Pakistan: ఆర్థిక సంక్షోభానికి ఇమ్రాన్ కారణమన్న పాకిస్తాన్ ప్రధాని .. ప్రజల కోసం తన బట్టలైనా అమ్మేస్తానంటూ వ్యాఖ్య..

Pakistan: పొరుగు దేశం పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకవైపు ఆ దేశాన్ని విదేశీ అప్పుల భారం, మరో పక్క తక్కువగా ఉన్న ఫారెక్స్ నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Pakistan: ఆర్థిక సంక్షోభానికి ఇమ్రాన్ కారణమన్న పాకిస్తాన్ ప్రధాని .. ప్రజల కోసం తన బట్టలైనా అమ్మేస్తానంటూ వ్యాఖ్య..
Pakistan
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 31, 2022 | 1:00 PM

Pakistan: పొరుగు దేశం పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకవైపు ఆ దేశాన్ని విదేశీ అప్పుల భారం, మరో పక్క తక్కువగా ఉన్న ఫారెక్స్ నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలు ఉపయోగించే పిండితో సహా అనేక నిత్యావసరాల ధరలు అమాంతం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆర్థిక సంక్షోభ సమయంలో పాకిస్థాన్‌లో రాజకీయాలు కూడా జోరందుకున్నాయి. ఇటీవలే అధికారం నుంచి తప్పుకున్న ఇమ్రాన్ ఖాన్ తన మద్దతుదారులతో ర్యాలీలు నిర్వహిస్తుండగా.. పాకిస్థాన్‌కు కొత్త ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఓ విచిత్రమైన ప్రకటన చేశారు. ప్రజలకు తక్కువ ధరకు పిండిని అందించడానికి తన బట్టలు కూడా అమ్మడానికి సిద్ధంగా ఉన్నానంటూ ప్రజలను ఉద్దేశించి షరీఫ్ కామెంట్ చేశారు.

పాకిస్థాన్ వార్తాపత్రిక డాన్ ప్రకారం.. షరీఫ్ ఆదివారం థకారా స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఖైబర్ ఫక్తున్‌ఖ్వా ముఖ్యమంత్రి మహమూద్ ఖాన్‌ను రానున్న 24 గంటల్లో 10 కిలోల పిండి ప్యాకెట్ ధర రూ.400 చెల్లించకపోతే తన బట్టలు అమ్మి ప్రజలకు తక్కువ ధరకు పిండిని అందజేస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలో షరీఫ్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కూడా టార్గెట్ చేశారు.

ఇమ్రాన్ పాలన కారణంగా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అద్వారనంగా తయారైందని ఆరోపించారు. దేశ ప్రజలకు మాజీ ప్రధాని అత్యధిక ద్రవ్యోల్బం, నిరుద్యోగితను బహుమతిగా ఇచ్చారని ఎద్దేవా చేశారు.  50 లక్షల ఇళ్లు, కోటి ఉద్యోగాలు ఇస్తామని ఖాన్ గతంలో ఇచ్చిన హామీని గుర్తుచేశారు. అయితే దాన్ని నెరవేర్చలేక పోగా దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేరంటూ నిప్పులు చెరిగారు. దేశ ప్రజల జీవితాలను త్వరలోనే అభివృద్ధి పథంలోకి తీసుకొస్తానని.. దేశాన్ని తిరిగి సుభీక్షంగా మారుస్తానని కొత్త ప్రధాని హామీ ఇచ్చారు.

ప్రస్తుతం పాకిస్తాన్‌లో డీజిల్-పెట్రోల్ ధరలు ఆకాశానికి చేరుకున్నాయని షరీఫ్ ప్రస్తావించారు. ఈ పరిస్థితికి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కారణమని ఆరోపించారు. అవిశ్వాస తీర్మానం ద్వారా తనను ప్రజలు అధికారం నుంచి తప్పిస్తారనే.. ఇమ్రాన్ ప్రపంచ వ్యాప్తంగా పెట్రో ధరలు పెరుగుతున్నా తగ్గించారని అన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.