Accidental missile fire: పంజాబ్ అంబాలాలోని భారత వాయుసేన స్థావరంలో సాధారణ నిర్వహణ తనిఖీలు చేస్తుండగా.. ఓ సూపర్‌సోనిక్ క్షిపణి పొరపాటున పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోకి దూసుకెళ్లి పేలింది. మార్చి 9వ తేదీన జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం కానీ జరగలేదు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు భారత రక్షణ శాఖ వెల్లడించింది. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అప్పట్లో పార్లమెంట్‌లో కూడా ప్రకటన చేశారు. కాగా.. కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఆధారంగా ఇటీవల ముగ్గురు ఉన్నతాధికారులపై వేటు వేశారు. అయితే.. భారత్ తీసుకున్న చర్యలపై పాకిస్థాన్ అసంతృప్తి వ్యక్తంచేసింది. ప్రమాదవశాత్తూ సూపర్‌సోనిక్ క్షిపణి పేల్చడంపై భారత్ తీసుకున్న చర్యలు సంతృప్తికరంగా లేవంటూ పాకిస్థాన్ పేర్కొంది. తమ భూభాగంలో ల్యాండ్ అయిన క్షిపణికి సంబంధించి ఉమ్మడి విచారణ జరిపించేందుకు భారత్ అంగీకరించాలంటూ డిమాండ్ చేసింది.
స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPలు) ఉల్లంఘనలతోనే ప్రమాదవశాత్తూ క్షిపణి పేలుడికి దారితీసిందని కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీ (CoI) గుర్తించింది. ఆ తర్వాత భారత వైమానిక దళానికి చెందిన ముగ్గురు అధికారులను ఆగస్టు 23న సస్పెండ్ చేసింది. నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని భారత ప్రభుత్వం పేర్కొంది. అయితే.. ఈ చర్యలపై స్పందించిన పాకిస్తాన్.. అత్యంత బాధ్యతారాహిత్యమైన ఘటనను భారత్ మూసివేసిందంటూ పేర్కొంది. భారత్ తీసుకున్న చర్యలు సంతృప్తికరంగా లేవని.. ఇవి సరిపోవని పేర్కొంది. “నిజంగా భారత్‌కు దాచడానికి ఏమీ లేకుంటే, పారదర్శకత స్ఫూర్తితో సంయుక్త దర్యాప్తు కోసం అంగీకరించాలి” అంటూ పేర్కొంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..