ఎప్పుడూ చూడని అద్భుతం.. అబూదాబీ BAPS హిందూ మందిరం సందర్శించిన యూఏఈ అధ్యక్షుడి సలహాదారు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడికి సాంస్కృతిక సలహాదారుగా, యూఏఈ యూనివర్సిటీ ఛాన్సలర్‌గా వ్యవహరిస్తున్న జాకీ అన్వర్ నుస్సైబెహ్ ఇటీవల అబూదాబీలోని BAPS హిందూ మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఈ దేవాలయాన్ని ‘21వ శతాబ్దపు పునర్జన్మ (21st Century Renaissance)’ అని వ్యాఖ్యానించారు.

అబూదాబీ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడికి సాంస్కృతిక సలహాదారుగా, యూఏఈ యూనివర్సిటీ ఛాన్సలర్‌గా వ్యవహరిస్తున్న జాకీ అన్వర్ నుస్సైబెహ్ ఇటీవల అబూదాబీలోని BAPS హిందూ మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.
బాప్స్ మందిరాధిపతి స్వామి బ్రహ్మవిహారిదాస్‌తో జరిగిన సుదీర్ఘ సంభాషణ అనంతరం జకీర్ మాట్లాడుతూ.. ఈ దేవాలయాన్ని ‘21వ శతాబ్దపు పునర్జన్మ (21st Century Renaissance)’ అని వ్యాఖ్యానించారు. అంతేగాక, ‘ప్రపంచానికి శాంతి, సామరస్యానికి మార్గదర్శక దీపం (A Global Beacon of Harmony)’, కళలు, విలువల చారిత్రక భాండాగారం (Archival of Art and Values)గా ఆయన అభివర్ణించారు.
ఈ మందిరం సామరస్యం, సహజీవనం, పరస్పర గౌరవం వంటి విలువలను ప్రతిబింబిస్తోందని, ఇవే యూఏఈ స్థాపకుడు షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ దూరదృష్టి, నాయకత్వానికి ప్రతీకలని నుస్సైబెహ్ వ్యాఖ్యానించారు.
మానవతా నాగరికతకు..
యూఏఈ యూనివర్సిటీ ఛాన్సలర్ హోదాలో జకీర్ మాట్లాడుతూ.. ఈ మందిరం భవిష్యత్ తరాలకు విజ్ఞానం, విలువలు అందించే ‘మానవ నాగరికతకు చెందిన ఓ జీవవంతమైన తరగతి గది’గా మారిందని కొనియాడారు.
‘ఈ మందిరం కేవలం ప్రార్థనల కోసం మాత్రమే కాదు.. సంస్కృతుల మధ్య అవగాహనను పెంచే మేధో వికాసానికి దోహదపడే ఒక విశిష్ట కేంద్రం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
సాంకేతిక, ఇంజినీరింగ్ అద్భుతానికి ప్రశంసలు
మందిర నిర్మాణంలో ఉపయోగించిన ఆధునిక సాంకేతికత, ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని నుస్సైబెహ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. అంతేకాదు, పర్యావరణ హితమైన వినూత్న డిజైన్‌ను కూడా ఆయన మెచ్చుకున్నారు.
HE Mr. Zaki Anwar Nusseibeh, Cultural Advisor to HH the President of the UAE, and the Chancellor of the UAE University, was deeply moved by his visit to the BAPS Hindu Mandir in Abu Dhabi and his conversation with its head, Swami Brahmaviharidas. Calling it a “21st Century… pic.twitter.com/xceOEn7uEI
— BAPS Hindu Mandir (@AbuDhabiMandir) January 16, 2026
సిస్టిన్ చాపెల్‌తో పోలిక
తన ప్రసంగం ముగింపులో నుస్సైబెహ్ భావోద్వేగంగా మాట్లాడుతూ.. ‘నేను ప్రపంచంలోని అనేక దేశాలు, అనేక ప్రదేశాలు సందర్శించాను. కానీ ఇలాంటి అద్భుతాన్ని ఎక్కడా చూడలేదు’ అని అన్నారు.
BAPS హిందూ మందిరం యొక్క కళాత్మక, ఆధ్యాత్మిక ప్రభావాన్ని ప్రపంచ ప్రసిద్ధి చెందిన సిస్టిన్ చాపెల్‌తో పోల్చుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
కాగా, అబూదాబీ BAPS హిందూ మందిరం అబూదాబీ నగరానికి సమీపంలోని అల్ రహ్బా ప్రాంతం వద్ద నిర్మించారు. BAPS స్వామినారాయణ సంస్థ (BAPS Swaminarayan Sanstha) ఆధ్వర్యంలో నిర్మాణం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన BAPS సంస్థకు ఇది మధ్యప్రాచ్యంలో మొదటి సంప్రదాయ హిందూ మందిరం.
యూఏఈ స్థాపకుడు షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ ఆలోచనలకు అనుగుణంగా మతసామరస్యానికి ప్రతీకగా నిర్మాణం జరిగింది. మందిర నిర్మాణానికి భూమిని యూఏఈ ప్రభుత్వం అందించింది. 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ మందిర నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఫిబ్రవరి 14, 2024లో ప్రారంభించడం జరిగింది.
