Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visa Rules: ఆ దేశం వెళ్లాలంటే ఇక కష్టమే.. వీసా నిబంధనలు కఠినతరం.. వేతనంపై ఆంక్షలు

బ్రిటిన్‌ తీసుకున్న నిర్ణయం భారతీయులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇండియన్‌ నుంచి UK వెళ్తున్న విద్యార్థులు, ఉద్యోగుల సంఖ్య చాలా అధికంగా ఉంది. తాజా ఆంక్షల కారణంగా బ్రిటన్‌కు వెళ్లడం కష్టసాధ్యం కానుంది. నైపుణ్యం ఆధారిత ఉద్యోగాల పేరుతో వచ్చే వారికి వేతనం విషయంలో బ్రిటన్‌ కొత్త ఆంక్షలు విధించింది.

Visa Rules: ఆ దేశం వెళ్లాలంటే ఇక కష్టమే.. వీసా నిబంధనలు కఠినతరం.. వేతనంపై ఆంక్షలు
Uk Visa
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 05, 2023 | 3:51 PM

అగ్రరాజ్యం బ్రిటన్‌కు వచ్చే వలసదారులను కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు ప్రతిపాదించింది. ఇది విదేశీయులు, విద్యార్థులు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు ఇది పెద్ద సమస్యగా మారనుంది. పెరుగుతున్న వలసలను కట్టడి చేయాలని ప్రధాని రిషి సునాక్‌పై కన్సర్వేటివ్‌ పార్టీ ఎంపీలు తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. వచ్చే ఏడాది బ్రిటన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. పెరుగుతున్న వలసలు బ్రిటన్‌ ఎన్నికల్లో అత్యంత కీలక అంశంగా మారుతోంది. వలసలు కట్టడి చేసేందుకు ఏళ్లుగా ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకోవడం లేదనే బ్రిటన్‌ వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వీసా ఆంక్షలపై కొద్ది నెలలుగా వినిపిస్తున్న రకరకాల ఊహాగానాలకు తెరదించుతూ బ్రిటన్‌ పార్లమెంట్‌లో ఆ దేశ కొత్త హోం మంత్రి జేమ్స్‌ క్లెవర్లీ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. వలసలు తగ్గించేందుకు మొత్తం పంచసూత్ర ప్రణాళికను వచ్చే ఏడాది ప్రథమార్థం నుంచి క్లెవర్లీ అమల్లోకి తేనున్నారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు కన్సర్వేటివ్‌ ప్రభుత్వం ఇప్పుడు వెనక్కి తీసుకుంటోంది.

గతేడాది బ్రిటన్‌కు 6 లక్షల 72 వేల మంది వలస వచ్చినట్టు బ్రిటన్‌లోని నేషనల్‌ స్టాటిస్టిక్స్‌ కార్యాలయం ప్రకటించింది. వీరిలో ఎక్కువ భారత్‌ నుంచి వెళ్లే స్కిల్డ్‌ వర్కర్స్‌, మెడికల్‌ ప్రొఫెషనల్స్‌, విద్యార్థులు ఉంటారు. తాజాగా చేపట్టిన వీసా ఆంక్షల కారణంగా బ్రిటన్‌కు వలసలు తగ్గుతాయని, ఇది దేశానికి ఎంతో మేలు చేస్తుందని ప్రధాని రిషి సునాక్ అంటున్నారు. గతంలో వలసలపై ఏ ప్రధాని కూడా ఈ స్థాయిలో నిర్ణయం తీసుకోలేదని ఆయన ట్వీట్‌ చేశారు. బ్రిటన్‌కు వలసలు విపరీతంగా ఉన్నాయని, దాన్ని మార్చాల్సిన అవసరం ఉందని రిషి అభిప్రాయపడ్డారు.

బ్రిటిన్‌ తీసుకున్న నిర్ణయం భారతీయులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇండియన్‌ నుంచి UK వెళ్తున్న విద్యార్థులు, ఉద్యోగుల సంఖ్య చాలా అధికంగా ఉంది. తాజా ఆంక్షల కారణంగా బ్రిటన్‌కు వెళ్లడం కష్టసాధ్యం కానుంది. నైపుణ్యం ఆధారిత ఉద్యోగాల పేరుతో వచ్చే వారికి వేతనం విషయంలో బ్రిటన్‌ కొత్త ఆంక్షలు విధించింది. ఇకపై వార్షిక వేతనం 38700 పౌండ్స్‌ అంత కంటే ఎక్కువ ఉంటేనే బ్రిటన్‌లోకి కొత్త స్కిల్డ్‌ వర్కర్లను అనుమతిస్తారు. ఫ్యామిలీ వీసా శ్రేణిలోనూ ఈ నిబంధన వర్తిస్తుంది. అంతే కాదు ఏ ఉద్యోగం బడితే ఆ ఉద్యోగాన్ని స్కిల్డ్‌ వర్కర్‌ అని పిలిచేందుకు ఉన్న వెసులుబాటులోనూ బ్రిటన్‌ కోత విధించనుంది. షార్టేజ్‌ ఉద్యోగాల సంఖ్యను భారీగా తగ్గించనుంది.

బ్రిటన్‌లో చదువుకునేందుకు వచ్చే విద్యార్థుల వెంట వచ్చే డిపెండెంట్స్‌ విషయంలోనూ బ్రిటన్‌ కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. తాజా చర్యల ద్వారా వలస వచ్చే వారి సంఖ్య కనీసం 3 లక్షలు తగ్గుతుందని బ్రిటన్‌ అంచనా వేస్తోంది. అలాగే యుకేలో ఉన్నత విద్య నాణ్యతను పరిరక్షించేందుకు గ్రాడ్యుయేట్‌ రూట్‌ వీసా విధానాన్ని సమీక్షిస్తామని బ్రిటన్‌ ప్రకటించింది. అలాగే చదువులు పూర్తైన తర్వాత విద్యార్థులు బ్రిటన్‌లో ఎక్కువ కాలం కొనసాగకుండా ఉండకుండా చూసేందుకు కూడా బ్రిటన్‌ చర్యలు చేపట్టనుంది. బ్రిటన్‌లో చదువుకునే విద్యార్థులు డిపెండెంట్స్‌ను తెచ్చుకునేందుకు ఇప్పటి వరకు లక్షా 53 వేల వీసాలు మంజూరు చేసేవారు. ఇది పూర్తిగా తగ్గిపోనుంది.

ఆరోగ్య సంరక్షణ రంగంలో పనిచేసే కార్మికులకు ఇప్పటి వరకు అమల్లో ఉన్న వెసులుబాటును బ్రిటన్‌ తొలగించింది. ఇంత వరకు వీళ్లు తమపై ఆధారపడిన వారిని బ్రిటన్‌కు తీసుకొచ్చే వీలుండేది. ఇకపై ఆ వెసులుబాటు ఉండదు. అంతే కాదు ఆరోగ్య సంరక్షణ రంగంలో ఉన్న వారు అదే రంగంలో పనిచేసే కార్మికులను మాత్రమే స్పాన్సర్‌ చేయగలుగుతారు.

వాస్తవానికి యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో ఉన్నత విద్య అభ్యసించేందుకు అనేక దేశాల నుంచి విద్యార్థులు అక్కడికి వస్తూ ఉంటారు. ఉన్నత విద్య కోసం భారత్‌ నుంచి బ్రిటన్‌ వెళ్లే వాళ్ల సంఖ్య కూడా చాలా అధికంగా ఉంటుంది. బ్రిటన్‌ తీసుకున్న తాజా నిర్ణయం విద్యార్థులపై గొడ్డలివేటు కానుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..