AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరో తండ్రి మామూలోడు కాదు.. తన సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేశాడు.

తెలుగు సినిమాకు విప్లవాత్మక మలుపునిచ్చిన దర్శకుడు టి. కృష్ణ. కేవలం మూడేళ్ల కెరీర్‌లో ప్రతిఘటన వంటి ఐకానిక్ చిత్రాలతో సామాజిక సమస్యలను బలంగా ప్రస్తావించి, విజయశాంతి, రాజశేఖర్‌లను సూపర్‌స్టార్‌లుగా తీర్చిదిద్దారు. ఆయన సినిమాల ప్రభావం, నేటికీ సమాజంలో మార్పు రాకపోవడంపై తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఆ హీరో తండ్రి మామూలోడు కాదు.. తన సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేశాడు.
Tammareddy Bharadwaj
Rajeev Rayala
|

Updated on: Oct 23, 2026 | 9:54 AM

Share

తెలుగు సినిమా చరిత్రలో దర్శకుడు టి. కృష్ణ పేరు విప్లవాత్మకమైన, సామాజిక స్పృహ కలిగిన చిత్రాలకు పర్యాయపదంగా నిలుస్తుంది. ఆయన కేవలం మూడేళ్ల స్వల్ప కెరీర్‌లో (1983-1986) ఆరేడు చిత్రాలను మాత్రమే రూపొందించినప్పటికీ, ప్రతి చిత్రం ఒక సామాజిక సందేశంతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ ఆయన కృషిని స్మరించుకుంటూ, తెలుగు సినిమాపై ఆయన ప్రభావం ఎంత గొప్పదో వివరించారు. టి. కృష్ణ ప్రజానాట్య మండలి నేపథ్యం నుంచి వచ్చినవారు. మాదాల రంగారావు, పోకూరి బాబూరావు, ఎం.వి.ఎస్. హరనాథరావు వంటి ప్రముఖులతో కలిసి ఆయన తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. మాదాల రంగారావు ఎర్రజెండా నేపథ్య చిత్రాలతో సామాజిక మార్పును కోరగా, టి. కృష్ణ అదే భావజాలాన్ని ఒక సినిమా ఫార్మాట్‌లో పటిష్ఠంగా ప్రజలకు చేరవేశారని తమ్మారెడ్డి అన్నారు.

నేటి భారతంతో తన దర్శకత్వ ప్రస్థానం ప్రారంభించిన కృష్ణ, సమాజంలో జరుగుతున్న వాస్తవాలను, అన్యాయాలను నిర్మొహమాటంగా తెరకెక్కించారు. ఆయన సినిమాలలో దేశంలో దొంగలు పడ్డారు, వందేమాతరం, దేవాలయం, రేపటి పౌరులు వంటివి ప్రేక్షకుల మన్ననలను పొందాయి. అయితే, టి. కృష్ణ కెరీర్‌కు మైలురాయిగా నిలిచిన చిత్రం ప్రతిఘటన. ఈ సినిమా విడుదలైన రోజుల్లో ఒక సంచలనం సృష్టించింది. తమిళం, హిందీతో సహా అనేక భాషల్లో రీమేక్ అయ్యి ఘన విజయం సాధించింది. ప్రతిఘటన చిత్రం అప్పటి సామాజిక, రాజకీయ పరిస్థితులను ప్రతిబింబిస్తూ, అన్యాయంపై ఒక మహిళ పోరాటాన్ని అద్భుతంగా చూపించింది. ఈ సినిమా విజయశాంతిని ఒక సాధారణ నటి స్థాయి నుంచి సూపర్‌స్టార్‌గా ఎదిగేందుకు దోహదపడగా, రాజశేఖర్‌కు ఒక బలమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. చరణ్ రాజ్, కోట శ్రీనివాసరావు వంటి పాత్రలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి.

టి. కృష్ణ సినిమాలలోని పాటలు కేవలం వినోదం కోసం కాకుండా, కథా గమనంలో భాగమై, బలమైన సందేశాలను అందించాయి. ప్రతిఘటనలోని “ఈ దుర్మార్గ దుశ్శాసన లోకంలో” లేదా వందేమాతరంలోని “వందేమాతరం గీతం వరుస మారుతోంది” వంటి పాటలు ఆ కాలంలోనే కాక, నేటికీ ఆదరణ పొందుతూ, సమాజంలో మార్పు రాలేదని గుర్తుచేస్తున్నాయని తమ్మారెడ్డి అన్నారు. అప్పట్లో కల్తీలు, అవినీతి వంటి దొంగతనాలు జరిగితే, నేడు మనుషులను, పార్టీలను కల్తీ చేస్తున్నారని, సమాజాన్ని కుళ్ళబెడుతున్నారని తమ్మారెడ్డి భరద్వాజ  అభిప్రాయపడ్డారు. కాగా టి. కృష్ణ కొడుకు ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోగా రాణిస్తున్న గోపీచంద్ అని చాలా మందికి తెలిసే ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us