AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

France Hindu temple: ఫ్రాన్స్‌లో తొలి సంప్రదాయ హిందూ మందిర నిర్మాణం.. బీఎపీఎస్ చారిత్రక ఘట్టం

ఫ్రాన్స్‌లో నిర్మించనున్న తొలి సంప్రదాయ హిందూ మందిరానికి భారత్‌ నుంచి తొలి పవిత్ర శిలలను BAPS సంస్థ పంపించింది. భారత్–ఫ్రాన్స్ సాంస్కృతిక స్నేహానికి ప్రతీకగా నిలిచే ఈ మందిర నిర్మాణంలో ఇది కీలక మైలురాయిగా నిలిచింది. BAPS సంస్థ ఆధ్వర్యంలో ఈ మందిర నిర్మాణం జరుగుతుంది.

France Hindu temple: ఫ్రాన్స్‌లో తొలి సంప్రదాయ హిందూ మందిర నిర్మాణం.. బీఎపీఎస్ చారిత్రక ఘట్టం
Indian Artisans
Ram Naramaneni
|

Updated on: Jan 27, 2026 | 1:48 PM

Share

ఫ్రాన్స్‌లో తొలి సంప్రదాయ హిందూ మందిర నిర్మాణానికి సంబంధించిన చారిత్రక ఘట్టం నేడు ఆవిష్కృతమైంది. భారత్‌ నుంచి తీసుకువచ్చిన తొలి శిలలు పారిస్ సమీపంలోని బస్సీ–సెయింట్–జార్జెస్‌కు చేరుకోవడంతో, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణంలో కీలక దశ ప్రారంభమైంది. భారత్–ఫ్రాన్స్ మధ్య సాంస్కృతిక సహకారానికి ప్రతీకగా నిలిచే ఈ మందిరం, సంప్రదాయ శిల్పకళా పద్ధతులు, తరతరాలుగా కొనసాగుతున్న నైపుణ్యంతో నిర్మించనున్నారు. భారత్‌లో సేకరించిన శిలలను సంప్రదాయ పద్ధతుల్లో సిద్ధం చేసి, కొంత భాగాన్ని నిపుణులైన భారత శిల్పులు చేతితో చెక్కారు. అనంతరం ఆ శిలలను ఫ్రాన్స్‌కు తీసుకువచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ హిందూ మందిరాల నిర్మాణంలో అనుభవం గల బోచాసన్‌వాసి అక్షర పురుషోత్తమ్ స్వామినారాయణ సంస్థ (BAPS), ఫ్రాన్స్‌లోని బస్సీ–సెయింట్–జార్జెస్‌లో తొలి సంప్రదాయ హిందూ మందిర నిర్మాణానికి చారిత్రక అడుగులు వేసింది. భారత్‌ నుంచి తీసుకువచ్చిన తొలి శిలలు ఈ మైలురాయి ఘట్టానికి సంకేతంగా నిలవడంతో, ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో కీలక దశ ప్రారంభమైంది.

France Hindu Temple

భారతీయ సంప్రదాయ శిల్పకళా పద్ధతులు, తరతరాలుగా కొనసాగుతున్న నైపుణ్యంతో తయారైన ఈ శిలలను నిపుణులైన భారత శిల్పులు చేతితో సిద్ధం చేసి, తర్వాత ఫ్రాన్స్‌కు తరలించారు. ఫ్రాన్స్‌లో ఈ మందిర నిర్మాణంలో భారత శిల్పులు – ఫ్రెంచ్ స్టోన్ మేసన్లు కలిసి పనిచేయనున్నారు. వీరిలో నోట్ర్‌డామ్ క్యాథెడ్రల్ పునరుద్ధరణ పనుల్లో పాల్గొన్న నిపుణులు కూడా ఉండటం విశేషం. భారతీయ సంప్రదాయ శిల్పకళ, ఫ్రాన్స్‌కు చెందిన ఆధునిక శిలా నైపుణ్యం కలయికగా ఈ మందిరం రూపుదిద్దుకోనుంది. ఈ కార్యక్రమం కేవలం శిలల రాకతోనే పరిమితం కాకుండా, రెండు దేశాల మధ్య సంస్కృతి, విలువలు, జ్ఞానం కలిసే వేదికగా నిలిచింది. ఈ మందిరాన్ని ప్రార్థన స్థలంగానే కాకుండా, సంస్కృతి, విద్య, సామాజిక కార్యకలాపాలకు కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. పూర్తయిన తర్వాత ఇది భారత్–ఫ్రాన్స్ స్నేహానికి చిరస్థాయీ చిహ్నంగా నిలవనుంది. ఈ కార్యక్రమానికి స్థానిక, జాతీయ స్థాయి ప్రతినిధులు, కమ్యూనిటీ నాయకులు హాజరై, ఈ ప్రాజెక్టు ఫ్రాన్స్‌కు ఎంత ముఖ్యమో, అంతర్జాతీయ సాంస్కృతిక అవగాహనకు ఇది ఎంతగా దోహదపడుతుందో కొనియాడారు.

Traditional Hindu Temple Co

 

“భారత్‌ నుంచి వచ్చిన తొలి శిలలు ఒక చారిత్రక మైలురాయి. ప్రతి శిలలో సంప్రదాయం, శ్రద్ధ, ఉద్దేశం దాగి ఉంది. భారత సంప్రదాయం – ఫ్రెంచ్ ఇంజినీరింగ్ పరస్పర గౌరవంతో కలిసే ఈ ప్రయాణంలో భాగం కావడం గర్వంగా ఉంది. మహంత్ స్వామి మహారాజ్ గారి సేవ, వినయం, సామరస్యం అనే విలువలే ఈ ప్రాజెక్టుకు ప్రేరణ” అని పారిస్ మందిర నిర్మాణ ప్రాజెక్ట్ సీఈఓ, బాప్స్ యూకే & యూరప్ ట్రస్టీ సంజయ్ కారా పేర్కొన్నారు.

“భారత్‌లో చెక్కబడిన శిలలు ఫ్రాన్స్‌లో నిర్మాణ రూపం దాల్చనున్నాయి. ఇది పవిత్ర శిల్పకళలోని రెండు గొప్ప సంప్రదాయాల సంగమం. భారత–ఫ్రెంచ్ శిల్పుల స్నేహబంధం రెండు దేశాల మధ్య సహకారం, గౌరవానికి ప్రతీక” అని ఫ్రాన్స్‌లో భారత రాయబారి సంజీవ్ కుమార్ సింగ్లా వ్వ్యాఖ్యానించారు.

ఫ్రాన్స్ విదేశాంగ శాఖలో మత వ్యవహారాల సలహాదారు జీన్–క్రిస్టోఫ్ పౌసెల్ మాట్లాడుతూ.. “ఈ మందిరం ఫ్రాన్స్‌లో కొత్త అధ్యాయానికి నాంది. ఇలాంటి సంప్రదాయ హిందూ మందిరం ఇక్కడ నిర్మించబడటం ఇదే తొలిసారి. ఇది ఆధ్యాత్మికమే కాకుండా మానవీయ భాగస్వామ్యం కూడా” అని పేర్కొన్నారు.

“ఇది భారత్–ఫ్రాన్స్ స్నేహ నిర్మాణంలో మరో శిల. కాలాతీతమైన భారత శిల్పకళ, ఆధునిక ఫ్రెంచ్ నైపుణ్యం కలిసినప్పుడు ఎంత అద్భుతమైన నిర్మాణం అవతరిస్తుందో ఈ మందిరం చూపించనుంది” అని టోర్సీ ఉప–ప్రిఫెక్ట్ అలెన్ న్గౌటో వ్యాఖ్యానించారు.

ఈ ప్రతిష్టాత్మక మందిరాన్ని బోచాసన్‌వాసి అక్షర పురుషోత్తమ్ స్వామినారాయణ సంస్థ (BAPS) ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ హిందూ మందిరాల నిర్మాణంలో విశేష అనుభవం కలిగిన బీఏపీఎస్, భారతీయ శిల్పకళ, ఆధ్యాత్మిక విలువలు, సేవా భావనను ప్రపంచానికి పరిచయం చేస్తూ వస్తోంది. ఫ్రాన్స్‌లో నిర్మాణం జరగనున్న ఈ తొలి సంప్రదాయ హిందూ మందిరం కూడా బీఏపీఎస్ మార్గదర్శకత్వంలో, మహంత్ స్వామి మహారాజ్ ఆశయాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటోంది. ఈ మందిరం ప్రార్థనా కేంద్రంగా మాత్రమే కాకుండా, సంస్కృతి, విద్య, సామాజిక సేవలకు వేదికగా నిలవనుంది.