ఇద్దరికీ పెళ్లి కుదిరింది.. మరో 15 రోజుల్లో పెళ్లి.. కలకాలం కలిసి ఉండాలంటూ అమ్మాయి.. అబ్బాయి ఇద్దరు కలలుగన్నారు.. ఒకరినొకరు మురిపెంగా చూసుకుంటూ.. ఫోన్ లో మాట్లాడుకుంటూ సంతోషించారు. ప్రేమను పంచుకుంటూ.. భవిష్యత్తును ఊహించుకుంటూ తెగ సంబరపడ్డారు. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి మొక్కు తీర్చుకునేందుకు మేరిమాత ఆలయానికి బయలుదేరారు.. కానీ.. అదే వారి చివరి మజిలీ అయింది. లారీ రూపంలో దూసుకువచ్చిన మృత్యువు.. కలకాలం కలుసుండాలనుకున్న వారి ఆశలను అడియాశలుగా మార్చింది. మేరిమాత ఆలయానికి బయలుదేరిన వధూవరులిద్దరూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం.. ఇరు కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని మిగిల్చింది. చూడముచ్చటగా.. ఉన్నారనుకున్న జంట.. ఇలా ఒక్కసారిగా.. ఇద్దరూ మరణించడం తీవ్రంగా కలిచి వేసింది.
మరో పదిహేను రోజుల్లో వివాహం చేసుకోనున్న యువతి, యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటన కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జె.కొత్తూరులో చోటుచేసుకుంది. కాకినాడ జె.కొత్తూరుకు చెందిన మానేపల్లి వెంకటేశ్వరరావు, లక్ష్మి దంపతుల కుమారుడు మానేపల్లి రాజ్ కుమార్ (25), కిర్లంపూడి మండలం సోమవరానికి చెందిన మలిరెడ్డి సత్తిబాబు పార్వతి దంపతుల కుమార్తె మలిరెడ్డి దుర్గా భవాని (18) కు వివాహం నిశ్చయమైంది. ఇటీవలే నిశ్చితార్థం జరగగా.. మే 10న ఇద్దరికీ వివాహం చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించారు.
ఈ క్రమంలో రాజ్ కుమార్, దుర్గా భవాని ఇద్దరూ.. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నం మేరీమాత ఆలయానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అయితే, మార్గమధ్యంలో ఉండగా.. రాజమహేంద్రవరం సమీపంలో కొంతమూరు గ్రామం వద్ద గామన్ వంతెనపై వెనుక నుంచి వచ్చిన ఓ లారీ వారిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోలీసులు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. త్వరలోనే వివాహం జరగనున్న జంట.. ఇలా అకస్మాత్తుగా చనిపోవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..