AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుతిన్‌కు అరెస్ట్ భయం పట్టుకుందా..? ఆ 123దేశాల్లో అడుగుపెడితే అరెస్ట్ తప్పదా..?

రష్యా అధ్యక్షుడు ఆదేశాల్లో అడుగుపెడితే అంతేనా ? ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో పర్యటించాలంటేనే వ్లాదిమిర్ పుతిన్ భయపడుతున్నాడా? రెండు మూడేళ్లుగా విదేశీ పర్యటనలకు ఎందుకు వెళ్లలేకపోతున్నాడు? వచ్చే నెల జరిగే బ్రిక్స్ సమావేశాలకూ పుతిన్ డుమ్మా కొట్టబోతున్నాడా? అసలు పుతిన్‌లో ఇంత భయం ఎందుకు ఆవరించింది..? ఇదంతా యుద్ధం తెచ్చిన తంట.

పుతిన్‌కు అరెస్ట్ భయం పట్టుకుందా..? ఆ 123దేశాల్లో అడుగుపెడితే అరెస్ట్ తప్పదా..?
Russian President Vladimir Putin
Balaraju Goud
|

Updated on: Jun 26, 2025 | 10:30 PM

Share

రష్యా అధ్యక్షుడు ఆదేశాల్లో అడుగుపెడితే అంతేనా ? ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో పర్యటించాలంటేనే వ్లాదిమిర్ పుతిన్ భయపడుతున్నాడా? రెండు మూడేళ్లుగా విదేశీ పర్యటనలకు ఎందుకు వెళ్లలేకపోతున్నాడు? వచ్చే నెల జరిగే బ్రిక్స్ సమావేశాలకూ పుతిన్ డుమ్మా కొట్టబోతున్నాడా? అసలు పుతిన్‌లో ఇంత భయం ఎందుకు ఆవరించింది..? ఇదంతా యుద్ధం తెచ్చిన తంట.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అరెస్ట్ భయం పట్టుకుంది. అందుకే గత రెండు మూడేళ్లుగా బయటి దేశాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. దీనికికారణం.. 2023లో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేయడమే. ఉక్రెయిన్‌పై దాడి తర్వాత వందలాది పిల్లలను బలవంతంగా తరలించాడనే ఆరోపణలతో పుతిన్‌పై ICCలో కేసు ఫైల్‌ అయింది. దీంతో కీలకమైన అంతర్జాతీయ సదస్సులకు పుతిన్‌ హాజరు కాలేకపోతున్నారు. అంతేకాదు జూలై6న బ్రెజిల్‌లో జరిగే బ్రిక్స్ సదస్సుకు పుతిన్‌ డుమ్మా కొట్టబోతున్నాడు. దీంతో పుతిన్‌కు అరెస్ట్ భయం పట్టుకుందని అందుకే రాలేకపోతున్నాడన్న విశ్లేషణలు అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్నాయి. 2023లో దక్షిణాఫ్రికా బ్రిక్స్ సదస్సుకు, 2024లో బ్రెజిల్‌లో జరిగిన G20 సమావేశానికి కూడా పుతిన్ హాజరుకాలేదు. కారణం.. ICCవారెంటే అంటున్నారు విశ్లేషకులు.

2022లో ఉక్రెయిన్‌పై యుద్ధం తర్వాత వందలాది పిల్లలను రష్యాకు తరలించారని ICC ఆరోపిస్తోంది. అంతర్జాతీయ న్యాయ చట్టం ప్రకారం పిల్లలను తరలించడం యుద్ధ నేరంగా పరిగణిస్తారు. అంతేకాదు దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యా అధ్యక్షుడిపై న్యాయపోరాటం చేస్తున్నాడు. పుతిన్‌ను అరెస్ట్ చేయాల్సిందేనంటూ కౌన్సిల్ ఆఫ్ యూరప్‌తో కలిసి రష్యా దురాక్రమణపై ట్రిబ్యునల్ ఏర్పాటు చేశాడు. అయితే రష్యా ICC సభ్యదేశం కాదు. అందుకే కేసును తీవ్రంగా పరిగణించడంలేదు. పైగా ఉక్రెయిన్ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తోంది. ICC వారెంట్‌ను పాశ్చాత్య కుట్రగా చిత్రీకరిస్తోంది. ఉక్రెయిన్ పిల్లలను వార్‌ జోన్ నుంచి తాము సురక్షిత ప్రాంతాలకు తరలించామని వాదిస్తోంది. ఇది మానవతా దృక్పథంతో చేసిందే కానీ.. నేరం కాదన్నది రష్యా వెర్షన్. అయితే రష్యా వాదనను ఉక్రెయిన్‌తో పాటు ICC ఒప్పుకోవడంలేదు.

ICC సభ్య దేశాలు 123 ఉన్నాయి. ఈ దేశాలన్నీ రోమ్ స్టాట్యూట్‌పై సంతకం చేసినవే. అంటే ICC వారెంట్ ఉన్న వ్యక్తి సభ్యదేశాల్లో ఉంటే అరెస్ట్ చేయాల్సిందే. రోమ్ స్టాట్యూట్ 1998 ప్రకారం, యుద్ధ నేరాలు, జాత్యహంకారం, మానవత్వానికి వ్యతిరేక నేరాలకు సంబంధించిన ఆరోపణలపై ICC వారెంట్ జారీ చేస్తే, సభ్య దేశాలు దాన్ని అమలు చేయాలి. ఆర్టికల్ 59 ప్రకారం, వారెంట్ ఉన్న వ్యక్తి తమ భూభాగంలోకి అడుగుపెడితే అరెస్టు చేసి, ICCకు అప్పగించాలి. అంటే పుతిన్ 123దేశాల్లో ఏ దేశానికి వెళ్లినా రూల్ ప్రకారం అరెస్టు చేయాల్సిందే..!

అంతేకాదు పుతిన్‌పై జారీ అయిన వారెంట్ అత్యంత తీవ్రమైనది. ఎందుకంటే ఇది యుద్ధ నేరాలకు సంబంధించినది. ICC ఆరోపణల ప్రకారం, ఉక్రెయిన్ పిల్లలను బలవంతంగా తరలించడం అంతర్జాతీయ మానవతా చట్టాన్ని ఉల్లంఘించడమే. రోమ్ స్టాట్యూట్ ఆర్టికల్ 8 ప్రకారం, యుద్ధ సమయంలో పౌరులను బలవంతంగా తరలించడం చాలా పెద్ద నేరం కిందకు వస్తుంది. అందుకే పుతిన్ 123 ICC సభ్యదేశాల్లో ఏ సదస్సు జరిగినా హాజరుకాలేకపోతున్నాడు.

ఇదిలావుంటే, 2024లో మంగోలియాకు పుతిన్ వెళ్లాడు. మంగోలియా ICC మెంబర్ అయినా.. అక్కడ పుతిన్‌ను అరెస్ట్ చేసే పరిస్థితులు లేవు. ఎందుకంటే చైనా-రష్యా మధ్య ఉన్న మంగోలియా ఎక్కువగా రష్యాపైనే ఆధారపడుతోంది. అయిల్‌తోపాటు పలు కీలకమైన వాణిజ్య సంబంధాలు రష్యాతో ఉన్నాయి. ఒకవేళ ICCఒత్తిడితో పుతిన్‌ను అరెస్ట్ చేస్తే, మంగోలియాకు దౌత్యపరంగా పలు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పైగా ICCరూల్‌ 98 ప్రకారం ఏదేశమైన దౌత్యపరమైన ఇబ్బందులుంటే.. అరెస్ట్ నుంచి మినహాయించవచ్చు. అందుకే ధైర్యంగా మంగోలియా పర్యటనకు పుతిన్ వెళ్లగలిగాడు. కానీ బ్రెజిల్ అలాంటి రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేదు. అందుకే బ్రిక్స్ సమావేశాలకు పుతిన్ వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సమావేశాల టైమ్‌లో వర్చువల్‌గా హాజరవుతారని రష్యా ప్రకటించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..