అమెరికాలో ఓనం సంబరాలు: అరిటాకులో సద్య వడ్డిస్తున్న రెస్టారెంట్లు!
అమెరికాలో ఓనం సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. కేరళీయుల చరిత్ర సంస్కృతిని ప్రతిబింబించే ఈ పండుగను మలయాళీ ప్రవాసులు ఘనంగా జరుపుకుంటున్నారు. మహాబలి చక్రవర్తి రాకను పురస్కరించుకుని ఈ వేడుకను నిర్వహిస్తారు. అమెరికాలోని రెస్టారెంట్లు సంప్రదాయ శాఖాహార ఓనం విందును సిద్ధం చేశాయి

అమెరికాలో మలయాళీలు ఆగస్టు 26న ఘనంగా ఓనం పండుగ జరుపుకుంటున్నారు. ఆగస్టు 16న ప్రారంభమై ఆగస్టు 26, బుధవారం జరిగే ప్రధాన ఉత్సవం తిరుఓణంతో వేడుకలు ముగిసాయి. మహాబలి చక్రవర్తి జ్ఞాపకార్థంగాను, పంట చేతికి వచ్చిన సంతోషంతోనూ ఈ పండుగను జరుపుకుంటారు.
అమెరికాలో సద్య వడ్డించడానికి ‘అడయార్ ఆనంద భవన్’, ‘అంజప్పర్’ వంటి రెస్టారెంట్లు ముందుకొచ్చాయి. ‘బీట్స్ ఆఫ్ కేరళ’, ‘చాయ్ కడ’ కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నాయి. అరటి ఆకులో రుచికరమైన వంటకాలను వడ్డించి ప్రవాసులకు స్వగ్రామం అనుభూతిని పంచుతున్నాయి.
కేరళ ప్రవాసీయులకు సద్య మధుర అనుభూతి
ఓనం సద్య అనేది ఒక సంప్రదాయ శాఖాహార విందు. ఇది తాజా అరటి ఆకుపై వడ్డిస్తారు. ఇందులో తీపి, పులుపు, ఉప్పు, కారం కలగలిపిన 20కి పైగా వంటకాలు ఉంటాయి. మట్టా రైస్, సాంబార్, రసం, అవియల్, తోరన్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ. చివరగా అడ ప్రథమన్, పప్పు పాయసం వంటి తీపి పదార్థాలతో ఈ విందు పూర్తవుతుంది. రెస్టారెంట్లు అందిస్తున్న టేక్-అవుట్ కిట్లను కొందరు కొనుగోలు చేస్తున్నారు. ఈ వేడుకల ద్వారా ప్రవాసులు తమ సంస్కృతిని కాపాడుకుంటూ, వచ్చే తరానికి దాన్ని అందిస్తున్నారు.
ఓనం పండుగ విశిష్టతను చూసినట్లయితే బలి చక్రవర్తి రాకను స్వాగతిస్తూ ప్రజలు పండుగ చేసుకుంటారు. పురాణాల ప్రకారం ప్రహ్లాదుని మనవడైన బలి చక్రవర్తి రాక్షస వంశానికి చెందిన వాడైనప్పటికీ అపర దానకర్ణుడిగా పేరు పొందాడు. తన తాత ప్రహ్లాదుని బాటలో ప్రజలను కన్నబిడ్డల్లా కంటికిరెప్పలా కాపాడుతూ రాజ్యాన్ని పాలించాడు. నిజానికి మహాబలి పాలించిన సమయం కేరళకు స్వర్ణ యుగం. ఆ సమయంలో ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సుఖంగా సిరిసంపదలతో ఉన్నారు. ఆ దేశ ప్రజలందరూ తమ రాజుని చాలా గౌరవించేవారు.
వ్యాస మహర్షి రాసిన వామన పురాణం ప్రకారం రాక్షసుల నుంచి భూమాతను రకించడానికి శ్రీ మహావిష్ణువు వామనావతారం స్వీకరించి బలి చక్రవర్తి నుంచి మూడు అడుగుల నేలను దానంగా కోరతాడు. ఒక అడుగు భూమిపై, రెండో అడుగు ఆకాశంపై పెట్టిన తర్వాత మూడో అడుగు ఎక్కడ పెట్టాలని శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తిని అడుగుతాడు. దానం కోరుతుంది సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అని తెలుసుకుని మూడో అడుగు తన శిరస్సుపై వేయమని చెబుతాడు.
బలి చక్రవర్తి దానశీలతకు మెచ్చి ఏదైనా వరం కోరుకోమన్నాడు శ్రీమహావిష్ణు. అప్పుడు బలి చక్రవర్తి ఏడాదికోసారి తాను భూలోకానికి వచ్చి తన ప్రజలను చూసుకునేలా వరం ఇవ్వమని కోరుకున్నాడట! అప్పుడు విష్ణుమూర్తి అలాగేనని వరాన్ని అనుగ్రహించి, బలి చక్రవర్తిపై తన మూడో అడుగు వేసి పాతాళానికి అణిచివేస్తాడు.
ఆనాటి నుంచి బలి చక్రవర్తి ఏడాదికోసారి తన ప్రజలను చూసుకోవడానికి భూలోకానికి వస్తాడని విశ్వాసం. బలి చక్రవర్తి రాకను ఓనం పండుగగా జరుపుకోవడం ఆనాటి నుంచి కేరళీయుల సంప్రదాయంగా మారింది. అందుకే బలి చక్రవర్తి సప్త చిరంజీవుల్లో ఒకరుగా నిలిచారు.
ఆ విధంగా భూలోకానికి వచ్చే బలి చక్రవర్తికి ఆహ్వానం పలకడానికి ప్రజలు తమ ఇంటిముందు ఆవుపేడతో అలికి రంగురంగుల పూలతో ముగ్గులు వేసి స్వాగతం పలుకుతారు. అదృశ్యంగా బలి చక్రవర్తి తమ ఇంటికి వస్తారనే భావనతో రకరకాల వంటకాలు సిద్ధం చేసి ఉంచుతారు.
ఓనం ప్రత్యేకత అంతా సద్యలోనే ఉంటుంది. నోరూరించే ప్రత్యేక వంటకాలతో తయారయ్యే భోజనాన్ని సద్య అంటారు. పచ్చని అరటాకులో సుమారు 26 రకాల వంటకాలతో కూడిన మహా విందును తయారు చేసి, దేవునికి నివేదించి బంధుమిత్రులతో కలిసి ఈ ప్రత్యేక విందుని ఆరగిస్తారు.