AP News: అన్నమయ్య జిల్లాలో విషాదం.. కుటుంబాన్ని కాపాడి తనువు చాలించిన యువతి.. వాగులో కారు కొట్టుకుపోతుండగా..
ఏపీలోని అన్నమయ్య జిల్లా బి కొత్తకోట వద్ద సంపతి కోటలో జరిగిన హృదయాలను మెలిపెట్టే ఈ విషాద ఘటన జరిగింది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు సంపతి కోట ఉధృతంగా ప్రవహిస్తోంది.
Annamayya District: ముక్కుపచ్చలారని బిడ్డ. బీటెక్ చదవుతున్న ఆ యువతికి నిండా పాతికేళ్ళు కూడా లేవు. ఎన్నెన్నో ఆశలను కళ్ళల్లో నింపుకున్న కలల కూన. తన వారికోసం తపించింది. ఆఖరి క్షణం వరకు కుటుంబం కోసం అల్లాడిపోయింది. తన వారిని రక్షించుకునేందుకు ఊపిరిబిగబట్టి చివరి శ్వాస వరకు తహతహలాడింది. చివరకు వరదలో కొట్టుకుపోతున్న తన వారందరినీ రక్షించి తను మాత్రం శాశ్వతంగా కన్నుమూసింది. జలసమాధి అయ్యింది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికులను కన్నీరుమున్నీరయ్యేలా చేస్తోంది. ఆ గ్రామాస్తులను బోరున విలపించేలా చేస్తోంది. ఏపీలోని అన్నమయ్య జిల్లా బి కొత్తకోట వద్ద సంపతి కోటలో జరిగిన హృదయాలను మెలిపెట్టే ఈ విషాద ఘటన జరిగింది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు సంపతి కోట ఉధృతంగా ప్రవహిస్తోంది. స్థానిక ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ రమణ కుటుంబం బెంగుళూరు నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తోంది. వాగుదాటుతుండగా వరదఉధృతికి నీటిలో కొట్టుకుపోయింది కారు.
అదే కారులో ఉన్న రమణ కూతురు 22 ఏళ్ళ మౌనిక భయపడలేదు. బెంబేలెత్తిపోలేదు. తన కుటుంబాన్ని ఎలాగైనా రక్షించుకోవాలని ఆలోచించించి. మౌనిక తక్షణమే స్పందించింది. తన దగ్గరున్న ఫోన్‌లో నుంచి స్థానికులకు ఫోన్ చేసి అప్రమత్తం చేసింది. తక్షణమే వాగువద్దకు ఉరుకులు పరుగులతో చేరుకున్నారు స్థానికులు. వాగు నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో కొట్టుకుపోయిన కారును తాళ్ళతో స్థానికుల సాయంతో పోలీసులు బయటకు చేర్చారు. కారులో ఉన్న డ్రైవర్‌తో సహా మరో ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. అయితే కారులో ఉన్న వారందరినీ రక్షించేందుకు కొన ఊపిరి వరకు యత్నించిన మౌనిక మాత్రం తుదిశ్వాస వీడింది. బహుశా తన వారిని కాపాడే ప్రయత్నంలో తన రక్షణను మరచి ఉంటుందేమో ఆ తల్లి. అనంతరం మౌనిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం మౌనిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తన కోసమే కాదు, తన చుట్టూ ఉన్న వారికోసం పరితపించే మనసున్న ఆ ఆడపిల్ల మరణం చుట్టుపక్కల గ్రామాల ప్రజల హృదయాలను కలచివేస్తోంది. అందరికీ ఫోన్ చేసి తనవాళ్ళను బతికించుకునే గొప్ప కార్యంలో తన ప్రాణాలను పణంగా పెట్టిందంటూ ఆ యువతి గొప్పతనాన్ని కొనియాడుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి