అక్కడ పిజ్జా ఆర్డర్లు పెరిగాయా.. ప్రపంచంలో ఎక్కడో యుద్ధం మొదలైనట్టే.. అసలు సీక్రెట్ ఏంటంటే…?
అగ్రరాజ్యం అమెరికా యుద్ధానికి సిద్ధమైతే.. ఆ విషయం గూఢచారుల కంటే ముందుగా పిజ్జా డెలివరీ బాయ్స్‌కు తెలిసిపోతుందా? వినడానికి వింతగా ఉన్నా.. పెంటగాన్ పిజ్జా థియరీ ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. తాజాగా వెనెజువెలా అధ్యక్షుడి అరెస్ట్ వెనుక ఉన్న ఆపరేషన్‌ను కూడా ఈ పిజ్జా ఆర్డర్లే ముందుగా పసిగట్టాయనే చర్చ జోరందుకుంది. అసలు పిజ్జాలకు, యుద్ధాలకు ఉన్న ఆ విడదీయరాని సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా. అక్కడ రక్షణ శాఖ కార్యాలయమైన పెంటగాన్‌లో ఏం జరిగినా అది ప్రపంచంపై ప్రభావం చూపుతుంది. అయితే పెంటగాన్ లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇంటెలిజెన్స్ అధికారులే అవసరం లేదు బయట పిజ్జా డెలివరీలను గమనిస్తే చాలని ఒక వింత ప్రచారం ఉంది. దీన్నే పెంటగాన్ పిజ్జా థియరీ అని పిలుస్తారు. తాజాగా వెనెజువెలాపై అమెరికా జరిపిన మెరుపు దాడితో ఈ థియరీ మరోసారి సంచలనంగా మారింది.
ఏమిటీ పెంటగాన్ పిజ్జా థియరీ?
సాధారణంగా అమెరికా ఏదైనా సైనిక ఆపరేషన్ లేదా యుద్ధం ప్లాన్ చేస్తున్నప్పుడు రక్షణ శాఖ, ఇంటెలిజెన్స్ అధికారులు రాత్రంతా కార్యాలయాల్లోనే ఉండి పని చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో వారు బయట నుంచి క్విక్ ఫుడ్‌గా పిజ్జాలను భారీగా ఆర్డర్ చేస్తారు. పెంటగాన్ పరిసరాల్లోని అవుట్‌లెట్లకు ఒక్కసారిగా ఆర్డర్లు పెరిగాయంటే.. ప్రపంచంలో ఎక్కడో ఒకచోట యుద్ధం లేదా అలజడి మొదలైందని అర్థం చేసుకోవచ్చని నెటిజన్ల నమ్మకం.
వెనెజువెలా దాడి
గత శనివారం తెల్లవారుజామున 2 గంటల నుండి 3:30 గంటల మధ్య పెంటగాన్ సమీపంలోని పిజ్జా అవుట్‌లెట్లలో సేల్స్ అమాంతం పెరిగాయి. ఆశ్చర్యకరంగా.. సరిగ్గా గంటన్నర తర్వాత ఆర్డర్లు పూర్తిగా ఆగిపోయి జీరో ట్రాఫిక్ కనిపించింది. అదే సమయంలో వెనెజువెలాపై అమెరికా దళాలు దాడి చేసి, ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్బంధించి అమెరికాకు తరలించడం గమనార్హం.
ప్రచ్ఛన్న యుద్ధం నుంచే ఈ ట్రెండ్
ఈ థియరీ నిన్న మొన్నటిది కాదు, దశాబ్దాలుగా వినిపిస్తోంది. 1990లో కువైట్‌పై ఇరాక్ దాడికి ముందు CIA కార్యాలయానికి పిజ్జా ఆర్డర్లు పెరిగాయి.1989 పనామా దాడి, 1999 సెర్బియా బాంబు దాడులు, 2003 ఇరాక్ యుద్ధం, 2022 రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలోనూ ఇదే తరహాలో పిజ్జా సేల్స్ పెరిగాయని ట్రాకర్లు చెబుతుంటారు. 2024-25 ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల సమయంలోనూ ఇదే ట్రెండ్ రిపీట్ అయ్యింది.
నిజమా..? యాదృచ్ఛికమా..?
దీనిపై ఎటువంటి అధికారిక లేదా శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ కీలక ఆపరేషన్ల సమయంలో అధికారులు ఆఫీసుల్లోనే తిష్ట వేయడం, ఆ సమయంలో పిజ్జా లాంటి త్వరగా వచ్చే ఆహారం కోసం ఆర్డర్ చేయడం సహజం. ఇది కేవలం కాకతాళీయం అని కొందరు కొట్టిపారేసినా అంతర్జాతీయ ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారీ పిజ్జా మీటర్ మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వస్తూనే ఉంది.
