Andhra Pradesh: గుడిలో ఇవేం పనులురా.. భక్తుడిలా వెళ్లి పూజారిని మాటల్లో పెట్టి ఏం చేశాడో వీడియో చూడండి..
అతడు అందరి భక్తుల మాదిరిగానే గుడికి వచ్చాడు. పూజారితో ఎంతో మర్యాదగా మాట్లాడి రూ.500 నోటు దక్షిణగా వేసి.. తిరిగి 400 ఇవ్వాలని కోరాడు. పూజారి చిల్లర కోసం బయటకు వెళ్లి లోపలికి వచ్చి చూసేసరికి అక్కడి నుండి ఉడాయించాడు. అప్పుడుగానీ అర్థంకాలేదు ఆ పూజారికి ఆ కేటుగాడి అసలు రంగు.. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం..

అందరి భక్తులు మాదిరిగానే గుడికి వచ్చాడు. పూజారితో మాట్లాడి దక్షిణ కూడా గట్టిగానే సమర్పించుకున్నాడు. ఆ మాటా ఈ మాట చెప్పి అయ్యవారిని ఏమార్చాడు.. తీరా అమ్మవారి మెడలోని మంగళసూత్రాన్నే కొట్టేశాడు. అంతటితో ఆగకుండా వెండి పూజా వస్తువులతో అక్కడ నుండి ఉడాయించాడు. అయితే సీసీ కెమెరాల సాయంతో ఎట్టకేలకు ఆ దొంగ చిక్కాడు. అతని ఘన చరిత్రను చూసి గుంటూరు పోలీసులే ఆశ్చర్యపోయారు. ఏకంగా 70 ఆలయాల్లో ఇప్పటి వరకూ చోరీలు చేసినట్లు తెలియడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. విజయవాడలోని మాచవరానికి చెందిన రాంబాబు.. హైదరాబాద్‌లోని నేతాజీ నగర్‌లో ఉంటున్నాడు.
500 నోటుతో స్కెచ్..
ఈ నెల 4నన స్కూటీపై గుంటూరు వచ్చాడు. గుంటూరులోని గంజి బజార్‌లో ఉన్న కొట్ల అంకమ్మ తల్లి దేవాలయానికి వచ్చాడు. భక్తుడిలా నటిస్తూ ఆలయ ప్రాంగణంలో గడిపాడు. పూజారికి 500 రూపాయల దక్షిణ వేశాడు. 400 రూపాయలు తిరిగి ఇవ్వాలని కోరాడు. చిల్లర కోసమంటూ పూజరి బయటకు వచ్చాడు. అక్కడే వేచి ఉన్న రాంబాబు ఇదే అదునుగా భావించి గర్భగుడిలోకి వెళ్లి అమ్మవారి మంగళసూత్రంతో పాటు బంగారు ఆభరణాలు జేబులో వేసుకున్నాడు. మరొకసారి లోపలికి వెళ్లి వెండి వస్తువులను తీసుకొని అక్కడ నుండి వెళ్లిపోయాడు.
ఆ తర్వాత ఆలయంలోకి వచ్చిన పూజారి అమ్మవారి మెడలోని ఆభరణాలు పోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల సాయంతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే రాంబాబు ఇప్పటి వరకూ 70 ఆలయాల్లో దొంగతనాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అమ్మవారి ఆలయంలో చోరి చేసిన బంగారు, వెండి ఆభరణాలను రికవరీ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు లాలాపేట సీఐ శివ ప్రసాద్ తెలిపాడు.
