యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అడ్వాన్స్ వీసా సిస్టమ్ సోమవారం (అక్టోబర్ 3) నుంచి అమలులోకి రాబోతోంది. గత నెలలో ఈ విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త వీసా నిబంధనలలో విస్తరించిన 10-సంవత్సరాల గోల్డెన్ వీసా పథకం, నైపుణ్యం కలిగిన కార్మికులకు అనుకూలమైన ఐదు సంవత్సరాల గ్రీన్ రెసిడెన్సీ, విదేశీయులు 90 రోజుల వరకు దేశంలో ఉండేందుకు అనుమతించే కొత్త మల్టీ-ఎంట్రీ టూరిస్ట్ వీసాలు ఉన్నాయి.
ఇమ్మిగ్రేషన్ చట్టంలో మార్పులు పర్యాటకులతో పాటు UAEలో పని చేయాలనుకునే లేదా నివసించాలనుకునే వారిపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. ఇది కాకుండా, UAE కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టం మేరకు ఎలాంటి మార్పులు రానున్నాయో ఇప్పుడు చూద్దాం..
1. ఐదేళ్ల గ్రీన్ వీసా UAE పౌరులు లేదా వారి యజమానుల నుంచి సహాయం కోరకుండా విదేశీయులు తమను తాము స్పాన్సర్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఫ్రీలాన్సర్లు, నైపుణ్యం కలిగిన కార్మికులు, పెట్టుబడిదారులు ఈ వీసాకు అర్హులు.
2. గ్రీన్ వీసా హోల్డర్లు వారి కుటుంబ సభ్యులను కూడా స్పాన్సర్ చేయవచ్చు.
3. గ్రీన్ వీసా హోల్డర్ పర్మిట్ గడువు ముగిసినట్లయితే, వారికి ఆరు నెలల వరకు గడువు ఇవ్వనున్నారు.
4. గోల్డెన్ వీసా 10 సంవత్సరాల పాటు పొడిగించిన రెసిడెన్సీని అందిస్తుంది. దీని కోసం పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, అసాధారణ ప్రతిభ కలిగిన వ్యక్తులు అర్హులు.
5. గోల్డెన్ వీసా హోల్డర్లు కుటుంబ సభ్యులు, పిల్లలకు స్పాన్సర్ చేయవచ్చు.
6. గోల్డెన్ వీసా ఉన్నవారి కుటుంబ సభ్యులు కూడా వీసా చెల్లుబాటు అయ్యేంత వరకు హోల్డర్ మరణించిన తర్వాత కూడా UAEలో ఉండగలరు.
7. గోల్డెన్ వీసా హోల్డర్లు తమ వ్యాపారాల 100% యాజమాన్యాన్ని కూడా ఉపయోగించుకోగలరు.
8. టూరిస్ట్ వీసా ఇప్పుడు విదేశీయులను 60 రోజుల పాటు UAEలో ఉండడానికి అనుమతిస్తుంది.
9. ఐదేళ్ల మల్టీ-ఎంట్రీ టూరిస్ట్ వీసా విదేశీయులు వరుసగా 90 రోజుల పాటు UAEలో ఉండేందుకు వీలు కల్పిస్తుంది.
10. జాబ్ ఎక్స్‌ప్లోరేషన్ వీసా స్పాన్సర్ లేదా హోస్ట్ లేకుండానే యుఎఇలో ఉపాధిని పొందేందుకు నిపుణులను అనుమతిస్తుంది.