UAE Weather: ఎడారి దేశంలో కుండపోత వర్షాలు… నదులను తలపించిన రహదారులు.. పలు విమానాలు రద్దు..

|

Mar 11, 2024 | 6:57 AM

UAEలో కుండపోత వర్షాలు కురిసాయి. దుబాయ్‌లో రోడ్లు నదులను తలపించాయి. భారీ వర్షాలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులుపడ్డారు. దుబాయ్ సంవత్సర సగటు వర్షపాతం 120 మిల్లీమీటర్లుగా ఉండగా.. నిన్న 6 గంటల్లోనే 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

UAE Weather: ఎడారి దేశంలో కుండపోత వర్షాలు... నదులను తలపించిన రహదారులు.. పలు విమానాలు రద్దు..
Heavy Rains In Uae
Follow us on

ఎడారి దేశం తడిసి ముద్దయింది. కుండపోత వర్షాలతో ఎడారి దేశం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. వర్షాల ధాటికి దుబాయ్ లోని రహదారులు నదులను తలపించాయి. UAEలోని దుబాయ్‌, అబుదాబీలో కుండపోత వర్షం కురిసింది. సుమారు ఆరు గంటల పాటు ఏకధాటిగా కుండపోతగా భారీ వర్షం కురిసింది. ఈ వర్షం 50 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. రోడ్ల మీద నిలిచిపోయిన వర్షపు నీటితో రవాణాకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వాహనదారులు. దీంతో రెస్క్యూ బృందం రంగంలోకి దిగింది. రహదారులపై ఉన్న నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.

దుబాయ్ సంవత్సర సగటు వర్షపాతం 120 మిల్లీమీటర్లుగా ఉండగా.. నిన్న 6 గంటల్లోనే 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

పలు విమానాలు రద్దయ్యాయి. భారీ వర్షాల కారణంగా యుఎఇ జాతీయ వాతావరణ కేంద్రం పలు ప్రాంతాల్లో ఎల్లో, ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలకు, బీచ్‌లకు దూరంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాలతో.. 45 డిగ్రీల ఎండలతో ఉక్కపోతలతో అల్లాడే జనానికి కాస్త ఉపశమనం లభించింది.

అటు ఇండోనేసియాలో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. సుమత్రా ద్వీపంలో కొండచరియలు విరిగిపడడం, ఆకస్మిక వరదలు సంభవించడం వల్ల పది మంది ప్రాణాలు కోల్పాయారు. దాదాపు 70వేల మంది నిరాశ్రయులయ్యారు. 21 మంది ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దేశంలో పడాంగ్‌ సహా మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో దాదాపు 200 ఇళ్లు నేల మట్టమయ్యాయి. పలు చోట్ల వంతెనలు, రోడ్లు దెబ్బతిన్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..