AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుణ్యదంపతులు.. మరణంలోనూ విడిపోని జంట.. కడవరకు కలిసే’పోయారు’!

శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ల మండలం రత్నగిరి గ్రామంలో నెలకొన్న విషాద ఘటన అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. జీవితాంతం ఒకరికొకరు తోడునీడగా నిలిచిన వృద్ధ దంపతులు 95 ఏళ్ల మల్లప్ప, 88 ఏళ్ల లింగమ్మ మరణంలోనూ విడిపోలేదు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న భర్త మల్లప్ప ముందుగా కన్నుమూయగా, ఆ వియోగాన్ని తట్టుకోలేక భార్య లింగమ్మ కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే గుండె ఆగి ప్రాణాలు విడిచారు. తొమ్మిది పదుల వయస్సులోనూ ఒకే రోజు, ఒకే సమయంలో తనువు చాలించిన ఈ ఆదర్శ జంటను చూసి స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

పుణ్యదంపతులు.. మరణంలోనూ విడిపోని జంట.. కడవరకు కలిసే'పోయారు'!
Elderly Couple Dies Together
Nalluri Naresh
| Edited By: |

Updated on: Jul 20, 2026 | 8:40 PM

Share

పెళ్లి నాడు ఏడడుగులు నడిచేటప్పుడు సుఖదుఃఖాలలోనే కాదు, మరణంలోనూ తోడుంటామని ప్రమాణం చేస్తారు. కానీ, ఆ మాటను నిజం చేస్తూ, మరణంలోనూ కలిసే ప్రయాణించిన ఒక అరుదైన జంట ఉదంతం శ్రీ సత్యసాయి జిల్లాలో వెలుగుచూసింది. జీవితాంతం ఒకరికొకరు తోడునీడగా జీవించిన ఆ వృద్ధ దంపతులు, మరణంలోనూ విడిపోలేక ఒకే రోజు, ఒకే సమయంలో కన్నుమూశారు. ఈ హృదయ విదారక ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. అసలేం జరిగిందంటే..

వివరాల్లోకి వెళ్తే.. శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ల మండలం రత్నగిరి గ్రామానికి చెందిన 95 ఏళ్ల మల్లప్ప, 88 ఏళ్ల లింగమ్మ దంపతులు దశాబ్దాలుగా ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. వీరికి ఐదుగురు సంతానం ఉన్నారు. అయితే, గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న మల్లప్ప ఆరోగ్యం క్షీణించడంతో ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు.

దశాబ్దాలుగా తన ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటూ, ప్రాణంగా చూసుకున్న భర్త ఇక లేడనే చేదు నిజాన్ని భార్య లింగమ్మ తట్టుకోలేకపోయారు. కళ్లముందే భర్త నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసి ఆమె గుండె పగిలింది. ఆ తీవ్ర బాధను జీర్ణించుకోలేక, భర్త మరణించిన కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే ఆమె కూడా ఒక్కసారిగా గుండె ఆగి అక్కడికక్కడే కన్నుమూశారు.

ఇవి కూడా చదవండి

ఒకే రోజు, కేవలం ఐదు నిమిషాల తేడాతో దంపతులిద్దరూ మరణించడంతో రత్నగిరి గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రుల అకాల మరణంతో వారి ఐదుగురు సంతానం, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. జీవితాంతం కలిసి బతికిన ఈ పుణ్య దంపతులు, చనిపోయేటప్పుడు కూడా ఒకరినొకరు విడిచి ఉండలేక కలిసే వెళ్లడం చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఎంత పుణ్యం చేసుకుంటేనో ఇలాంటి చావు దక్కుతుంది.. బతికినంత కాలం ఆదర్శంగా జీవించి, పోయేటప్పుడు కూడా కలిసే వెళ్లారు అంటూ గ్రామస్థులు ఆ వృద్ధ దంపతుల పార్థివ దేహాలకు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రతీ ఒక్కరిని కదిలించిన ఈ ప్రేమ జంట ప్రయాణం ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us