రణరంగంగా మారిన అమెరికా! ట్రంప్ సర్కార్‌కు వ్యతిరేకంగా రోడ్లపైకి వేల మంది
ట్రంప్ ప్రభుత్వం కఠినమైన వలస చట్టాలకు వ్యతిరేకంగా లాస్ ఏంజెల్స్‌లో వేలాది మంది నిరసనలు చేపట్టారు. వలసదారుల అరెస్టులు, దాడులతో ఉద్రిక్తతలు పెరిగాయి. రోడ్లను దిగ్బంధించి, పోలీసులతో ఘర్షణలు జరిగాయి. నేషనల్ గార్డ్‌ను మోహరించడంతో రాజకీయ వివాదం కూడా చెలరేగింది. ఈ ఘటనలు అమెరికాలో తీవ్రమైన విమర్శలకు దారితీశాయి.

అమెరికా రగులుతోంది. ఆ దేశ రెండో అతిపెద్ద నగరమైన లాస్ ఎంజెలెస్ అగ్నిగుండంగా మారింది. వలసదారుల ఆందోళనలతో అట్టుడుకింది. వందలమందికి గాయాలయ్యాయి. ట్రంప్ ప్రభుత్వం వలస చట్టాలను మరింత కఠినంగా అమలు చేయడంతో వలసదారుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ట్రంప్‌కు వ్యతిరేకంగా వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు.
కోపం.. ఆగ్రహం.. బాధ.. భయం.. ఉద్వేగం.. అన్నింటికి మించి ఏ లక్ష్యంతో అమెరికా గడ్డపై అడుగుపెట్టారో అది నెరవేరకుండానే అర్థంతరంగా తమ భవిష్యత్తు ముగిసిపోతోందనే నిర్వేదం. అందులో నుంచి పుట్టిందే ఈ కోపం. ఈ ఆగ్రహం. ఇండియన్ స్టూడెంట్ చేతులు వెనక్కి విరిచి సంకెళ్లు వేసి దేశ బహిష్కరణ తీరుపై అమెరికా వ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. మన ఇండియన్ స్టూడెంట్‌ను అమెరికాలోని నెవార్క్ ఏర్‌పోర్ట్‌లో సంకెళ్లు వేసి బలవంతంగా దేశం విడిచి పంపిస్తున్న వీడియో అది. అమెరికాలో విదేశీ విద్యార్థులను ఎలా ట్రీట్ చేస్తారో తెలిపే వీడియో అది. సంకెళ్లు వేసి, నేరస్థుడిలా దేశం నుంచి బహిష్కరించింది ట్రంప్ ప్రభుత్వం. అతడు చేసిన నేరం ఏమిటి..? కేవలం తన కలలను సాకారం చేసుకునేందుకు అమెరికా వెళ్లాడు. హాని చేసేందుకు కాదు కదా అంటూ ఈ వీడియోను షేర్ చేస్తూ ట్రంప్‌ను నిలదిస్తున్నారు నెటిజన్లు. అందుకే ఇప్పుడు ట్రంప్ నాయకత్వంపై అమెరికా తిరగబడుతోంది. ఫలితంగా తగలబడుతోంది.
గత శుక్రవారం ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్..ICE ఏజెంట్లు నగరంలో విస్తృత దాడులు చేపట్టారు. సరైన డాక్యుమెంట్స్ లేని వలసదారులే లక్ష్యంగా దాడులు నిర్వహించగా మొత్తం 118 మందిని ICE అరెస్టు చేసింది. అరెస్ట్ నేపథ్యంలో వలసదారుల్లో భయంతో పాటు ఆగ్రహాన్ని రేకెత్తించాయి. జూన్ 6న డౌన్‌టౌన్ లాస్ ఎంజెలెస్‌లో ఇమిగ్రేషన్ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి. అవి శనివారం నాటికి పారమౌంట్, కాంప్టన్ వంటి సమీప నగరాలకూ వ్యాపించాయి.
ఆందోళనకారులు రోడ్లను దిగ్బంధించి పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. పోలీసులు వెంటనే యాక్షన్‌లోకి దిగి రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్, ప్లాష్ బ్యాంగ్ గ్రనేడ్‌లతో ఆందోళనలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. హోమ్ డిపో వద్ద మరిన్ని దాడులు జరుగుతాయనే పుకార్లు ఉద్రిక్తతలను మరింత పెంచాయి. మాస్క్ ధరించిన అందర్నీ అరెస్ట్ చేయాలని ట్రంప్ ఆదేశించారు. దీంతో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ఆదివారం జరిగిన ఘర్షణల్లో ఒక ఆస్ట్రేలియన్ రిపోర్టర్ రబ్బర్ బుల్లెట్‌తో గాయపడ్డారు.
ట్రంప్ నేషనల్ గార్డ్‌ను మోహరించడంతో ఇది రాజకీయంగానూ రచ్చ రేపింది. గవర్నర్ న్యూసమ్, మేయర్ బాస్ ట్రంప్ చర్యలను వ్యతిరేకిస్తూ ఇది చట్టవిరుద్ధమని, రెచ్చగొట్టే చర్య అని విమర్శించారు. మరోవైపు ఆందోళనలను సద్దుమణిగేలా చేసేందుకు 2 వేల మంది నేషనల్ గార్డ్స్‌ను ట్రంప్ కార్యవర్గం సిద్ధం చేసింది. దీనిపై లాస్ ఎంజెలెస్ స్థానిక నాయకత్వం తప్పుబట్టింది. నేషనల్ గార్డ్స్ ను యాక్షన్‌లోకి దింపడం చట్టవిరుద్ధమని ఖండించింది. మరోవైపు ట్రంప్‌నకు బద్ధవిరోధిలా ప్రవర్తిస్తున్న మస్క్.. ఆశ్చర్యకరంగా ఓ ట్వీట్ చేశారు. లాస్ ఏంజెలెస్ నేషనల్ గార్డ్‌లను రంగంలోకి దింపాలనే ట్రంప్ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఎక్స్‌లో పోస్టులు పెట్టారు. కాలిఫోర్నియా గవర్నర్, లాస్ ఏంజెలెస్ మేయర్‌లు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ట్రంప్ చేసిన పోస్టు స్క్రీన్ షాట్‌ను షేర్ చేశారు. దీంతో పాటు జేడీ వాన్స్ పోస్టులను కూడా రీపోస్టు చేయడం గమనార్హం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి