Donald Trump: టాలీవుడ్‌పై ట్రంప్ దెబ్బ..! ఆ సినిమాలపై 100 శాతం టారిఫ్ విధిస్తానంటూ సంచలన ప్రకటన
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశీ చిత్రాలపై 100 శాతం సుంకం విధించే నిర్ణయం టాలీవుడ్‌ను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. అమెరికా అతిపెద్ద మార్కెట్ కావడంతో ఈ సుంకం వల్ల తెలుగు సినిమా నిర్మాతలు భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నిర్ణయం హాలీవుడ్ రక్షణకు, దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు తీసుకున్నదని ట్రంప్ ప్రకటించారు.

మన తెలుగు సినిమా స్థాయి పెరిగింది. టాలీవుడ్ నంచి వచ్చే భారీ బడ్జెట్ చిత్రాల కోసం దేశంతో పాటు ప్రపంచంలోని కొన్ని దేశాలు కూడా ఎదురుచూస్తున్నాయి. భారతీయ చిత్రాలకు మన దేశం తర్వాత అమెరికా అతి పెద్ద మార్కెట్. అక్కడ సినిమా హిట్ అయితే నిర్మాతలకు డాలర్ల వర్షం ఖాయం. అయితే.. ఇకపై దర్శకనిర్మాతల డాలర్ డ్రీమ్స్ కష్టంగా మారనున్నాయి. ఎందుకంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా వెలుపల నిర్మించే అన్ని చిత్రాలపై 100 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ఆదివారం ప్రకటించారు. ఈ నిర్ణయం కచ్చితంగా ఇండియన్ సినిమాలపై పడనుంది. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌పై పడనుంది.
అమెరికా చిత్రనిర్మాతలు అవుట్‌సోర్స్ చేసే పద్ధతి పెరుగుతుండటం వల్ల హాలీవుడ్ నాశనం అవుతుందని పేర్కొంటూ, అమెరికా వెలుపల నిర్మించే అన్ని చిత్రాలపై 100 శాతం సుంకం విధిస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ట్రూత్ సోషల్ పై పోస్ట్ చేసిన ట్రంప్.. విదేశీ నిర్మిత చిత్రాలపై కొత్త సుంకాన్ని అమలు చేయడం ప్రారంభించడానికి అమెరికా వాణిజ్య శాఖ, అమెరికా వాణిజ్య ప్రతినిధికి అధికారం ఇచ్చానని చెప్పారు. ఇతర దేశాలు అమెరికన్ చిత్రనిర్మాతలను, స్టూడియోలను ఉత్పత్తిని విదేశాలకు మార్చడానికి ప్రలోభపెడుతున్నాయని కూడా ఆయన ఆరోపించారు.
అమెరికాలో సినిమా పరిశ్రమ చాలా వేగంగా క్షిణిస్తోందని అన్నారు. ఇతర దేశాలు మన చిత్రనిర్మాతలను, స్టూడియోలను అమెరికా నుండి దూరం చేయడానికి అన్ని రకాల ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. హాలీవుడ్, అమెరికాలోని అనేక ఇతర ప్రాంతాలు నాశనమవుతున్నాయి. ఇది ఇతర దేశాల సమిష్టి ప్రయత్నం వల్ల జాతీయ భద్రతా ముప్పు వాటిల్లుతుందని అని ఆరోపించారు. దేశీయంగా సినిమాలు నిర్మించాలని అధ్యక్షుడు కోరారు. అమెరికాలో ప్రదర్శించే అన్ని విదేశీ నిర్మిత సినిమాలపై 100 శాతం సుంకాన్ని విధిస్తామన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
