంక్లేవ్ ఒక మైలురాయిగా నిలుస్తుందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




