Starbucks: విద్యా, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అగ్రరాజ్యం అమెరికా వెళ్లిన భారతీయులు తమ సత్తా చాటుతున్నారు. తమలోని ప్రతిభకు పదునుపెడుతూ.. ప్రస్తుతం అక్కడి వ్యవస్థలను శాసించే స్థాయికి చేరుకుంటున్నారు. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, పరాగ్ అగర్వాల్, శంతను నారాయణ్, అరవింద్ కృష్ణ, అజయ్ బంగా, మనీష్ శర్మ, లీనా నాయర్ వంటి భారతీయ ఎగ్జిక్యూటివ్‌లు అమెరికన్ కంపెనీలకు సీఈవోలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కోవలో మరో దిగ్గజ అమెరికన్ కంపెనీ స్టార్ బక్స్ సీఈవోగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ నియమితులయ్యారు. ఆయన అక్టోబర్ 1 నుండి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు స్టార్‌బక్స్ గురువారం ఓ ప్రకటన చేసింది.
ప్రముఖ అంతర్జాతీయ కాఫీ షాప్.. స్టార్‌బక్స్ సీఈవోగా నియమితులైన లక్ష్మణ్ నర్సింహన్.. మహారాష్ట్రలోని పుణెలో జన్మించారు. పుణె యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని జర్మనీలో పీజీ, పెన్నిసెల్వేనియా యూనివర్సిటీలోని లౌడర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఇంటర్నేషనల్ స్టడీస్, వార్టన్ స్కూల్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ పట్టా పొందారు. త్వరలో స్టార్‌బక్స్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్న లక్ష్మణ్ నర్సింహన్ ఈ పదవిలో ఉన్నంత వరకు వార్షిక వేతనం 1.3 మిలియన్ డాలర్లు, బేస్ శాలరీలో 200 శాతం సమానమైన క్యాష్ ఇన్సెంటివ్ అందుకుంటారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి