TANA Fruad: తానా.. అక్రమాల చిట్టా చాంతాడంత..! కోట్ల విరాళాలు మింగేసిన నిర్వాహకులు..

TANA ఫౌండేషన్ స్కామ్‌లో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఫౌండేషన్‌ నిధులను సొంత కంపెనీకి మళ్లించుకున్న ట్రెజరర్‌ శ్రీకాంత్ పోలవరపు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నేరం రుజువైతే నిందితులకు జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది.

TANA Fruad: తానా.. అక్రమాల చిట్టా చాంతాడంత..! కోట్ల విరాళాలు మింగేసిన నిర్వాహకులు..
Tana Fruad
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 27, 2024 | 12:43 PM

అమెరికాలో మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా TANA (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ఫౌండేషన్ స్కామ్‌ ప్రకంపనలు రేపుతోంది. ఫౌండేషన్‌ పేరుతో పెద్దలు 30 కోట్లు కొట్టేసిన వైనంపై లోతుగా దర్యాప్తు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. శ్రీకాంత్ పోలవరపు అనే కోశాధికారి, విరాళాలుగా వచ్చిన సొమ్మును తన సొంత కంపెనీకి మళ్లించుకున్నాడు. రెండేళ్ల పాటు విచ్చలవిడిగా జరిగిన ఈ స్కామ్ ఇప్పుడు వెలుగుచూడడంతో మొత్తం తానా వ్యవస్థే అవాక్కయ్యింది. సోమవారం సర్వసభ్య సమావేశం పెడితే.. తిరిగి ఇచ్చేస్తా, వదిలేయండి అంటూ శ్రీకాంత్‌ పోలవరపు ఒకమాట చెప్పి ఆఫ్‌లైన్ అయిపోయాడు. అంతేకాదు.. ఉన్నపళంగా లక్షడాలర్లు తానా అకౌంట్‌కి రివర్స్ పంపేశాడు. మిగతాదీ డిసెంబర్‌ చివరి నాటికి ఇచ్చేస్తానని ప్రాధేయపడ్డాడు. కానీ కుదరదు.. ! అతనికి నోటీసులు, ఫైనాన్షియల్ ఫ్రాడ్‌కి సంబంధించిన సెక్షన్లూ అప్లై చెయ్యాలని తానా సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

FBIతో ఇంటర్నల్‌ రెవిన్యూ సర్వీసెస్‌.. IRS కేసును టేకప్ చేసే అవకాశం

TANA – తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఫౌండేషన్ స్కామ్‌పై FBIతో ఇంటర్నల్‌ రెవిన్యూ సర్వీసెస్‌- IRS కేసును టేకప్ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. వాస్తవానికి తానా పేరు చెబితే ఫండ్స్ వచ్చిపడతాయి. తానా అనుకుంటే ఎలాంటి సాయమైనా చెయ్యగలుగుతుంది. అందుకే ఆ ఆరాటాలు పోరాటాలు. కానీ ఇదంతా నిన్నటి వరకు. ఇప్పుడు తానా పేరు చెబితేనే దాతలకు అసహ్యం కలుగుతోంది. పదిమందికీ సాయపడాలని చేస్తున్న దానం సొమ్ము ఇంకెవరి జేబుల్లోకో వెళ్తుంటే వాళ్ల గుండె చివుక్కుమంటోంది. మొత్తంగా ఇప్పుడు తానా పరువు పోయింది.

2022 నుంచి స్కామ్‌..

2022 నుంచి ఈ స్కామ్‌ నడుస్తోంది. అంజయ్య చౌదరి ప్రెసిడెంట్‌గా ఉన్న టైమ్‌లోనే స్కామ్ మొదలైనా.. పీక్స్‌కి వెళ్లింది మాత్రం తానా ప్రెసిడెంట్‌గా నిరంజన్ శృంగవరపు, ట్రెజరర్‌గా భరత్‌ మద్దినేని వచ్చాక మాత్రమే! వాస్తవానికి ఈ స్కామ్‌లో వీళ్లద్దరి పాత్ర ఉందని చెప్పలేం. ఒకవేళ ఉండకపోయినా ఉదాసీనత వల్ల కూడా స్కామ్‌కి పరోక్ష సహకారం అందించినట్టే అనుకోవాలి. అమెరికాలో 20వేల డాలర్లకు మించి ఫ్రాడ్ జరిగితే.. దారిమళ్లిన సొమ్ముకు మూడు రెట్లు జరిమానాతో పాటు పైగా పదేళ్ల జైలు శిక్ష విధిస్తారు.

తానా ఫౌండేషన్‌కు ప్రెసిడెంట్‌, ట్రెజరర్ ఉంటారు. అప్పట్లో ప్రెసిడెంట్‌గా యార్లగడ్డ వెంకట్రమణ, ట్రెజరర్‌గా శ్రీకాంత్ పోలవరపు ఉన్నారు. ఇప్పుడు వివాదం అంతా వెంకటరమణ, శ్రీకాంత్ చుట్టూనే తిరుగుతోంది. ఫలానా అజెండాను తానా రివీల్ చెయ్యగానే.. కోట్లకుకోట్ల డొనేట్ చేస్తుంటారు. అలా వచ్చిన సొమ్మును తానా ఫౌండేషన్ నుంచి తన సొంత కంపెనీ బృహత్ టెక్నాలజీస్ అనే సంస్థకు మళ్లించుకున్నాడు శ్రీకాంత్ పోలవరపు. ఈ సంస్థకు ఆయన భార్య చీఫ్‌గా ఉన్నారు. 30కోట్లు పక్కదారి పట్టాయి. ఎందుకు ఇన్నాళ్లూ బయటపడలేదు అంటే.. బ్యాంక్ అకౌంట్‌ స్టేట్‌మెంట్లను తన మెయిల్‌కి వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు ట్రెజరర్‌ శ్రీకాంత్‌. — ఇక పోస్ట్‌ ద్వారా వచ్చే స్టేట్‌మెంట్లకు తానా మెయిన్‌ వింగ్‌ చీఫ్‌గా ఉన్న నిరంజన్ తన ఇంటి అడ్రెస్ ఇచ్చుకున్నాడు. మరి ఇంటికి స్టేట్‌మెంట్‌ వస్తుంటే చూడరా..లేక చూసీ చూడనట్టు వదిలేశారా? అన్న అనుమానం కలుగుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..