AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీలంకలో ‘ఆ నలుగురు’.. ఇక కుటుంబ పాలనేనా ?

ఆదేశంలో రాజకీయం రంగు మారిపోయింది. ప్రజాస్వామ్య దేశంగా కనిపిస్తున్నా ఓ వంశ పాలనకు ఆ దేశంలో తెరలేచింది. ఎస్.. శ్రీలంక గురించే ఈ ఉపోద్ఘాతం. తమిళులకు, ముస్లింలకు బద్ద వ్యతిరేకిగా ముద్రపడిన హార్డ్‌ కోర్ సింహాళీయుడు గొటబాయ రాజపక్స శ్రీలంక అధ్యక్షునిగా ఘన విజయం సాధించిన నేపథ్యంలో అక్కడ రాజకీయం పూర్తిగా ఓ కుటుంబ పాలన దిశగా పయనిస్తోంది. ఇటీవల వెల్లడైన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో గొటబాయ రాజపక్స ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. […]

శ్రీలంకలో ‘ఆ నలుగురు’.. ఇక కుటుంబ పాలనేనా ?
Rajesh Sharma
|

Updated on: Nov 21, 2019 | 6:00 PM

Share

ఆదేశంలో రాజకీయం రంగు మారిపోయింది. ప్రజాస్వామ్య దేశంగా కనిపిస్తున్నా ఓ వంశ పాలనకు ఆ దేశంలో తెరలేచింది. ఎస్.. శ్రీలంక గురించే ఈ ఉపోద్ఘాతం. తమిళులకు, ముస్లింలకు బద్ద వ్యతిరేకిగా ముద్రపడిన హార్డ్‌ కోర్ సింహాళీయుడు గొటబాయ రాజపక్స శ్రీలంక అధ్యక్షునిగా ఘన విజయం సాధించిన నేపథ్యంలో అక్కడ రాజకీయం పూర్తిగా ఓ కుటుంబ పాలన దిశగా పయనిస్తోంది.

ఇటీవల వెల్లడైన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో గొటబాయ రాజపక్స ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆయన ఎన్నికవడంతోనే శ్రీలంక భవిష్యత్ ఎలా వుండబోతోందన్న చర్చలు, ఊహాగానాలు ఊపందుకున్నాయి. అనుకున్నట్లుగానే గొటబాయ తన అన్న మహేంద రాజపక్సను దేశప్రధానిగా ఎంపిక చేసుకున్నాడు. అధ్యక్ష స్థానంలో కూర్చున్న తర్వాత తొలి కీలక నిర్ణయంతో తన అన్నకు ప్రధానిగా పట్టం కట్టారు గొటబాయ.

మహేంద రాజపక్స గతంలో సుమారు పదేళ్ళ పాటు రెండు విడతలుగా దేశ అధ్యక్షునిగా వ్యవహరించారు. మూడో విడత అధ్యక్షునిగా ఎన్నికవడానికి శ్రీలంక రాజ్యాంగం అనుమతించకపోవడంతో తన సోదరున్ని ఎన్నికల బరిలోకి దింపి గెలిపించుకున్నారు. తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. నిజానికి మహేంద రాజపక్స అధ్యక్షునిగా వున్న సమయంలో తమిళ ఈలం తీవ్రవాదులను అత్యంత దారుణంగా అంతమొందించిన సైనిక చర్యకు గొటబాయ రక్షణ శాఖ కార్యదర్శి హోదాలో సారథ్యం వహించారు. సోదరులిద్దరి పైనా తమిళులు, ముస్లింలు, కొన్ని బౌద్ద వర్గాలకు వ్యతిరేకులుగా ముద్ర వుంది.

జాతీయ వాదంతోనే విజయం

తాజాగా జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో గొటబాయ సింహళీయుల్లో జాతీయవాదం రెచ్చగొట్టి విజయం సాధించారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తమిళులకు, ముస్లింలకు వ్యతిరేకంగా రాజపక్స సోదరులు చేసిన ప్రచారమే వారికి విజయాన్ని కట్టబెట్టిందంటున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో తమిళుల పట్ల వీరిద్దరు ఎలా వ్యవహరిస్తారన్నది ఉత్కంఠగా మారింది.

అయితే.. శ్రీలంక దేశ భవిష్యత్తును నిర్దేశించే ఈ సోదరుల సంఖ్య రెండుకే పరిమితం కాలేదు. రాజపక్స సోదరులు మొత్తం నలుగురు. వీరిలో అందరి కంటే పెద్ద వాడు చామల్ రాజపక్స. ఇతను గతంలో మహేంద రాజపక్స అధ్యక్షునిగా వ్యవహరించిన కాలంలో స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. చామల్ తర్వాతి వాడు మహేంద కాగా.. ఆయన తర్వాత మూడో వాడు ప్రస్తుత అధ్యక్షుడు గొటబాయ రాజపక్స. ఈ సోదరులలో నాలుగో వాడు బాసిల్ రాజపక్స. ప్రస్తుతం ఇతను కూడా గొటబాయకు కుడిభుజంగా వ్యవహరిస్తున్నాడు.

ఈ నలుగురు సోదరులే ఇప్పుడు శ్రీలంక దశాదిశను నిర్దేశించబోతున్నారు. అయితే.. అన్ని విధానాల కంటే రెండు అంశాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒకటి తమిళులకు బద్ద వ్యతిరేకులైన రాజపక్స సోదరులు వారి పట్ల ఎలాంటి విధానాన్ని అవలంభించబోతున్నారన్నది ఇప్పుడు అత్యంత కీలకం కాబోతోంది. మరోవైపు చైనాను మిత్రులుగా భావించే రాజపక్స సోదరులు.. భారత్ పట్ల ఎలాంటి విదేశాంగ విధానాన్ని ఎంచుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది. అయతే మహేంద రాజపక్స కుమారు నమల్ రాజపక్స కూడా తాజాగా ఎంపీగా గెలుపొందారు. ఇండియాతో సంబంధాల విషయంలో గొటబాయ రాజపక్స చొరవ చూపిస్తారని ఆయన గురువారం వ్యాఖ్యానించడం ఉప ఖండంలో ఉద్రిక్తతలు పెరిగేందుకు శ్రీలంక కారణం కాదన్న సంకేతాలు వెలువడ్డాయి.