China vs NASA: రాకెట్ విషయంలో బాధ్యతారాహిత్యం…చైనా తీరును ఏకిపారేసిన నాసా
China Rocket: చైనా రాకెట్ (లాంగ్ మార్చ్ 5బి) శకలాలు మాల్దీవులకు సమీపంలో హిందూ మహా సముద్రంలో కూలిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ రాకెట్ శకలాలు దురదృష్టవశాత్తు జనావాసాల మధ్య కూలితే తీవ్ర నష్టం జరిగే ప్రమాదముందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందాయి.
చైనా రాకెట్ (లాంగ్ మార్చ్ 5బి) శకలాలు మాల్దీవులకు సమీపంలో హిందూ మహా సముద్రంలో కూలిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ రాకెట్ శకలాలు దురదృష్టవశాత్తు జనావాసాల మధ్య కూలితే తీవ్ర నష్టం జరిగే ప్రమాదముందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందాయి. ఈ వ్యవహారంలో చైనా తీరును అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తీవ్రంగా ఎండగట్టింది. అదుపుతప్పిన రాకెట్ శకలాల నిర్వహణ విషయంలో బాధ్యతాయుతమైన ప్రమాణాలను పాటించడంలో చైనా విఫలం చెందిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రజలు, ఆస్తులకు నష్టం కలగల రీతిలో అంతరీక్ష పరిశోధన సంస్థలు ప్రయోగాలు చేపట్టాల్సిన అవసరముందని నాసా అడ్మినిస్ట్రేటర్ సెన్ బిల్ నెల్సన్ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
భూమి వైపు దూసుకొచ్చిన 21 టన్నుల రాకెట్ శకలాలు… 29-4-2021న..టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రం ఏర్పాటులో భాగంగా టియాన్హే మాడ్యూల్ ను చైనా ప్రయోగించింది. ఇందుకు లాంచింగ్ వెహికల్ గా లాంగ్ మార్చ్ 5బి రాకెట్ ను ఉపయోగించింది. మాడ్యూల్ ను కక్ష్యలో ప్రవేశ పెట్టిన అనంతరం భూమిపై ఉన్న కంట్రోల్ రూంతో లాంచింగ్ వెహికల్‌కు సంబంధాలు తెగిపోయింది. అదుపు తప్పిన చైనా రాకెట్ బరువు 21 టన్నులు కాగా…రాకెట్ పొడవు 100 అడుగులు.. వెడల్పు 16 అడుగులుట. లాంగ్ మార్చ్ 5బీ నియంత్రణ కోల్పోయి భూమికి గంటకు 23 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకు రావడంతో గత వారం రోజులుగా ప్రపంచ దేశాలు ఆందోళన చెందాయి. అమెరికాలోని న్యూయార్క్ సిటీ సమీపంలో లేదా న్యూజిలాండ్ లో రాకెట్ పడే అవకాశముందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అంచనావేసింది. ఈ రాకెట్ శకలాలు భూమిని ఢీకొన్న ప్రాంతంలో విధ్వంసం ఏర్పడుతుందన్న శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేశారు.
రాకెట్ శకలాలు ఆసియా ఖండంలో పడుతుందన్న అమెరికా రక్షణ వర్గాల ప్రకటనతో భారత్ సహా ఇతర ఆసియా దేశాలు కలవరపడ్డాయి. దీంతో ప్రజలు కూడా నిద్రలేని రాత్రులు గడిపారు. అయితే చైనా మాత్రం ఆందోళన అవసరంలేదని చెప్పుకొచ్చింది. రాకెట్ శకలాలు భూమిని చేరేలోపే పూర్తిగా మండిపోతాయని చెబుతూ ఎంతో సీరియస్ అంశాన్ని లైట్‌గా తీసుకుని డ్రాగన్ దేశం బాధ్యతారహితంగా వ్యవహరించింది. భారత్ పొరుగుదేశమైన మాల్దీవులకు సమీపంలో సముద్రంలో రాకెట్ శకలాలు కూలిపోవడంతో పెను నష్టం తప్పింది. రాకెట్ శకలాలు జనావాసాల మధ్య కూలి ఉంటే ప్రాణ, ఆస్తి నష్టం తీవ్రంగా ఉండేది.
గతంలోనూ… గత ఏడాది మేలో ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బి రకానికి చెందిన రాకెట్ కూడా విఫలమైంది. ఐవరీ కోస్ట్ తీరంలోని భవనాలపై పడ్డ రాకెట్ శకలాలు. ఆస్తి నష్టం జరిగినప్పటికీ.. ఎవరికీ గాయాలు కాలేదు. 1979 జులైలో.. నియంత్రణ కోల్పోయిన నాసా అంతరిక్ష కేంద్రం స్కైలాబ్, కక్ష్య నుంచి విడివడి అస్ట్రేలియాలోని ఎస్పెరాన్స్ సముద్ర జలాల్లో కూలిపోయింది.