పిట్ట కొంచెం కూత ఘనం ఈ నానుడి అతికినట్టు సరిపోతుంది ఈ బాలికకు. దేశభాషలే కాదు విదేశీ భాషల్లో కూడా ఈ బాలిక ప్రావీణ్యం సంపాదించింది. విదేశీయులకే తర్జుమా చేస్తూ భాషపై తనకున్న ప్రావీణ్యాన్ని చెప్పకనే చెబుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు భాషల్లో అనర్గళంగా మాట్లాడుతోంది, రాయగలుగుతుంది. ఇంత చిన్న వయస్సులోనే ఆరు భాషలు నేర్చుకొని అందరిని ఆశ్యర్యపరుస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కారంపల్లి అనే చిన్న గ్రామంలో పుట్టిన మన్నూరు ఇందు రెడ్డి.. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ స్కూల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. ఈ బాలిక తెలుగు, హిందీ,ఇంగ్లీష్, భాషలు మాత్రమే కాకుండా విదేశీ భాషలపై పట్టు సాధించింది.
దాదాపు 6 విదేశీ భాషలపై అపర ప్రావీణ్యం సంపాదించింది. జపనీస్, థాయ్, కొరియన్, చైనీస్ భాషలను అనర్గళంగా మాట్లాడడంతో పాటు చదవడం రాయడం నేర్చుకుంది. అంతేకాకుండా విదేశాల నుంచి వచ్చే వైద్యులకు ఆమె తర్జుమా చేస్తూ తన భాషా ప్రావీణ్యాన్ని చాటుతుంది. అంతేకాకుండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్టార్ హోటల్ సిబ్బందికి ఆమె విదేశీ భాషలను నేర్పుతూ అతి చిన్న వయసులోనే తన భాషా ప్రావీణ్యంతో అబ్బురపరుస్తుంది. భాష నేర్చుకోవాలన్న పట్టుదలతో వివిధ మాధ్యమాల ద్వారా కష్టపడి సొంతంగానే తాను విదేశీ భాషలో నేర్చుకున్నట్లు ఆమె టీవీ9తో తెలిపింది. మరిన్ని భాషలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. చిన్న వయసులో భాషలపై ప్రావీణ్యం ప్రదర్శిస్తున్న ఆమె ప్రతిభాపాటవాలు చూసి సొంత ఊరు వారు అభినందనలతో ముంచెత్తుతున్నారు.