Kadapa buruju: 300 ఏళ్ల పురాతన బురుజు కట్టడం.. అందులో ఆశ్చర్యపరిచే నిర్మాణం.. అది కూడా ఏపీలోనే ఉందని మీకు తెలుసా?

Kadapa buruju: ఏం అప్పా.. రాయలసీమ అంటే బాంబులు, కత్తులు ఫ్యాక్షనేనా గుర్తుకు వచ్చేది.. రాయలసీమ చరిత్ర, పురాతనమైన కట్టడాలు కూడా

Kadapa buruju: 300 ఏళ్ల పురాతన బురుజు కట్టడం.. అందులో ఆశ్చర్యపరిచే నిర్మాణం.. అది కూడా ఏపీలోనే ఉందని మీకు తెలుసా?
Buruju
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 11, 2021 | 3:09 PM

(రిపోర్టర్: సేరి సురేష్, టీవీ9 తెలుగు, కడప) Kadapa buruju: ఏం అప్పా.. రాయలసీమ అంటే బాంబులు, కత్తులు ఫ్యాక్షనేనా గుర్తుకు వచ్చేది.. రాయలసీమ చరిత్ర, పురాతనమైన కట్టడాలు కూడా ఇక్కడ ఉన్నాయప్పా.. ముఖ్యంగా కడపజిల్లాలో ఎన్నో చరిత్రలకు, అద్భుతమైన కట్టడాలకు నెలవు.. ఈ కోవలోనే జిల్లాలో దాదాపు 300 సంవత్సరాలు క్రితం కట్టించిన పురాతనమైన బురుజు కట్టడం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇన్ని వందల సంవత్సరాలు అయిన ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉన్న నిర్మాణంతో పాటు బురుజు లోపల నివసించే ఇల్లు కూడా ఉండడం విశేషం.. అసలు ఈ పురాతనమైన బురుజు ఎక్కడ ఉంది?.. దీని చరిత్ర ఏందో తెలుసుకుందాం.

కడపజిల్లా లోని జమ్మలమడుగు ప్రాంతంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలు, అద్భుతమైన కట్టడాలతో పాటు బ్రిటిష్ వారితో పోరాడిన గండికోట పౌరుషానికి ప్రతీకగా ఇప్పటికీ కొన్ని కట్టడాలు నిలిచి ఉన్నాయి. జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం మండలం పెద్ద ముడియం గ్రామంలో పురాతనమైన బురుజు కట్టడం ఉంది. దీని వయసు దాదాపు 300 సంవత్సరాలు పై మాటే. ఈ బురుజు నిర్మించి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికి ఆ బురుజు చెక్కు చెదరకుండా ఉందంటే అప్పటి కట్టడాలు ఎలా ఉండేవో అర్థం చేసుకోవచ్చు. పైగా ఈ పురాతనమైన బురుజు లో నివసించడానికి ఒక ఇల్లు కూడా ఉంది. ఇందులో ఒక కుటుంబం ఉండడానికి అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి. అయితే ఈ బురుజు కట్టడం చరిత్ర ఏంటి? ఎందుకు నిర్మించాల్సి వచ్చిందనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

పూర్వం 1800 సంవత్సరం లో పెద్ద ముడియంలో బైరెడ్డి సుబ్బా రెడ్డి వంశం ఉండేది. ఈ వంశం లో బైరెడ్డి లక్ష్మీ రెడ్డి, బైరెడ్డి రామిరెడ్డి, బై రెడ్డి ఈశ్వర్ రెడ్డి, బైరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, బైరెడ్డి మధు సూధన్ రెడ్డి వంశస్థులు ఉండేవారు. వీరు జమ్మలమడుగు లోనే అత్యంత ధనవంతులు, భూస్వాములు. పెద్దముడియం నుంచి కడప వరకు(100 కిలోమీటర్లు) రాణి రూపాయ బిళ్ళల(వెండి నాణేలు)తో రోడ్డు పై పరిస్తే ఎంత ఉంటుందో అంత డబ్బు బైరెడ్డి వంశస్థుల వద్ద ఉందని నానుడి. అంతేకాక సుమారు 300 ఎకరాల పైగా ఉండేది. ఈ బైరెడ్డి వంశానికి చెందిన బైరెడ్డి లక్ష్మీ రెడ్డి 1836 సంవత్సరంలో లండన్ లో బారిస్టర్ చదివారు. అయితే ఇంత ధనం, భూమి ఉన్న బైరెడ్డి వంశస్థులుకు శత్రువులు కూడా ఎక్కువే ఉన్నారు. ఈ బైరెడ్డి వంశస్థులు దగ్గర వెండి నాణేలు(రాణి రూపాయి బిళ్ళలు), అపారమైన ధనం ఉండడం తో వీరిపై దివిటి దొంగల ముఠా గుర్రాల పై అర్ధరాత్రి వచ్చి దాడులు చేసేది. వారి నుంచి ధనం ఎత్తుకొని వెళ్లేవారు. దీంతో బైరెడ్డి వంశస్థులు వినూత్నంగా ఆలోచించి అప్పటి కూలీలతో శత్రుదుర్భేద్యంగా బురుజు కట్టడం నిర్మించారు. అనంతరం ఈ బురుజు లోనే ధనం, వెండి నాణేలు(రాణి రూపాయి బిళ్ళలు) దాచుకునే వారని టాక్. దీంతో దివిటి దొంగలు ముఠా బైరెడ్డి వంశస్థులపై దాడి చేసి ధనం ఎత్తుకొని వెళ్లేందుకు వచ్చిన వారిని బురుజు పై నుంచి ముందే పసిగట్టి.. వారిపై పెద్ద గుండ్రాళ్ళతో దాడులు చేసేవారని, దాంతో ఆ దివిటి దొంగలు పారిపోయేవారని స్థానికులు చెబుతున్నారు. అంతేకాక ఆ కాలంలో బ్రిటిష్ వారు కూడా వీరిపై దాడులు చేశారని, వీళ్ళ దగ్గర ఉన్న డబ్బుని లాక్కోవాలని చూశారని టాక్. కానీ వీరు తిరగబడడంతో వీళ్ళ మధ్య గొడవలు కూడా జరిగాయని స్థానికులు అంటున్నారు. బ్రిటిష్ వారికి బై రెడ్డి వంశస్థులకు మధ్య వాగ్వాదం జరగడం తో బైరెడ్డి వంశస్థులపై అధిక పన్ను విధించి, అధిక డబ్బులు వసూలు చేస్తూ ఉండేవారని స్థానికులు చెబుతున్నారు.

ఈ పెద్దముడియం బురుజు కట్టడం అద్భుతం అని చెప్పుకోవాలి. శత్రుదుర్భేద్యంగా నిలిచి దండెత్తే దొంగల ముఠాను నిలవరించిన బురుజు. ఈ బురుజు లో ఇప్పటికీ నాడు వినియోగించిన గుండ్రాళ్ళు ఉండేవని, వాటిని కొన్ని నెలల క్రితం తొలగించారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ బురుజులో మరో ప్రత్యేకం ఏంటంటే.. శత్రువు కానీ, దొంగల ముఠా వస్తే బురుజు నుంచి దొంగలను చూడడానికి రెండు రంద్రాలు కూడా ఉన్నాయి. దీని ద్వారా శత్రువుల రాకను ముందే పసిగట్టి బురుజు పై నుంచి రాళ్లతో దాడులు చేసేవారని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రత్యేక మైన పురాతనమైన బురుజు కట్టడంలో సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్ కూడా తీసుకొని పొతుంటారని, పర్యాటకుల తాకిడి కూడా బాగా ఉంటుందని అక్కడి గ్రామాస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ బురుజు నిర్మించిన బైరెడ్డి వంశస్థులు ఉన్నత చదువులు చదువుకొని, ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో నివసిస్తున్నారని, అప్పుడప్పుడు వచ్చి బురుజును, ఇంటిని పరిశీలించి వెళ్తూ ఉంటారని గ్రామస్తులు చెబుతున్నారు.

Also read:

Medaram: మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మృతి.. రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధుల సంతాపం

Chiranjeevi: ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్‌.. తెలంగాణ సంప్రదాయాలకు బోనాలు ప్రతీక అంటూ.

Rains in Hyderabad: భాగ్యనగరంలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం