Russia Hypersonic Missile: రష్యా మరో బ్రహ్మస్త్రాన్ని ప్రయోగించింది. అధునాతన క్షిపణి పరీక్షను నిర్వహించింది. మొట్టమొదటిసారి హైపర్‌సోనిక్ క్షిపణిని రష్యా అణు జలాంతర్గామి నుంచి విజయవంతంగా నిర్వహించినట్లు రష్యా సైన్యం ప్రకటించింది. సెవెరోద్‌విన్సిక్ జలాంతర్గామి నుంచి ప్రయోగించిన జిర్కోన్ క్షిపణి బారెంట్స్ సముద్రంలోని నిర్దేశిత డమ్మీ లక్ష్యాన్ని తాకిందని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. జలాంతర్గామి నుంచి జిర్కాన్ క్షిపణిని రష్యా ప్రయోగించడం ఇది మొదటిసారి. నౌకాదళానికి చెందిన నౌక నుంచి గతంలో పలుసార్లు ఈ క్షిపణి ప్రయోగ పరీక్షలు రష్యా నిర్వహించింది. ధ్వని వేగం కన్నా ఎనిమిదిరెట్లు అధిక వేగంతో ప్రయాణించగల సామర్థ్యం జిర్కాన్ క్షిపణికున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు.
కాగా, ఈ క్షిపణి 1,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదని, ఈ క్షిపణి ప్రవేశం ద్వారా రష్యా సైనిక సామర్థ్యం మరింత బలోపేతం కాగలదని పుతిన్ పేర్కొననారు. జిర్కాన్ పాటవ పరీక్షలు ఈ ఏడాది చివరి కల్లా పూర్తయి 2022లో ఇది రష్యా నౌకాదళంలో ప్రవేశించగలదని అధికారులు తెలిపారు. అమెరికా , ఫ్రాన్స్ , చైనా , బ్రిటన్‌తో పోటీ పడి రష్యా క్షిపణి పరీక్షలను నిర్వహిస్తోంది. కొత్తతరం ఆయుధ వ్యవస్థలో జిర్కోన్ హైపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణితో పోటీకి వచ్చే ఆయుధం ప్రపంచంలో ఎక్కడ లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. జిర్కోన్ హైపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని తయారు చేసిన రష్యా రక్షణ రంగ నిపుణులను పుతిన్ అభినందించారు. త్వరలో మరిన్ని అధునాతన క్షిపణి ప్రయోగాలు చేస్తామని రష్యా ప్రకటించింది. రష్యా చాలా క్షిపణి ప్రయోగాలు చేసింది. కాని తాజాగా చేసిన టెస్ట్ మాత్రం వాటితో పోలిస్తే విభిన్నమైనదని డిఫెన్స్ రంగ నిపుణులు చెబుతున్నారు. సుదూర లక్ష్యాలను చేధించగల క్షిపణుల తయారీకి రష్యా మొగ్గు చూపుతోంది.
Read Also… Google: మీ ప్రతి కదలికను గమనిస్తున్నారు.. వారు అలా చెయ్యొద్దంటే.. మీరు ఇలా చేయాలి.. లేకుంటే అంతే..