రోజూలో ఒక్కసారైనా బిగ్గరగా నవ్వాల్సిందే.. ఆ దేశంలో ప్రత్యేక చట్టం.. ఎందుకంటే
నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వక పొతే ఒక రోగం అని పెద్దలు చెప్పినా.. నవ్వుతూ బతికలిరా తమ్ముడు.. నవ్వుతూ చావాలిరా .. చచ్చాక నవ్వలేము.. కనుక ఎపుడూ నవ్వుతూ జీవించమని ఓ సినీ కవి తనదైన స్టైల్ లో చెప్పినా దీని ప్రధాన ఉద్దేశ్యం నవ్వడం ఆరోగ్యానికి మంచిది అనే.. మనం ఈ మాటలు ఎంత సీరియస్ గా తీసుకుని జీవితంలో అమలు చేస్తున్నామో తెలియదు కానీ.. ఎక్కడో ఉన్న జపాన్ దేశం మాత్రం నవ్వడం విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. కనీసం ఒక నిర్దిష్ట ప్రాంతంలో, ఒక నియమం ప్రకారం రోజులో ఒక్కసారైనా నవ్వాలని తమ దేశ ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది.

నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వక పొతే ఒక రోగం అని పెద్దలు చెప్పినా.. నవ్వుతూ బతికలిరా తమ్ముడు.. నవ్వుతూ చావాలిరా .. చచ్చాక నవ్వలేము.. కనుక ఎపుడూ నవ్వుతూ జీవించమని ఓ సినీ కవి తనదైన స్టైల్ లో చెప్పినా దీని ప్రధాన ఉద్దేశ్యం నవ్వడం ఆరోగ్యానికి మంచిది అనే.. మనం ఈ మాటలు ఎంత సీరియస్ గా తీసుకుని జీవితంలో అమలు చేస్తున్నామో తెలియదు కానీ.. ఎక్కడో ఉన్న జపాన్ దేశం మాత్రం నవ్వడం విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. కనీసం ఒక నిర్దిష్ట ప్రాంతంలో, ఒక నియమం ప్రకారం రోజులో ఒక్కసారైనా నవ్వాలని తమ దేశ ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఓ చట్టాన్ని కూడా తీసుకుని వచ్చింది. ప్రస్తుతం నవ్వు మీద తీసుకుని వచ్చిన ఈ చట్టం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
మెరుగైన ఆరోగ్యం, జీవిత కాలంపై పరిశోధన
నవ్వడం అత్యంత ఆరోగ్యకరమని.. రోజుకు ఒక్కసారైనా మనస్పూర్తిగా నవ్వితే గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఉత్తర జపాన్‌లోని యమగటా ప్రిఫెక్చర్‌లో, స్థానిక విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనంలో వెల్లడైంది. దీంతో తమ పౌరులు రోజుకు కనీసం ఒక్కసారైనా నవ్వాలని గత వారం ఒక ఆర్డినెన్స్ చేయడమే కాదు ఇది ఆమోదించబడింది కూడా.. యమగటా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ బృందం మెరుగైన ఆరోగ్యం, జీవిత కాలం పెంపు వంటి అంశాలపై అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ బృందం చేసిన అధ్యయనంలో నవ్వు వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వెల్లడైంది. ఈ అధ్యయన ఫలితమే తాజా నవ్వుల చట్టం.
నవ్వుల చట్టంలో విధులు
ఈ నవ్వుల చట్టం నియమం ప్రకారం యమగటా పౌరులు “నవ్వవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి మరింత అవగాహనను మరింతగా పెంచుకుంటారు. రోజుకు ఒకసారి నవ్వడం వంటి మార్గాల ద్వారా మానసిక , శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారని చెబుతోంది స్థానిక ప్రభుత్వం. ఉద్యోగస్తులు, ఇతర పని చేసే ప్రాంతాల్లో కూడా “నవ్వులతో నిండిన వాతావరణాన్ని” సృష్టించాలని నిర్దేశించారు. ప్రతి నెల ఎనిమిదవ తేదీని “నవ్వుల రోజు”గా గుర్తించి నవ్వును మరింత ప్రోత్సహించాలని తెలిపింది.
వ్యతిరేకిస్తున్న రాజకీయ నేతలు
అయితే ఈ నియమాన్ని చాలా మంది రాజకీయ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఇది ప్రజల రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే అని అంటున్నారు. అంతేకాదు నవ్వలేని వారిపై ఈ చట్టం ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవ్వడం లేదా నవ్వకపోవడం అనేది ఆలోచన, విశ్వాసం, అంతర్గత స్వేచ్ఛకు సంబంధించి రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక మానవ హక్కులలో ఒకటి అని జపాన్ కమ్యూనిస్ట్ పార్టీ అసెంబ్లీ సభ్యుడు టోరు సెకి అన్నారు. అనారోగ్యంతో లేదా ఇతర కారణాల వల్ల నవ్వడానికి ఇబ్బందులు ఉన్నవారి మానవ హక్కులను అణగదొక్కకూడదని కొంత మంది అంటున్నారు. మరికొందరు నవ్వడం మంచి విషయమే అయినప్పటికీ.. అది ఎప్పటికీ వ్యక్తిగత ఎంపిక అని .. చట్టం ద్వారా ప్రజలను బలవంతం చేయకూడదని అంటున్నారు.
నవ్వుల అధ్యయనం ఎలా సాగిందంటే
40 లేదా అంతకంటే తక్కువ వయస్సు గల దాదాపు 17,152 మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వారు తమ నవ్వుల ఫ్రీక్వెన్సీని వివరించే ప్రశ్నాపత్రాన్ని పూర్తి చేశారు. అనంతరం వీరి ఆరోగ్యం చాలా సంవత్సరాలుగా ట్రాక్ చేయబడింది. నెలలో ఒక్కసారైనా నవ్వేవారితో పోలిస్తే వారానికి ఒక్కసారైనా నవ్వేవారికి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అయితే “బిగ్గరగా నవ్వడం” మాత్రమే నవ్వుగా పరిగణించబడుతుంది.. నెమ్మదిగా లేదా చిరుమంద హసాన్ని అధ్యయనంలో పరిగణనలోకి తీసుకోలేదు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




