నేపాల్‌లో భీకర ఆకస్మిక వరదలు.. రసువా జిల్లాలో భారీ విధ్వంసం
నేపాల్‌లోని రసువా జిల్లాలో భీకర ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. టిబెట్ సరిహద్దు సమీపంలోని గ్రామాలు, ప్రాజెక్టు ప్రాంతాలు కొట్టుకుపోయినట్లు సమాచారం. సుమారు వెయ్యి మంది గల్లంతయ్యారనే వార్తలు వస్తున్నప్పటికీ, అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. భోటే కోషి నదిలో ఒక్కసారిగా నీటి మట్టం పెరగడమే వరదలకు కారణంగా భావిస్తున్నారు.

నేపాల్‌లోని రసువా జిల్లాలో బుధవారం ఉదయం సంభవించిన భారీ ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. టిబెట్ సరిహద్దుకు సమీపంలోని పర్వత ప్రాంతాల్లో ఉధృతంగా వచ్చిన వరద నీరు గ్రామాలు, నిర్మాణ ప్రాజెక్టు ప్రాంతాలను కొట్టుకుపోయినట్లు సమాచారం. ఈ విపత్తులో సుమారు వెయ్యి మంది గల్లంతయ్యారనే సమాచారం వెలువడుతున్నప్పటికీ, దీనిపై ఇంకా అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో వరదలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. దీంతో నదీ తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అధికారులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు, ఎత్తైన ప్రదేశాలకు తరలివెళ్లాలని హెచ్చరించారు.
రసువాలో తీవ్ర నష్టం
రసువా జిల్లాలోని పర్వత ప్రాంతాలైన స్యాప్రుబేసి, టిమురే ప్రాంతాలు వరదలతో తీవ్రంగా దెబ్బతిన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టిబెట్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఈ ప్రాంతాల్లో వరద ప్రవాహం అత్యంత ఉధృతంగా ఉండటంతో పలు గ్రామాలు, ప్రాజెక్టు ప్రాంతాలు కొట్టుకుపోయినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నందున మృతులు, గల్లంతైన వారి సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. సుమారు వెయ్యి మంది వరదల్లో చిక్కుకున్నారనే లేదా కొట్టుకుపోయారనే సమాచారం వెలువడుతున్నా.. దీనిని అధికారులు ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు.
भोटेकोसी नदी रसुवामा तिब्बत तर्फबाट ठुलो बाढी प्रवेश गरेकोले अर्को सूचना नआउँदासम्म त्रीशुली नदीको तटिय क्षेत्रका जिल्लाहरु नुवाकोट, धादिङ, चितवन, गोरखा लगायतका स्थानहरूमा उच्च सतर्कता सहित सुरक्षित स्थानमा रहन अनुरोध छ। pic.twitter.com/Zun6icZZCM
— Nepal Police (@NepalPoliceHQ) August 26, 2026
వరదలకు కారణమేంటి?
నేపాల్ పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం టిబెట్ వైపు నుంచి ఉద్భవించే భోటే కోషి నదిలో నీటి మట్టం ఒక్కసారిగా భారీగా పెరగడంతో ఈ ఆకస్మిక వరదలు సంభవించాయి. నది ఉప్పొంగి ప్రవహించడంతో దిగువ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
త్రిశూలి నదీ పరివాహక ప్రాంతంలోని నువాకోట్, ధాదింగ్, చిత్వాన్, గోర్ఖా జిల్లాలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించారు.
కొనసాగుతున్న సహాయక చర్యలు
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అత్యవసర బృందాలు దెబ్బతిన్న ప్రాంతాలకు చేరుకుని నష్టం అంచనా వేస్తున్నాయి. వరద ప్రవాహంలో చిక్కుకున్న లేదా కొట్టుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే పర్వత ప్రాంతం కావడం, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతినడం సహాయక చర్యలకు పెద్ద సవాలుగా మారింది. వరద తీవ్రత ఇంకా కొనసాగుతుండటంతో అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.
అత్యవసర సమావేశం నిర్వహించిన ప్రధాని బలెన్ షా
నేపాల్‌లో వరదలు సృష్టించిన భారీ విధ్వంసం నేపథ్యంలో ప్రధానమంత్రి బలెన్ షా అత్యవసర సమావేశం నిర్వహించారు. జాతీయ విపత్తు నిర్వహణ మండలి సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యలను వేగవంతం చేయడంతో పాటు బాధిత ప్రాంతాలకు అవసరమైన సహాయం అందించే అంశంపై చర్చించారు. ప్రధాని సలహాదారు ఆసిమ్ షా తెలిపిన వివరాల ప్రకారం, ప్రభావిత జిల్లాల చీఫ్ డిస్ట్రిక్ట్ అధికారులతో ప్రధాని నేరుగా సంప్రదింపులు జరుపుతున్నారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
అయితే గల్లంతైన వారి సంఖ్య, ప్రాణనష్టం, ఆస్తినష్టం వంటి వివరాలపై పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది. సహాయక బృందాలు ప్రభావిత ప్రాంతాలకు పూర్తిస్థాయిలో చేరిన తర్వాతే ఈ భారీ విపత్తు అసలు తీవ్రతపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
