Andhra: వేకువజామున బాత్రూమ్‌లో అదో మాదిరి శబ్దాలు.. ఏంటా అని టార్చ్ వేయగా
వేకువజామున దినసరి పనులు చేసే క్రమంలో బాత్రూం దగ్గరకు వెళ్లిన ఓ వ్యక్తి.. అదో మాదిరి శబ్దాలు విన్నాడు. ఏంటా అని లైట్ వేసి చూడగా.. దెబ్బకు అక్కడ కనిపించిన సీన్ చూసి.. షాక్ అయ్యాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

పార్వతీపురం మన్యం జిల్లా కురపాం మండలం కిచ్చాడలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తి ఇంట్లో పదడుగులు పొడవైన కింగ్ కోబ్రా హాల్‌చల్ చేసింది. తెల్లవారుజామున శివ కుటుంబసభ్యులు దినసరి కార్యక్రమాల్లో భాగంగా ఇంటి ఆవరణలో ఉన్న బాత్రూంలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. ఆ సమయంలోనే బాత్రూమ్ లోపల నుంచి భయానక శబ్దాలు వినిపించాయి. దీంతో ఉలిక్కిపడి బాత్రూమ్ లోపల చూసేసరికి పెద్ద కింగ్ కోబ్రా బుసలు కొడుతూ పడగ విప్పి కనిపించింది. దెబ్బకు భయంతో ఇంటి నుంచి బయటకి పరుగులు తీశారు. తర్వాత స్థానికులకు విషయం తెలియజేశారు. ఫారెస్ట్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అటవీశాఖ అధికారులు స్నేక్ క్యాచర్‌ను పిలిచి కింగ్ కోబ్రాను పట్టుకోవాలని సూచించారు. అయితే కింగ్ కోబ్రాను బంధించడానికి స్నేక్ క్యాచర్ ముప్పుతిప్పలు పడ్డాడు. స్నేక్ క్యాచర్‌పై సైతం తిరగబడుతూ బీభత్సం సృష్టించింది. అటవీశాఖ అధికారులతో పాటు స్థానికులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా అలజడిగా మారింది. స్థానికుల శబ్దాలతో కింగ్ కోబ్రా మరింత రెచ్చిపోయి జనాలపై వచ్చే ప్రయత్నం చేసింది.
ఈ పరిణామాలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. ఎట్టకేలకు కింగ్ కోబ్రాను జాగ్రత్తగా బంధించి సమీప అటవీ ప్రాంతంలో వదిలివేశారు. గత కొద్ది నెలలుగా ఈ ప్రాంతంలో కింగ్ కోబ్రాలు తరచూ కనిపిస్తున్నాయని.. పక్కనే ఉన్న అటవీ ప్రాంతం నుంచి తమ ఇళ్లు, పొలాల్లోకి వస్తున్నాయని చెబుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే స్థానికులు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇళ్లు చుట్టూ చెత్తాచెదారం లేకుండా, పొదలు పెరగనీయకుండా చూడాలని సూచిస్తున్నారు. పాములు కనిపిస్తే వాటిని చంపకుండా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు.
ఇది చదవండి: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. వీటిల్లో మహిళలకు ఫ్రీ జర్నీ వర్తించదు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
