AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ రోబో

చైనా రాజధాని బీజింగ్‌లో ఘనంగా జరుగుతున్న 'వరల్డ్ రోబో కాన్ఫరెన్స్'లో నమ్మలేని సీన్‌ ఆవిష్కృతమైంది. రోబోకు సంబంధించిన రిమోట్-కంట్రోల్ కనెక్షన్ సడెన్‌గా నిలిచిపోయింది. అంతే... మరుక్షణమే ఆ యంత్రం తన నియంత్రణను పూర్తిగా కోల్పోయింది! వెల్లకిల్లా కిందపడి, కాళ్లు చేతులు కొట్టుకోవడం ప్రారంభించింది.

ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ రోబో
Robot Malfunctions Suffers 'seizure' At China Conference
Sharada V
|

Updated on: Aug 21, 2026 | 5:15 PM

Share

అప్పటివరకు రోబోటిక్స్ ప్రపంచంలో సరికొత్త విప్లవానికి వేదికైన ఆ సదస్సు… ఒక్కసారిగా ఆందోళనకరంగా మారింది! ఒక వైపు హ్యూమనాయిడ్ రోబోల సాంకేతికతను ప్రపంచానికి చాటిచెప్పేలా ప్రదర్శన జరుగుతుండగా, మరో వైపు ఒక రోబో నియంత్రణ కోల్పోయి ప్రవర్తించడం మొదలుపెట్టింది. దాంతో క్షణాల్లో అక్కడి వాతావరణం మారిపోయింది! చైనా రాజధాని బీజింగ్‌లో ఘనంగా జరుగుతున్న ‘వరల్డ్ రోబోట్ కాన్ఫరెన్స్’లో నమ్మశక్యం కాని నిజం ఆవిష్కృతమైంది. రోబోలు ఎంత సమర్థవంతంగా పనిచేస్తాయో పర్యాటకులకు, నిపుణులకు ప్రత్యక్షంగా ప్రదర్శిస్తున్న సమయంలో ఒక హ్యూమనాయిడ్ రోబోలో తీవ్రమైన సాంకేతిక లోపం తలెత్తింది.

కంట్రోల్ తప్పిన క్షణాలు… ఫిట్స్ వచ్చినట్లుగా వింత ప్రవర్తన!

ప్రదర్శన సాగుతుండగానే ఆ రోబోకు సంబంధించిన రిమోట్-కంట్రోల్ కనెక్షన్ సడెన్‌గా నిలిచిపోయింది. అంతే… మరుక్షణమే ఆ యంత్రం తన నియంత్రణను పూర్తిగా కోల్పోయింది! హఠాత్తుగా వెల్లకిలా కిందపడిపోయి, కాళ్లను, చేతులను వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఫిట్స్ వస్తే మనిషి ఎలా ప్రవర్తిస్తాడో, చిన్న పిల్లవాడు నేలపై పడి మొండిగా ఏడుస్తూ కాళ్లు చేతులు కొట్టుకుంటే ఎలా ఉంటుందో, సరిగ్గా రోబో ప్రవర్తన అలాగే ఉంది! ఊహించని పరిణామాన్ని చూసి అక్కడి వారంతా షాకయ్యారు. కొందరు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. మరికొందరు ఏం జరుగుతుందా అని ఆందోళనపడ్డారు.

స్విచ్ ఆఫ్ చేసేందుకు ఇంజనీర్ల  తంటాలు!

పరిస్థితి చేయి దాటిపోతుండటంతో రంగంలోకి దిగిన ఆపరేటర్లు, ఇంజనీర్లు రోబోను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించారు. అది ఎవరిపైనా పడి వారిని గాయపరచకుండా దానిని బలంగా పట్టుకుని, పవర్ ఆఫ్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆ రోబో ఎంత బలంగా కదిలిందంటే దానిని వెంటనే స్విచ్ ఆఫ్ చేయడం లేదా ఆపడం ఇంజనీర్లకు పెద్ద సవాలుగా మారింది! రోబోటిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని సంబరపడుతున్న వేళ అవి నియంత్రణ కోల్పోతే భవిష్యత్తులో మనుషుల పరిస్థితి ఏంటనే ప్రశ్న ఈ ఘటనతో మళ్లీ మొదలైంది. అసలు ఆ రోబోలో అంత తీవ్రమైన లోపం ఎందుకు వచ్చింది? సాంకేతిక సమస్యేనా లేక మరేదైనా కారణం ఉందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది!

రోబో సడెన్‌గా నేలపై పడి కాళ్లు, చేతులు కొట్టుకోవడం పై సోషల్ మీడియాలో మీమ్స్‌, విమర్శలు వెల్లువెత్తాయి! ఒక నెటిజన్ స్పందిస్తూ..”షాపింగ్ మాల్‌కి వెళ్లినప్పుడు షాపులో ఆటబొమ్మ కొనివ్వకపోతే నా చిన్న కొడుకు నేలపై పడి ఎలా ఏడుస్తాడో, ఈ రోబో సరిగ్గా అలాగే చేసింది!” అని ఎగతాళి చేశాడు. సాంకేతికత ఎంత ముందుకు వెళ్లినా, రిమోట్ కంట్రోల్ ఫెయిల్ అయినప్పుడు దానిని వెంటనే స్విచ్ ఆఫ్ చేసేందుకు ఇంజనీర్లు పడ్డ తిప్పలను చూసి నెటిజన్లు భయాందోళన వ్యక్తం చేశారు. మరొక యూజర్ వ్యాఖ్యానిస్తూ… “సాంకేతిక పురోగతి చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది… ఏదైనా తేడా కొట్టేంత వరకు మాత్రమే!” అని సెటైర్ వేశాడు.

Follow Us