Russia Ukraine War: ఉక్రెయిన్‌పై దూకుడుగా ముందుకెళ్తున్న రష్యా.. పట్టు సాధించేందుకు దాడులు ముమ్మరం
Russia Ukraine War: లుహాన్స్క్ ప్రాంత పాలనా నగరం సెవిరోదొనెట్స్క్‌పై, పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు పుతిన్ సేనలు దాడులను ముమ్మరం చేశాయి.

Russia Ukraine War: రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. యుద్ధం ప్రారంభమై నాలుగు నెలలు దాటి.. ఐదో నెలలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో రష్యన్ సేనలు ఉక్రెయిన్‌పై మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. నగరాలు, పట్టణాలతో పాటు గ్రామాలనూ హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా లోస్కువిట్కా, రాయ్-ఒలెస్కాండ్రివ్కా ప్రాంతాల్లో పుతిన్ బలగాలు పాగా వేశాయి. లుహాన్స్క్ ప్రాంత పాలనా నగరం సెవిరోదొనెట్స్క్‌పై, పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు పుతిన్ సేనలు దాడులను ముమ్మరం చేశాయి. అక్కడికి సమీపంలోని సిరోటైన్ పట్టణాన్ని స్వాధీనం చేసుకునేందుకు దాడులను మరింత ఉధ్ధృతం చేశాయి. ఉక్రెయిన్ సైనికులకు సామాగ్రిని సరఫరా చేసేందుకు కీలకంగా మారిన లెసిచాన్స్క్-బఖ్‌ముత్ రోడ్డును కూడా రష్యా బలగాలు దిగ్బంధించాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకూ లుహాన్స్క్‌లో సుమారు 95 శాతం భూభాగాన్ని, డోనెట్స్క్‌లో సగం ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకుంది.
పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకునేందుకు గురి మరింత పెంచింది రష్యా. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో, యూరప్ కేంద్రంగా వచ్చే వారంలో జరిగే మూడు కీలక శిఖరాగ్ర సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉక్రెయిన్‌కు ఈయూ సభ్యత్వం మంజూరుపై ఈ సమావేశాల్లోనే ప్రకటనచేసే అవకాశముంది. ఉక్రెయిన్ పొరుగు దేశమైన మాల్దోవాకు కూడా సభ్యత్వాన్ని ఖరారుచేసే అంశంపై చర్చిస్తున్నారు. అటు, నాటో దేశాల నేతలు మాద్రీద్‌లో భేటీ కానున్నారు. ఫిన్లాండ్, స్వీడన్‌లను కూటమిలో చేర్చుకునే విషయమై ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత ఏర్పడింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..