SRILANKA CRISIS: లంకలో ఆరని ఆగ్రహ జ్వాల.. తగ్గెదేలే అంటున్న ఆందోళనకారులు.. కొత్త ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాల్ అదే!

శ్రీలంకలో నెలకొన్న సంక్షోభానికి పరిష్కారమేంటి ? కొత్త ప్రభుత్వం ఏర్పడినా ప్రజల్లో ఆందోళన తగ్గించేందుకు ఏమేం అవకాశాలున్నాయి? జులై 20న రానున్న కొత్త అధ్యక్షునికి ఎదురయ్యే సవాళ్ళేంటి ? ఈ ప్రశ్నలిపుడు అంతర్జాతీయ అంశాల విశ్లేషకుల మెదళ్ళను తొలుస్తున్నాయి.

SRILANKA CRISIS: లంకలో ఆరని ఆగ్రహ జ్వాల.. తగ్గెదేలే అంటున్న ఆందోళనకారులు.. కొత్త ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాల్ అదే!
Srilanka Crisis
Follow us
Rajesh Sharma

|

Updated on: Jul 14, 2022 | 8:52 PM

SRILANKA CRISIS DEEPENS MANY CHALLENGES BEFORE NEW PRESIDENT:  శ్రీలంక సంక్షోభానికి తెరపడేదెన్నడు? ఈ ప్రశ్నకిపుడు సూటిగా జవాబు చెప్పే శక్తిసామర్థ్యాలున్న వ్యక్తి బహుశా ప్రపంచంలో ఎవ్వరూ లేరేమో. ఆర్థిక సంక్షోభానికి రాజకీయ సుస్థిరత తోడై దానికి భారీ విదేశీ రుణం రూపంలో పొంచివున్న అతిపెద్ద ప్రమాదం కలగలిస్తే ప్రస్తుతం ద్వీప దేశంలో కొనసాగుతున్న విషమ పరిస్థితి అని చెప్పాలి. లంకేయుల ఆందోళన హింసాత్మకమవుతున్న తరుణంలో అక్కడ రాజకీయ సుస్థిరత ఇప్పట్లో సాధ్యమా అన్న సందేహం కలుగుతోంది. అదేసమయంలో జులై 20వ తేదీన ఎన్నిక కాబోతున్న శ్రీలంక (SRILANKA) తాత్కాలిక అధ్యక్షునికి పరిస్థితి చక్కదిద్దేందుకు ఏ మేరకు అవకాశాలున్నాయనేది కూడా చర్చనీయాంశమే. 2009లో ఎల్టీటీఈ(LTTE)ని అంతమొందించిన తర్వాత విజయగర్వంతో తమకు ఎదురే లేదన్న రీతిలో రెచ్చిపోయిన రాజపక్స (RAJAPAKSA) కుటుంబీకులు.. దేశాన్ని అధోగతిలోకి నెట్టారు. విచ్చలవిడి అవినీతికి అసమర్థ, అనాలోచిత విధానాలు తోడై శ్రీలంకను అధమ పాతాళానికి చేర్చాయి. విదేశీ రుణంలోంచి సింహభాగం రాజపక్స కుటుంబీకుల (RAJAPAKSA FAMILY) అకౌంట్లకు మళ్ళిందన్న ఆరోపణలున్నాయి. ఈ అకౌంట్లు దేశీయ బ్యాంకుల్లో కాకుండా విదేశీ బ్యాంకుల్లో వుండడం, ఇపుడు గొటబయ (GOTABAYA) సహా పలువురు ఆయన కుటుంబీకులు విదేశాలకు పారిపోవడం చూస్తే విదేశీ రుణ మొత్తాలను రాజపక్స కుటుంబీకులు వృధా చేశారన్న ఆరోపణలు బలపడుతున్నాయి. ఈ క్రమంలో ఆపద్ధర్మ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న ప్రధాని రణిల్ విక్రమ సింఘే (RANIL VIKRAMASINGHE)కు ఈ వారం రోజులు నిద్రలేని రాత్రులే అని చెప్పక తప్పదు. జులై 13వ తేదీన గొటబయ దేశం దాటి పోవడంతో రణిల్ విక్రమ సింఘే ఆపద్ధర్మ అధ్యక్షుడయ్యాడు. అదేసమయంలో ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ (PRESIDENTIAL PALACE) సహా పలు అధికారిక భవనాలను ఆక్రమించుకున్న ఆందోళన కారులు.. తామాక్రమించిన భవనాలను ఖాళీ చేస్తామని ప్రకటించాయి. కానీ ఆందోళన కారులు ఒకరి సారథ్యంలో నడవడం లేదు కాబట్టి.. ఆ హామీ ఇచ్చిందెవరో కానీ ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదు. జులై 14 తేదీన ఆందోళనకారులు రణిల్ విక్రమ సింఘే అధికారిక నివాసంపై దాడి చేశారు. ముందుగా వేలాది మంది ఆందోళనకారులు రణిల్ అధికారిక నివాసం దగ్గర గుమికూడారు. మెల్లిగా అక్కడి బారికేడ్లను విరగొట్టారు. ప్రధాన గేటును ఊడబెరికి లోపలికి వెళ్ళేందుకు యత్నించారు. ఈసందర్భంలో అక్కడ కాపలా కాస్తున్న భద్రతాబలగాలు.. ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాంతో వారంతా చెల్లాచెదురయ్యారు. అయితే టియర్ గ్యాస్ ప్రయోగిస్తారని ముందే పసిగట్టిన ఆందోళనకారులు.. ఆ గ్యాస్ నుంచి తమను తాము రక్షించుకునేందుకు పలు రకాల మాస్కులు ధరించి రావడంతో వారిపై టియర్ గ్యాస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. రాళ్ళు, వాటర్ బాటిళ్ళు, చెప్పులు చేతబూనిన ఆందోళనకారులు వాటిని సైనిక బలగాలే లక్ష్యంగా విసిరారు. మెళ్ళిగా మెయిన్ గేటును విధ్వంసం చేసి.. రణిల్ అధికారిక భవనంలోకి చొచ్చుకువెళ్ళారు. లాన్స్, స్టెప్స్, సమావేశ మందిరాలలో ఆందోళనకారులు తిష్ట వేశారు.

ఇదిలావుండగా దేశం వదిలి మాల్దీవులు (MALDIEVES) చేరిన అధ్యక్షుడు గొటబయ రాజపక్స.. జులై 14న తెల్లవారుజామున అక్కడ్నించి సౌదీ ఎయిర్ లైన్స్ (SAUDI AIRLINES) విమానంతో సింగపూర్ (SINGAPORE) మీదుగా పయనించి.. చివరికి సౌదీ అరేబియా చేరాడు. మొత్తమ్మీద సేఫ్ ప్లేస్‌కు చేరుకునే దాకా గొటబయ తన పదవికి రాజీనామా చేసే ఉద్దేశంతో లేడని తెలుస్తోంది. దేశ అధ్యక్షుని హోదా వుంటే ఏ దేశానికైనా ఈజీగా చేరుకోగలగే అవకాశం వుండడం వల్లనే ఆయన తన పదవికి రాజీనామా చేయడంలో జాప్యం చేస్తున్నాడని అంటున్నారు. ముందుగా ప్రకటించిన దాని ప్రకారం ఆయన జులై 12వ తేదీన రాజీనామా చేయాల్సి వుంది కానీ.. తనకు దేశం నుంచి సేఫ్ ప్యాసేజ్ కల్పించాలన్న షరతుతోనే ఆయన రాజీనామాను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఆయన రాజీనామా చేయకపోతే ఆయన్ను పదవి నుంచి తప్పించాలంటే శ్రీలంక రాజ్యాంగం (SRILANKA CONSTITUTION) ప్రకారం పెద్ద తంతే నిర్వహించాల్సి వుంటుంది. మొత్తం న్యాయవ్యవస్థ సహకరించాలి.. పార్లమెంటులో రెండింట మూడొంతుల మంది ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయాలి.. ఇవన్నీ ఇప్పటి పరిస్థితిలో సాధ్యం కాదని గ్రహించడం వల్లనే గొటబయ డిమాండ్లను ఆమోదించి, ఆయన దేశం దాటేందుకు రణిల్ విక్రమ సింఘే, ఎయిర్‌ఫోర్స్ సహకరించినట్లు తెలుస్తోంది.  మొత్తమ్మీద ఈ తంతు అంతా పూర్తి అయిన నేపథ్యంలో తాను సేఫ్‌గా సౌదీ అరేబియా చేరుకోగానే గొటబయ జులై 14న రాజీనామా చేశారు. ఈ విషయాన్ని స్పీకర్ ధృవీకరించడంతో ఆందోళనాపథంలో పయనిస్తున్న లక్షలాది మంది లంకేయులు సంబరాలు చేసుకున్నారు. రాజీనామా తంతు పూర్తయిన నేపథ్యంలో జులై 20వ తేదీన దేశ తాత్కాలిక అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. ఇక తాత్కాలిక అధ్యక్షుని సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడినా దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ఇప్పట్లో సమసిపోయే ఛాన్స్ లేదు. ఎందుకంటే శ్రీలంకలో ద్రవ్యోల్బణానికి కారణం భారీగా పెరిగిన విదేశీ రుణమే. 51 బిలియన్ల అమెరికన్ డాలర్ల మేరకు శ్రీలంక పలు దేశాలకు, పలు విదేశీ బ్యాంకులకు అప్పు పడింది. దీనిని తీర్చలేని పరిస్థితి వున్నందున తమను బెయిల్ అవుట్ చేయాలని శ్రీలంక అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monery Fund)ని కోరింది. అయితే ఐఎంఎఫ్ ఇప్పటివరకు శ్రీలంక విఙ్ఞప్తిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. బెయిల్ అవుట్ సాధించడమే శ్రీలంకలో ఏర్పడబోయే తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సవాల్‌గా మారనున్నది. బెయిల్ అవుట్ లభిస్తేనే శ్రీలంక ఆర్థికంగా కాస్తైనా కుదురుకోగలదు. అప్పుడే దేశంలో నెలకొన్న అశాంతి సమసే అవకాశం వుంది. దేశంలో ధరలు తగ్గితేనే సామాన్య ప్రజానీకం ఆందోళన వీడి తమ రొటీన్ లైఫ్‌స్టైల్లోకి మారే అవకాశం వుంది. లేని పక్షంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని నడపడం, ఆందోళనకారులను తట్టుకోవడం కొత్త అధ్యక్షునికి కత్తిమీద సాములాంటిదే అవుతుంది.