క్యాన్సర్‌తో యజమాని మృతి.. 8 ఏళ్లుగా ఆసుపత్రి బయటే కోడి.. హృదయాన్ని కదిలించే కథ!
Bolivia rooster Martin Story Telugu: యజమాని క్యాన్సర్‌తో మరణించినా, బొలీవియాలోని ఓ ఆసుపత్రి ప్రాంగణాన్ని విడిచిపెట్టడం లేదు మార్టిన్ అనే కోడి. ఎనిమిదేళ్లుగా అక్కడే కనిపిస్తున్న ఈ కోడి కథ ఇప్పుడు వైరల్‌గా మారింది. జపాన్‌లో యజమాని కోసం ఎదురుచూసిన హచికో కుక్కను గుర్తు చేస్తున్న మార్టిన్ కథ వెనుక ఆసక్తికరమైన విషయాలివే!

బొలీవియా: సాధారణంగా మనుషులు పెంచుకునే జంతువులు తమ యజమానులతో ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరచుకుంటాయి. అయితే, తమ యజమాని దూరమైన తర్వాత కూడా వారు ఉన్న చోటే ఉండిపోతే ఆ కథ అందరినీ కదిలిస్తుంది. బొలీవియాలోని మార్టిన్ అనే కోడి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్యాన్సర్‌తో తన యజమాని మరణించినప్పటికీ, ఆ కోడి మాత్రం ఆయన చివరిసారిగా కనిపించిన ఆసుపత్రి ప్రాంగణాన్ని విడిచిపెట్టకుండా అక్కడే ఉంటోంది. దీంతో జపాన్‌లో తన యజమాని కోసం రైల్వే స్టేషన్‌లో ఏళ్ల తరబడి ఎదురుచూసిన హచికో అనే విశ్వాసపాత్రమైన కుక్కతో మార్టిన్‌ను పోలుస్తున్నారు.
అసలు ఏంటీ మార్టిన్ కథ?
ADN Noticias కథనం ప్రకారం.. బొలీవియాలోని శాంటా క్రూజ్ నగరంలో ఉన్న ఈస్టర్న్ బొలీవియా ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (క్యాన్సర్ చికిత్స కేంద్రం) వద్ద మార్టిన్ అనే కోడి చాలా కాలంగా ఉంటోంది. దాని యజమాని క్యాన్సర్ చికిత్స కోసం ఈ ఆసుపత్రికి వచ్చేవారు. అయితే, కొంతకాలం తర్వాత ఆయన క్యాన్సర్‌తో మరణించారు. అప్పటి నుంచి మార్టిన్ మాత్రం ఆసుపత్రి పరిసరాలను విడిచిపెట్టలేదు. ఆసుపత్రి ప్రాంగణంలో అటూ ఇటూ తిరుగుతూ, బయట ఉన్న చెట్లపై విశ్రాంతి తీసుకుంటూ రోజులు గడుపుతోంది. తన యజమాని చివరిసారిగా కనిపించిన ప్రదేశాన్ని విడిచిపెట్టకుండా అక్కడే ఉంటోంది.
హచికోతో పోలుస్తున్న స్థానికులు
జపాన్‌లో హచికో అనే కుక్క తన యజమాని మరణించిన తర్వాత కూడా ఆయన కోసం రైల్వే స్టేషన్‌లో ఎదురుచూస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు మార్టిన్ కథ కూడా అదే తరహాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన యజమాని తిరిగి వస్తారనే ఆశతోనే మార్టిన్ అక్కడ ఉంటోందని పలువురు భావిస్తున్నారు. అయితే, కోడి నిజంగానే తన యజమాని కోసం ఎదురుచూస్తోందా? లేక ఆసుపత్రి పరిసరాలను తన నివాసంగా మార్చుకుందా? అనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని నివేదికలు పేర్కొంటున్నాయి.
పాప్‌కార్న్ అంటే మార్టిన్‌కు చాలా ఇష్టం!
స్థానిక మీడియా సంస్థ రెడ్ ఉనో (Red Uno) ప్రచురించిన కథనాల ప్రకారం.. మార్టిన్‌కు ఆహారం అందించే వ్యక్తుల దగ్గరకు అది సాధారణంగా వస్తుంది. ముఖ్యంగా పాప్‌కార్న్ (మొక్కజొన్న పేలాలు) అంటే దానికి చాలా ఇష్టమని తెలుస్తోంది. ఆసుపత్రి సిబ్బంది, సమీపంలోని దుకాణదారులు మార్టిన్‌పై ప్రత్యేకమైన అభిమానం పెంచుకున్నారు. దానికి సమయానికి ఆహారం అందిస్తూ, దాని బాగోగులను చూసుకుంటున్నారు. దీంతో మార్టిన్ అక్కడి వారందరికీ సుపరిచితమైన జీవిగా మారిపోయింది.
ఎనిమిదేళ్ల తర్వాత కూడా అదే చోట!
రాయిటర్స్ (Reuters) వార్తా సంస్థ ఇటీవల మార్టిన్ కథను ప్రచురించడంతో ఈ ఉదంతం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శాంటా క్రూజ్‌లోని ఈస్టర్న్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ వెలుపల మార్టిన్‌కు సంబంధించిన తాజా ఫొటోలను కూడా వార్తా సంస్థ పంచుకుంది. ఆ కథనాల ప్రకారం, మార్టిన్ అక్కడికి వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత కూడా అదే ప్రాంతంలో కనిపిస్తోంది. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి కుటుంబ సభ్యులు, వైద్యులు, సందర్శకులకు అది ఒక పరిచయమైన దృశ్యంగా మారింది.
జంతువులు తమ అనుబంధాన్ని మనుషుల మాదిరిగా మాటల్లో వ్యక్తం చేయలేకపోవచ్చు. అయితే, మార్టిన్ కథ మాత్రం మనుషులకు, జంతువులకు మధ్య ఏర్పడే బంధాల గురించి మరోసారి ఆలోచించేలా చేస్తోంది. అది నిజంగా తన యజమాని కోసం ఎదురుచూస్తోందో లేదో తెలియకపోయినా, దాని కథ మాత్రం స్థానికుల హృదయాలను తాకుతోంది.
