మరోసారి కాల్పులమోతతో దద్దరిల్లిన కాలిఫోర్నియా.. చిన్నారితోసహా నలుగురు వ్యక్తులు దుర్మరణం

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో బుధవారం మరోసారి కాల్పులమోతతో దద్దరిల్లింది. ఓరెంజ్‌ నగరంలోని ఓ షాపింగ్ మాల్‌లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.

  • Balaraju Goud
  • Publish Date - 5:57 pm, Thu, 1 April 21
మరోసారి కాల్పులమోతతో దద్దరిల్లిన కాలిఫోర్నియా.. చిన్నారితోసహా నలుగురు వ్యక్తులు దుర్మరణం
California Office Building Shooting Kills 4 Including Child

california shooting: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో బుధవారం మరోసారి కాల్పులమోతతో దద్దరిల్లింది. ఓరెంజ్‌ నగరంలోని ఓ షాపింగ్ మాల్‌లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఒక చిన్నారి తోసహా నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మ‌ృత్యువాతపడ్డారు. మరో వ్యక్తి తీవ్రగాయాల పాలయ్యాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను తరలించి దర్యాప్తు చేపట్టారు.

ఓరెంజ్‌ పోలీసు ఉన్నతాధికారి జెన్నీఫర్‌ దాడికి సంబంధించిన సమాచారాన్ని మీడియాకు వెల్లడించారు. ‘నగరంలోని ఓ షాపింగ్ మాల్‌లో కాల్పులు జరిగినట్లు సమాచారం అందింది. ఈ క్రమంలో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో పోలీసులుకు నిందితుడికి మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, దాడికి గల కారణాలేంటనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు’ అని జెన్నీఫర్‌ తెలిపారు. కాగా, రెండు వారాల వ్యవధిలో అమెరికాలో కాల్పుల సంఘటనలు చోటుచేసుకోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

ఇటీవల అట్లాంటాలో వేర్వేరు మసాజ్‌ పార్లర్లపై గుర్తుతెలియని వ్యక్తి జరిపిన దాడిలో ఎనిమిది మంది మరణించిన విషయం తెలిసిందే. బాధితుల్లో ఎక్కువ మంది ఆసియన్‌ అమెరికన్లే. దీంతో ఆసియన్‌ అమెరికన్లపై హింస ఆపాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సహా పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. ఇలాంటి దాడులపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని బైడెన్‌ హెచ్చరించారు.

Read Also…  మాట ఇచ్చి తప్పిన అనుష్క శర్మ..! విరాట్‌ ఒప్పుకునేనా..? సోషల్‌ మీడియాల్ వైరల్‌ అవుతున్న వీడియో.. మీరు ఓ లుక్కేయండి..