AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri lanka: ‘‘చచ్చిపోతామేమో’’ననే భయంతో లంకేయుల ఆకలికేకలు..చరిత్రలో తొలిసారిగా అలా చేసి దిగజారిన దేశం

సంక్షోభం అంటే ఆర్ధిక వ్యవస్థ పతనం.. ఆహార ధాన్యాల కొరత.. ఆకలి చావులు.. జాతి మనుగడే ప్రశ్నార్థకం.. వీటన్నిటికీ ప్రత్యక్ష సాక్ష్యమే.. ప్రస్తుత శ్రీలంక. చేతిలో చిల్లిగవ్వ లేదు. చమురు నిల్వలు ఖాళీ అయ్యాయి. తినడానికి తిండి లేదు.

Sri lanka: ‘‘చచ్చిపోతామేమో’’ననే భయంతో లంకేయుల ఆకలికేకలు..చరిత్రలో తొలిసారిగా అలా చేసి దిగజారిన దేశం
Sri Lanka Crisis
Jyothi Gadda
|

Updated on: May 21, 2022 | 6:40 PM

Share

సంక్షోభం అంటే ఆర్ధిక వ్యవస్థ పతనం.. ఆహార ధాన్యాల కొరత.. ఆకలి చావులు.. జాతి మనుగడే ప్రశ్నార్థకం.. వీటన్నిటికీ ప్రత్యక్ష సాక్ష్యమే.. ప్రస్తుత శ్రీలంక. చేతిలో చిల్లిగవ్వ లేదు. చమురు నిల్వలు ఖాళీ అయ్యాయి. తినడానికి తిండి లేదు. స్కూళ్లు, ఆఫీసులు మూతపడ్డాయ్.. ఆఖరికి ఆహార ధాన్యాల కొరత కూడా లంకను వేధిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. భయంకరమైన పరిణామాలు చూడక తప్పదా?

తీవ్ర ఆహార కొరతతో శ్రీలంక అల్లాడిపోతోంది. లక్షల మందికి మూడు పూటలా అన్నం దొరకని పరిస్థితి. ఆకాశాన్నంటిన ధరలతో లంకేయులు సతమతమవుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్నాళ్లకు చచ్చిపోతామేమో అనే భయానక వాతావరణం ఆ దేశ ప్రజల గుండెల్లో గుబులు రేపుతోంది. దేశంలో ఆహార కొరత అత్యంత తీవ్రంగా ఉందని ప్రధాని రణిల్ విక్రమసింఘే ఇచ్చిన ప్రకటన దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. అన్నం పెట్టే రైతన్నకు కనీస ప్రోత్సాహం అందించే పరిస్థితి కూడా అక్కడ లేదు. వచ్చే సీజన్‌ నాటికి ఎరువులు సమకూర్చడానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అంత సులభమయ్యే పని కాదు.

శ్రీలంకలో ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం 28 శాతానికి పెరగ్గా, రానున్న రెండు నెలల్లో అది 40 శాతానికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. దేశంలో ఆహార పదార్థాల ధరలు 46 శాతం పెరగడంతో, ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర అసహనం కనిపిస్తోంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు కరిగిపోయాయి. దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశన్నంటడమే కాకుండా.. చమురు, ఔషధాలు, ఆహార పదార్థాలకు తీవ్ర కొరత ఏర్పడింది. నిత్యావసరాలు దొరక్క సామాన్యులు అల్లాడిపోతున్నారు. నిత్యావసరాలైన గ్యాస్, కిరోసిన్ కూడా దొరకని స్థితిలోకి శ్రీలంక వెళ్లిపోయింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా శ్రీలంక రుణం ఎగవేసింది. 607 కోట్ల వడ్డీని చెల్లించలేకపోయింది.

ఇవి కూడా చదవండి

ఆర్థిక సంక్షోభంతో కునారిల్లుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరో 9 మంది మంత్రులు కేబినెట్‌లో భాగమయ్యారు. ప్రధాని విక్రమ్ సింఘె.. కేబినెట్ విస్తరణ చేపట్టి కొన్ని కీలక శాఖలు అప్పగించారు. కానీ కీలకమైన ఆర్ధిక శాఖ మాత్రం ఎవరికీ కేటాయించలేదు. ప్రధానంగా టూరిజం రంగంపై ఆధారపడి మనుగడ సాగించే శ్రీలంకకు కరోనా సంక్షోభం పెనువిపత్తును తెచ్చిపెట్టింది. లాక్ డౌన్‌తో శ్రీలంక పర్యాటక రంగం కుదేలు కాగా, విదేశీ మారకద్రవ్య నిల్వలు అడుగంటాయి. ముందస్తు ప్లానింగ్ లేకపోవడం.. నాయకుల తప్పుడు నిర్ణయాల వల్ల ఇప్పుడు సామాన్యులు రోడ్డున పడాల్సి వచ్చింది.

ఇంధన కొరత కారణంగా రవాణా సేవలు నిలిచిపోవడంతో విద్యా సంస్థలు మూతపడ్డాయి. అత్యవసర సేవలు అందించే కార్యాలయాలు తప్ప మిగతా ప్రభుత్వ ఉద్యోగులెవరూ ఆఫీసులకు రావాల్సిన పనిలేదని ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి స్కూళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. దేశ అవసరాలకు సరిపడా ఇంధన నిల్వలు లేకపోవడం, దిగుమతి చేసుకునేందుకు చేతిలో డబ్బు లేకపోవడంతో.. అంతర్జాతీయ సంస్థలు, విదేశీ సాయం కోసం శ్రీలంక ఆశగా ఎదురుచూస్తోంది.

మరోవైపు శ్రీలంకలో ఆందోళనలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటిదాకా తమకు తిరుగులేదనుకున్న రాజపక్సేలకు.. జనం పవరేంటో చూపించారు. శ్రీలంకలో కర్ఫ్యూ పెట్టినా.. ఎమర్జెన్సీ విధించినా లెక్కచేయకుండా నిరసన తెలిపారు. లంకలో కొన్నేళ్లుగా పాలన సాగిస్తున్న రాజపక్స కుటుంబసభ్యులు రాజీనామా చేసే వరకూ వదల్లేదు.

కొత్త ప్రధానిగా విక్రమ్ సింఘె బాధ్యతులు చేపట్టినప్పటికీ అక్కడ ఆందోళనలు తగ్గలేదు. రాష్ట్రపతిగా ఉన్న గొటబయ రాజపక్సే రాజీనామా చేయాలంటూ యువత, విద్యార్ధి లోకం డిమాండ్ చేస్తోంది. అధ్యక్ష భవనం సమీపంలో విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. వేలాది మంది విద్యార్థులు అధ్యక్షుడు భవనం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

ఆందోళనలను ఆదుపుచేసే క్రమంలో పోలీసులు, విద్యార్ధుల మధ్య ఘర్షణ జరిగింది. వారిని నియంత్రించేందుకు వాటర్ కెనాన్స్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో ఆగ్రహించిన విద్యార్ధులు.. పోలీసులపై రాళ్ల దాడి చేశారు. పలువురు విద్యార్ధులతో పాటు పోలీసులకు గాయాలయ్యాయి. ఏప్రిల్​ 9 నుంచి కొలంబోలోని గాలే ఫేస్​గ్రీన్‌లో గొటబాయకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనల్లో ఇప్పటికే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికిపైగా గాయపడ్డారు.

ఇలాంటి క్లిష్ట పరిస్థిత్లో శ్రీలంక కీలక నిర్ణయం తీసుకుంది. రెండు వారాలుగా దేశంలో కొనసాగుతున్న ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల ఆందోళనలు, సంక్షోభం కారణంగా మే 6 నుంచి లంకలో ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. ప్రస్తుతం కొత్త ప్రధాని పాలన సాగుతుండడంతో పరిస్థితిలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.