AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం.. ‘ఇంధన కాల్పుల విరమణ’ ప్రకటించిన ట్రంప్!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను నిలిపివేసేలా ‘ఇంధన కాల్పుల విరమణ’ ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందం తక్షణమే అమల్లోకి వస్తుందని, ఇరు పక్షాలు దీనిని ఉల్లంఘించకూడదని ఆయన ఆదివారం (అక్టోబర్ 11) తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు.

రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం.. ‘ఇంధన కాల్పుల విరమణ’ ప్రకటించిన ట్రంప్!
Russia Ukraine Ceasefire
Balaraju Goud
|

Updated on: Oct 11, 2026 | 9:12 PM

Share

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను నిలిపివేసేలా ‘ఇంధన కాల్పుల విరమణ’ ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందం తక్షణమే అమల్లోకి వస్తుందని, ఇరు పక్షాలు దీనిని ఉల్లంఘించకూడదని ఆయన ఆదివారం (అక్టోబర్ 11) తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ ప్రకటనపై రష్యా, ఉక్రెయిన్ ప్రభుత్వాల నుంచి స్వతంత్ర ధ్రువీకరణ రాలేదు. ఒప్పందానికి సంబంధించిన నిబంధనలు, అమలు విధానం కూడా స్పష్టంగా వెల్లడికాలేదు.

Trump Energy Ceasefire

Trump Energy Ceasefire

జెలెన్‌స్కీ నాయకత్వంపై ట్రంప్ విమర్శలు

ఈ ప్రకటనకు ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీపై ట్రంప్ విమర్శలు చేశారు. రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు జెలెన్‌స్కీ తగినంతగా కృషి చేయడం లేదని ఆరోపిస్తూ, ఉక్రెయిన్ కొత్త నాయకుడిని ఎన్నుకోవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై ఉక్రెయిన్ జరుపుతున్న దాడులు ఇంధన ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని కూడా ట్రంప్ పేర్కొన్నారు.

60 రోజుల కాల్పుల విరమణకు జెలెన్‌స్కీ షరతు!

ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన జెలెన్‌స్కీ.. తమ దేశ నాయకుడిని ఎన్నుకునే హక్కు ఉక్రెయిన్ ప్రజలకే ఉందని స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహించాలని అమెరికా కోరుకుంటే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను 60 రోజుల పాటు పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకరించేలా ఒప్పించాలని సూచించారు. అలా జరిగితే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం యుద్ధ పరిస్థితులు, అమల్లో ఉన్న మార్షల్ లా కారణంగా ఉక్రెయిన్‌లో ఎన్నికలు నిర్వహించడంపై పరిమితులు ఉన్నాయి.

దాడులు ఆపేందుకు పరస్పర హామీ..!

ఉక్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాలపై రష్యా దాడులు నిలిపివేస్తే, తమ దేశం కూడా రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులను ఆపేందుకు సిద్ధంగా ఉందని జెలెన్‌స్కీ వెల్లడించారు. ఉద్రిక్తతలు తగ్గాలంటే ఇరుపక్షాలూ చర్యలు తీసుకోవాలని, దీనికి పటిష్టమైన హామీలు అవసరమని పేర్కొన్నారు.

ట్రంప్ ప్రకటించిన ఇంధన కాల్పుల విరమణ నిజంగా అమల్లోకి వచ్చిందా? ఇరు దేశాలు దాన్ని ఎంతవరకు పాటిస్తాయి? అనే అంశాలపై ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ఈ పరిణామం యుద్ధం తగ్గుముఖం పట్టేందుకు దోహదపడుతుందా అన్నది రానున్న రోజుల్లో స్పష్టమవుతుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us