Desmand Tutu: దక్షిణాఫ్రికా అణగారిన వర్గాల హీరో కన్నుమూత.. సంతాపం వ్యక్తం చేసిన వెంకయ్య, మోడీ..

|

Dec 27, 2021 | 1:41 PM

దక్షిణాఫ్రికాలో జాతి వివక్షపై అవిశ్రాంత పోరాటం చేసిన హక్కుల కార్యకర్త, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత డెస్మంట్‌ టుటు(90) కన్నుమూశారు. గత కొద్దికాలంగా ప్రొస్టేట్‌ క్యాన్సర్‌తో బాధపడుతోన్న

Desmand Tutu: దక్షిణాఫ్రికా అణగారిన వర్గాల హీరో కన్నుమూత.. సంతాపం వ్యక్తం చేసిన వెంకయ్య, మోడీ..
Follow us on

దక్షిణాఫ్రికాలో జాతి వివక్షపై అవిశ్రాంత పోరాటం చేసిన హక్కుల కార్యకర్త, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత డెస్మంట్‌ టుటు(90) కన్నుమూశారు. గత కొద్దికాలంగా ప్రొస్టేట్‌ క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆయన ఆదివారం తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం దక్షిణాఫ్రికా దేశాధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా డెస్మండ్‌ మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘కేప్‌టౌన్‌లోని ఒయాసిస్‌ ఫ్రైల్‌ కేర్‌ సెంటర్‌లో టుటు కన్నుమూశారు. ఆయన మరణంతో దక్షిణాఫ్రికా విముక్తి కోసం పోరాడిన గొప్ప వ్యక్తుల్లో ఒకరిని కోల్పోయాం’ అని ఆ సంతాప ప్రకటనలో పేర్కొన్నారు సిరిల్‌. భారత ప్రధాని నరేంద్రమోడీతో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తదితరులు సోషల్‌ మీడియా వేదికగా డెస్మండ్‌కు నివాళులు అర్పించారు. ప్రపంచం ఓ గొప్ప పోరాటయోధుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.

జాతి వివక్షకు వ్యతిరేకంగా..
జోహన్నెస్‌బర్గ్‌ సమీపంలోని క్లెర్క్స్‌డోర్ప్ అనే చిన్న పట్టణంలో అక్టోబరు 7, 1931న జన్మించారు డెస్మండ్‌. నల్లజాతీయులు ఎదుర్కొంటున్న వివక్షను చిన్నప్పటి నుంచి ప్రత్యక్షంగా చూసిన ఆయన మొదట ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆతర్వాత 1985-86 మధ్య కాలంలో జొహన్నె్‌స్‌ బర్గ్‌ బిష్‌ప్‌గానూ..ఆపై 1986 నుంచి 1996 వరకు కేప్‌టౌన్‌ ఆర్చి బిష్‌ప్‌గానూ సేవలందించారు. ఈ క్రమంలోనే మొదటి నల్లజాతి బిషప్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. కాగా 1980 మధ్యకాలంలో దక్షిణాఫ్రికాలోని నల్లజాతీయులపై క్రూరమైన అణచివేతకు, జాతివివక్షకు వ్యతిరేకంగా డెస్మండ్‌ అవిశ్రాంత పోరాట సాగించారు. ఎల్జీబీటీల హక్కుల కోసం గళమెత్తారు. అహింసా పద్ధతిలో సాగించిన డెస్మండ్‌ సాగించిన పోరాటానికి గుర్తింపుగా 1984లో నోబెల్‌ శాంతి పురస్కారం అందుకున్నారు. కాగా టుటులో మంచి రచయిత కూడా ఉన్నారు. మరో జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ నాయకుడు నెల్సన్‌ మండేలా మొదటిసారిగా దేశాధ్యక్షుడిగా పగ్గాలు స్వీకరించినప్పుడు ‘రెయిన్‌ బో నేషన్‌ ‘ అని ఆయన నోటి నుంచి వచ్చిన మాట ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందింది.

అణగారిన వర్గాల కోసం..
నల్లజాతీయులపై వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన డెస్మండ్‌ అవినీతిపై కూడా అదే స్థాయిలో పోరాటం సాగించారు. నెల్సన్‌ మండేలా ప్రభుత్వంలో క్యాబినేట్‌ మంత్రులకు పెద్ద ఎత్తున జీతాలు ఇవ్వడంపై ఆయన బహిరంగంగా నిరసన తెలిపారు. ఆతర్వాత జాకబ్‌ జుమా ప్రభుత్వంలోని అవినీతిని కూడా ఎండగట్టారు. 1997 నుంచి ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతోన్న డెస్మండ్‌ పలుసార్లు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నారు. అయితే ఆదివారం శాశ్వతంగా కన్నుమూశారు. కాగా బరాక్‌ ఒబామా, ఏంజెల్‌ మెర్కెల్‌ తదితరులు డెస్మండ్‌ అందించిన సేవలను గుర్తుకు చేసుకుని ఆయనకు నివాళి అర్పించారు. అణగారిన వర్గాల కోసం డెస్మండ్‌ చేసిన పోరాటం మరవలేనిదని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టుటు మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా డెస్మండ్‌… ప్రపంచానికి ఓ స్ఫూర్తిప్రదాతని, ఆయన సేవలు వెలకట్టలేనివని రాహుల్‌ గాంధీ నివాళి అర్పించారు.

డెస్మండ్ గళం నుంచి వచ్చిన కొన్ని ఫేమస్  కొటేషన్లు..

‘ నీకు శాంతి కావాలంటే స్నేహితులతో మాట్లాడద్దు. నీ శత్రువులతో మాట్లాడు’

‘అన్యాయం జరిగే చోట తటస్థంగా ఉంటే మీరు కూడా అణచివేతదారులే అవుతారు. ఎలుక తోకపై ఏనుగు కాలు పెట్టినప్పుడు మీరు తటస్థంగా ఉన్నారని చెబితే ఎలుక మిమ్మల్ని మెచ్చుకోదు’ 

‘విభేదాలు, సారూప్యత అనేవి మనల్ని వేరు చేయడానికి, దూరం చేయడానికి ఉద్దేశించినవి కావు. ఒకరి అవసరాన్ని మరొకరు గ్రహించడానికి..’