H-1B Visa: హెచ్-1బీ వీసా హోల్డర్లు కొత్త సవాళ్లు.. ఇకపై వీటి ఆధారంగానే వీసాల జారీ!
అమెరికాలో హెచ్-1బీ వీసా జారీ విధానంలో గణనీయమైన సంస్కరణలు తీసుకురావాలని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. ఈ వీసా ప్రక్రియను మరింత పటిష్టం చేసేందుకు, నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను ఆకర్షించేందుకు కొత్త ప్రతిపాదనలను రూపొందిస్తున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం ఇకపై హెచ్-1బీ వీసా జారీ చేయాలంటే ఆ వ్యక్తి జీతం, ఉద్యోగ స్థాయి వంటి అంశాలను పూర్తిగా పరిశీలించనున్నారు.

అమెరికాలో హెచ్-1బీ వీసా జారీ విధానంలో గణనీయమైన సంస్కరణలు తీసుకురావాలని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. ఈ వీసా ప్రక్రియను మరింత పటిష్టం చేసేందుకు, నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను ఆకర్షించేందుకు కొత్త ప్రతిపాదనలను రూపొందిస్తున్నారు. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) శ్వేతసౌధంలోని ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ కార్యాలయానికి సవరణల ప్రతిపాదనను సమర్పించింది. ఈ ప్రతిపాదనల ప్రకారం ఇకపై హెచ్-1బీ వీసా జారీ చేయాలంటే ఆ వ్యక్తి జీతం, ఉద్యోగ స్థాయి వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు.
ప్రస్తుత విధానం ఎలా ఉందంటే?
ప్రస్తుతం హెచ్-1బీ వీసాల జారీ కోసం అమెరికా కాంగ్రెస్ ప్రతి యేటా 85,000 వీసాల పరిమితిని నిర్ణయిస్తుంది. ఇందులో 20,000 వీసాలు అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకంటే ఉన్నత విద్యార్హత కలిగిన వారి కోసం రిజర్వ్ చేశారు. అదనంగా విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల కోసం పరిమితి లేకుండా వీసాలు జారీ చేస్తారు. పరిమితిని మించి వీసా కోసం ప్రపంచవ్యాప్తంగా దరఖాస్తులు వస్తున్నందున.. లాటరీ విధానంలో వీసా లబ్దిదారులను ఎంపిక చేస్తున్నారు. ఎంపికైన H1-B నిపుణులను కంపెనీలు అక్టోబర్ నాటికి ఉద్యోగాల్లో చేర్చుకోవాల్సి ఉంటుంది.
ట్రంప్ పరిపాలనలో కొత్త సంస్కరణలు
2026 ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ వీసాల కోసం 3,58,737 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 1,20,141 దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేశారు. గతేడాది గణాంకాలతో పోల్చితే ఈ ఏడాది 27% తగ్గినట్టు స్పష్టమవుతుంది. ఈ సంఖ్య తగ్గడానికి ట్రంప్ పరిపాలనలో ప్రవేశపెట్టిన కఠిన ఇమిగ్రేషన్ విధానాలు, అధిక రిజిస్ట్రేషన్ ఫీజులు (జనవరి 2025లో $10 నుంచి $215కి పెంచారు) కారణాలుగా చెప్పవచ్చు. అంతేకాక, “క్యాచ్-అండ్-రివోక్” నిబంధనతో వీసా ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవడం కూడా దరఖాస్తుల సంఖ్య తగ్గడానికి మరో కారణమైంది.
ట్రంప్ తన మొదటి టర్మ్‌లో “బై అమెరికన్, హైర్ అమెరికన్” కార్యక్రమం కింద హెచ్-1బీ వీసాలను జీతం ఆధారంగా కేటాయించే విధానాన్ని అమలు చేశారు. ఈ విధానం ద్వారా అధిక జీతం ఆఫర్ చేసే ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇచ్చారుయ. తక్కువ జీతం ఉన్న ఉద్యోగాల్లో విదేశీ వృత్తి నిపుణుల నియామకాన్ని పరిమితం చేశారు. ఈ విధానం 2021లో బైడెన్ పరిపాలనలో రద్దు కాగా, ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ దీన్ని పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నారు.
లాటరీ విధానంపై విమర్శలు
లాటరీ విధానం కంపెనీలకు సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టినప్పటికీ, పెద్ద కంపెనీలు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు సమర్పించడం ద్వారా ఎక్కువ వీసాలను దక్కించుకుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్రొగ్రెస్ అనే సంస్థ లాటరీ విధానాన్ని రద్దు చేసి, జీతం, సీనియారిటీ ఆధారంగా వీసాలు కేటాయించాలని సూచించింది. ఈ విధానం అమలైతే, వీసాల ఆర్థిక విలువ 88% పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వీసా హోల్డర్లకు సవాళ్లు
ట్రంప్ పరిపాలనలో హెచ్-1బీ వీసా హోల్డర్లు కొత్త సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉదాహరణకు, ఉద్యోగం కోల్పోయిన వీసా హోల్డర్లు 30 రోజుల్లో దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. లేదా వారు తమ ఇమిగ్రేషన్ స్థితిని మార్చుకోవాలి. అంతేకాక వీసా దరఖాస్తుల తిరస్కరణ రేటు మళ్లీ పెరిగే అవకాశం ఉంది.
ట్రంప్ ఇటీవల హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని సమర్థిస్తూ తాను దీనిని తన వ్యాపారాల్లో విజయవంతంగా ఉపయోగించానని పేర్కొన్నారు. టెస్లా, స్పేస్‌ఎక్స్ వంటి సంస్థల అధినేత ఎలన్ మస్క్, ఈ కార్యక్రమం అమెరికా ఆర్థిక వ్యవస్థకు, ఆవిష్కరణలకు ఎంతో దోహదపడుతుందని సమర్థించారు. అయితే రిపబ్లికన్ పార్టీలోని కొందరు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది అమెరికాలో వృత్తి నిపుణుల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తుందని వాదిస్తున్నారు .
హెచ్-1బీ వీసా కార్యక్రమంలో ట్రంప్ పరిపాలన తీసుకొచ్చే మార్పులు అమెరికా ఆర్థిక వ్యవస్థ, విదేశీ ఉద్యోగులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. జీతం ఆధారిత కేటాయింపు, కఠిన నిబంధనలు విదేశీ నిపుణుల నియామకంపై ప్రభావం చూపినప్పటికీ, ఈ సంస్కరణలు దీర్ఘకాలంలో అమెరికా ఆవిష్కరణలకు, ఆర్థిక వృద్ధికి దోహదపడే అవకాశం ఉందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాదిస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
