World suicide prevention day 2021: చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు.. ఆత్మహత్యలను నివారించవచ్చు..!
ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. చాలా చిన్న కారణాలకే కొందరు తమ ఉసురు తీసేసుకుంటున్నారు.
World suicide prevention day 2021: ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. చాలా చిన్న కారణాలకే కొందరు తమ ఉసురు తీసేసుకుంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెబుతున్న దాని ప్రకారం 15 నుండి 19 సంవత్సరాల వయస్సు గల యువతలో మరణానికి నాలుగో ప్రధాన కారణం ఆత్మహత్య. ప్రపంచవ్యాప్తంగా ఏటా 7 లక్షల మందికి పైగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇందులో 77 శాతం కేసులు తక్కువ, మధ్య ఆదాయ దేశాల నుండి ఉంటున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం, చాలా మంది ప్రజలు పురుగుమందులు తాగి, ఉరి వేసుకుని, ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయితే, ఇటువంటి ఆత్మహత్యలను నియంత్రించ వచ్చని WHO చెబుతోంది. నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆత్మహత్య కేసులను ఎలా నివారించవచ్చో వివరించింది.
ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు.
WHO ప్రకారం, డిప్రెషన్.. మద్యం వాడకం ఆత్మహత్యలకు ప్రధాన కారణాలలో ఒకటి. ఆర్థికపరమైన అడ్డంకులు, సంబంధం విచ్ఛిన్నం, వ్యాధులు దీనికి కారణం కావచ్చు.
ఆత్మహత్య కేసులను ఎలా నివారించాలి
మానసిక వైద్య నిపుణులు చాలావరకూ ఆత్మహత్య కేసులను నివారించే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఆత్మహత్యకు ముందు, కొంతమంది ప్రదర్శించే నిర్దిష్ట లక్షణాలను అర్థం చేసుకోవడం ద్వారా దానిని నివారించవచ్చు. ఉదాహరణకు, వారు సమస్య గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. నిత్యం ఆ సమస్య పైనే వారు మాట్లాడతారు. అలాగే ఆత్మహత్య చేసుకోవడం గురించి మాట్లాడటం లేదా ఆత్మహత్య చేసుకునే మార్గాలను వెతుకుతూ గంటలు గడుపుతారు. వారు తమను తాము ఇతరులపై భారంగా భావించడం మొదలుపెడతారు లేదా నొప్పి/అనారోగ్యం నుండి బయటపడటానికి ఆత్మహత్య గురించి మాట్లాడతారు. ఇది కాకుండా, వీలైనంత త్వరగా వీలునామా సిద్ధం చేయడం, వీడ్కోలు సందేశాలు రాయడం, ఎప్పుడూ డిప్రెషన్‌లో ఉండటం, ఫోన్ తీయకపోవడం, అకస్మాత్తుగా స్నేహితులు.. సన్నిహితులతో కూడా మాట్లాడకుండా ఉండిపోవడం వంటివి హెచ్చరిక లక్షణాలు.
మీ చుట్టుపక్కల ఎవరైనా అలాంటి లక్షణాలను చూసినట్లయితే, వాటిని విస్మరించవద్దు. వారితో మాట్లాడాలి. వారి ఇబ్బంది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సాధారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. వారి సమస్యలను అర్ధం చేసుకోవడం కోసం వారితో సున్నితంగానే వ్యవహరించాలి. వారి పాయింట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారి సమస్య విన్న తర్వాత పరిష్కారం కనుగొనండి. ఇది వారి దృష్టిని మరల్చి, ఆత్మహత్య ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఆత్మహత్య కేసులను నివారించడానికి.. ఎవరైనా ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని మీకు బలంగా అనిపిస్తే ముందుగా వారిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. పురుగుమందులు, తుపాకులు, కొన్ని మందులు అందుబాటులో ఉండకుండా ఉంచాల్సిన అవసరం ఉందని WHO చెబుతోంది. ప్రారంభ లక్షణాల నుండి ముందుగానే గుర్తించడంతో పాటు, వ్యక్తుల ప్రవర్తనను అర్థం చేసుకోవడం ద్వారా కూడా అలాంటి కేసులను నివారించవచ్చు.
మనదేశంలో 2015 నుంచి 2019 వరకూ ఐదేళ్ళలో ఆత్మహత్యల కేసుల వివరాలు ఇలా ఉన్నాయి..
మన దేశంలో
- 2015లో 1.33 లక్షల మంది
- 2016లో 1.31 లక్షల మంది
- 2017లో 1.29 లక్షల మంది
- 2018లో 1.34 లక్షల మంది
- 2019లో 1.39 లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
ఇక 2018 సంవత్సరంతో పోలిస్తే 2019లో బలవన్మరణాలు 3.4 శాతం పెరిగాయి. 18-30 సంవత్సరాల మద్య వయస్కుల్లో ఈ బలవన్మరణాల కేసులు ఎక్కువగా ఉన్నాయి. వీరిలో ఎక్కువ మంది కుటుంబ వివాదాలతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇక ఆత్మహత్యలకు రెండో ప్రధాన కర్ణం అనారోగ్యం. అలాగే పెళ్లికి సంబంధించిన ఇబ్బందులతో తమ జీవితాన్ని చాలించిన వారు మూడో స్థానంలో ఉన్నారు. అదేవిధంగా ప్రేమ సంబంధిత వ్యవహారాల వల్ల మరణించిన వారి సంఖ్య నాలుగో స్థానంలోనూ మత్తు మందుల వ్యసనం కారణంగా ఆత్మహత్యలకు పాల్పడ్డవారి సంఖ్య ఐదో స్థానంలోనూ ఉంది.
ఈ రోజు ఎందుకు ఆత్మహత్యల నివారణ దినం పాటిస్తారు?
ఆత్మహత్యల నివారణ దినం మొదటిసారి 10 సెప్టెంబర్ 2003 న ప్రారంభమైంది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ (IASP), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సంయుక్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్య కేసులను నివారించడానికి చొరవ తీసుకున్నాయి. ఈ రోజు జరుపుకున్న మొదటి సంవత్సరం విజయవంతమైంది. కాబట్టి 2004 లో, WHO అధికారికంగా దాని చేరికను ప్రకటించింది. ఈ విధంగా, ఈ రోజు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10 న జరుపుకుంటారు. IASP ఆత్మహత్య కేసులను నివారించడానికి 60 కి పైగా దేశాలలో వందలాది కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
Also Read: Vaccination: ఈ రాష్ట్రాలలో 100 శాతం టీకాలు వేయడం పూర్తి..! మీ రాష్ట్రం ఇందులో ఉందా..?