అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకుల దుర్మరణం..!
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లోరిడాలోని I-95పై జరిగిన ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొని మంటల్లో చిక్కుకుంది. మృతులలో నిజామాబాద్ జిల్లాకు చెందిన రాహుల్ ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిన రాహుల్ దుర్మరణం చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఫ్లోరిడాలోని బ్రెవార్డ్ కౌంటీలో ఇంటర్‌స్టేట్-95 (I-95)పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లోరిడా హైవే పెట్రోల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం (ఆగస్టు 25) ఉదయం 10 గంటలకు కొద్దిసేపటి ముందు పామ్ బే ప్రాంతంలోని 172వ మైలురాయి వద్ద ప్రమాదం జరిగింది.
వేగంగా ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఢీకొన్న తీవ్రతకు వాహనం మంటల్లో చిక్కుకున్నట్లు ట్రూపర్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. మృతుల గుర్తింపు వివరాలు తొలుత వెల్లడించలేదు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
అయితే మృతుల్లో ఒకరిని నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నారాయణపూర్ (నాడాపూర్)కు చెందిన రాహుల్ ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హరిబాబు, నాగమణి దంపతుల కుమారుడైన రాహుల్ ఉన్నత చదువుల కోసం కేవలం మూడు నెలల క్రితమే అమెరికా వెళ్లినట్లు సమాచారం. అమెరికాలో చదువుకుంటూ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రాహుల్ ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
ప్రమాదంలో మృతి చెందిన మరో ఇద్దరు యువకులు కూడా తెలంగాణకు చెందిన వారిగా సమాచారం. అయితే వారి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. రాహుల్ మృతితో నారాయణపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, మృతదేహాల తరలింపు తదితర అంశాలపై అధికారులు, కుటుంబ సభ్యులు సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
