AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mangalagiri: 5 కేజీల బంగారం దొంగతనం.. కేసును చేధించిన పోలీసులు.. ట్విస్ట్ ఇదే..

గుంటూరు జిల్లా మంగళగిరిలో 5 కిలోల బంగారం అపహరణ కేసును పోలీసులు ఛేదించారు. విజయవాడలోని గోల్డ్ షాపు నుంచి మంగళగిరి మండలం ఆత్మకూరు నేషనల్ హైవే వరకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజిని క్షుణ్ణంగా పరిశీలించారు. విజయవాడ నుంచి ఆత్మకూరు వరకు దొంగతనం జరిగిన తీరును పోలీసులు రి క్రియేట్ చేయడంతో పాటు పలు కోణాల్లో కేసు విశ్లేషించి దొంగలను పట్టుకున్నారు.

Mangalagiri: 5 కేజీల బంగారం దొంగతనం.. కేసును చేధించిన పోలీసులు.. ట్విస్ట్ ఇదే..
Scooty
T Nagaraju
| Edited By: |

Updated on: Feb 22, 2025 | 11:23 AM

Share

ఈ నెల పదిహేనో తేది రాత్రి తొమ్మిది గంటల సమయం…. విజయవాడలోని డివిఆర్ జ్యూవెలరీ షాపు నుండి ఐదు కేజీల బంగారు ఆభరణాలను బైక్‌పై తీసుకొస్తున్న నాగరాజును హెల్మెట్ ధరించి వచ్చిన ఇద్దరూ యువకులు ఆత్మకూరు బైపాస్ వద్ద అడ్డుకున్నారు. నాగరాజు స్పీడ్ బ్రేకర్ దగ్గర స్లో కాగానే అకస్మాత్తుగా వచ్చిన ఆ ఇద్దరూ బంగారు ఆభరణాలున్న బ్యాగ్‌ను తీసుకొని పారిపోయారు. దీంతో ఖంగుతిన్న నాగరాజు వెంటనే ఈ విషయాన్ని షాపు యజమాని తన బంధువైన రాముకి తెలియజేశాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోని దిగిన పోలీసులు సిసి కెమెరా విజువల్స్ సేకరించారు. అన్ని ఆధారాలను పరిశీలించారు. అయితే చోరి జరిగినట్లు ఆనవాళ్లు గుర్తించలేకపోయారు. దీంతో అనుమానం వచ్చి నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. అయితే బంగారు ఆభరణలున్న బ్యాగ్ ఎక్కడుందో తెలసుకునేందుకు పోలీసులకు వారం రోజుల పైనే పట్టింది. అసలేం జరిగిందంటే…

మంగళగిరికి చెందిన దివి రాము విజయవాడలో డివిఆర్ జ్యూవెలరీ షాపును నిర్వహిస్తున్నాడు. షాపులో తన బంధువైన నాగరాజుని మేనేజర్‌గా పెట్టుకున్నాడు. నాగరాజు ఆర్డర్లపై తయారు చేసిన బంగారు ఆభరణాలను ఆయా షాపులకు తీసుకెళ్లి డెలివరీ ఇస్తుంటాడు. అయితే నాగరాజు గత కొంతకాలంగా అప్పుల పాలయ్యాడు. అప్పులు ఇచ్చినవాళ్లు పదే, పదే ఒత్తడి పెడుతూ ఉండటంతో.. మాస్టర్ స్కెచ్ వేశాడు. ఈ క్రమంలోనే డెలివరీ కోసం తీసుకెళ్లే బంగారు ఆభరణాలు చోరి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందు కోసం స్నేహితుల సాయం అడిగాడు. అయితే అప్పుల విషయాన్ని స్నేహితులకు చెప్పకుండా తన చెల్లి పెళ్లి చేయాలని.. అందుకు చోరి ఒక్కటే మార్గమని వారిని నమ్మించాడు. తనతో పాటు బంగారు షాపులో పనిచేసే భరత్‌కు మాయ మాటలు చెప్పి చివరకూ చోరి చేయడానికి ఒప్పించాడు. ప్లాన్‌లో భాగంగానే ఈ నెల పదిహేనో తేదిన భరత్ ఆభరణాలు సర్ధిన బ్యాగ్‌ను నాగరాజుకు అందజేశాడు. ఆ తర్వాత షాపు క్లోజ్ చేసినట్లు యజమానికి చెప్పి భరత్ ఇంటికి వెళ్లిపోయాడు. అయితే ముందే అనుకున్న ప్లాన్ ప్రకారం కొద్దిసేపటి తర్వాత భరత్ బైక్‌పై తన స్నేహితుడితో కలిసి నాగరాజు బైక్‌ను వెంబడించాడు. ఆత్మకూరు బైపాస్ వద్దకు రాగానే నాగరాజును నిలవరించి బంగారు ఆభరణాలున్న బ్యాగ్ తో పరారయ్యాడు. అయితే అక్కడ సిసి కెమెరాలు లేకపోవడంతో పోలీసులు ఆధారాలు సేకరించలేకపోయారు. మొదటి నుండి ఈ కేసులో పోలీసులు నాగరాజునే అనుమానిస్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించినా ప్రయోజనం లేకపోయింది. ఆ తర్వాత భరత్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. విజయవాడలో సిసి కెమెరా విజువల్స్‌లో అతను బ్యాగుతో కనిపించడంతో.. పోలీసులకు యవ్వారం అర్థమైంది. దీనిలో నాగరాజు ప్రమేయం ఉందని భావించిన పోలీసులు ఇద్దరి ఫోన్ కాల్స్ డిటైల్స్ తీసుకున్నారు. ఆపై తమదైన శైలిలో భరత్, నాగరాజులను విచారించడంతో అసలు విషయం బయట పడింది. అయితే బంగారు ఆభరణాలున్న బ్యాగ్‌ను భరత్ తన స్నేహితుడైన లోకేష్ ఇంట్లో ఉంచినట్లు గుర్తించిన పోలీసులు ఎట్టకేలకు బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ చోరి కేసులో భాగస్వాములైన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి