Saudi Prince: సౌదీ ప్రిన్స్ మరణం.. 20ఏళ్లుగా కోమాలోనే.. అసలు ఏం జరిగిందంటే..?
సౌదీ స్లీపింగ్ ప్రిన్స్ అల్ వలీద్ మరణించాడు. గత 20 ఏళ్లుగా ఆయన కోమాలోనే ఉన్నాడు. 15ఏళ్ల వయసులో ప్రిన్స్ కోమాలోకి వెళ్లాడు. సుదీర్ఘ బతుకు పోరాటం తర్వాత కన్నుమూశాడు. అల్ వలీద్ కోమాలోకి ఎలా వెళ్లాడు..? ఆయనకు ఏం జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఆయన సౌదీ యువరాజు. కారు ప్రమాదం జరగడంతో కోమాలోకి వెళ్లాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 ఏళ్లుగా కోమాలోనే ఉన్నారు. సుధీర్ఘ బతుకు పోరాటం తర్వాత మరణించాడు. స్లీపింగ్ ప్రిన్స్‌గా వార్తల్లో నిలచిన సౌదీ యువరాజు అల్ వలీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ మరణించారు. 1990లో అల్ వలీద్ జన్మించారు. 2005లో బ్రిటన్ మిలటరీ కాలేజీలో చదువుతుండగా.. లండన్‌లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలోనే కోమాలోకి వెళ్లారు. అప్పటినుంచి కోమాలోనే ఉన్నారు. ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై అతనికి చికిత్స అందించారు. ట్యూబ్ ద్వారా అతడికి ఆహారం అందించేవారు. గతంలో పలుసార్లు వెంటిలేటర్ తొలగించాలని వైద్యులు చెప్పినా.. అల్ వలీద్ తండ్రి ఒప్పుకోలేదు. దేవుడు మాత్రమే మరణాన్ని నిర్ణయిస్తాడని.. అప్పటివరకు చికిత్స కొనసాగించాలని తెలిపాడు. దాంతో 20 ఏళ్లుగా అతడికి వైద్యులు చికిత్స అందిస్తూ వచ్చారు. అమెరికన్, స్పానిష్ నిపుణులు చికిత్స చేసినప్పటికీ.. ఆయన ఎప్పుడూ స్పృహలోకి రాలేదు.
ఈ క్రమంలో 2019లో అతను కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. చేతులు, కాళ్లు కదిలించడం, తల తిప్పడంతో కోలుకుంటారని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఎటువంటి పురోగతి కన్పించలేదు. ఇటీవలే ఆయన 36వ బర్త్ డే సందర్భంగ..ప్రిన్స్ కోలుకోవాలంటూ వారి సపోర్టర్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దాంతో అతడు స్లీపింగ్ ప్రిన్స్‌గా చాలా మందికి తెలిసింది. అల్ వలీద్ మరణంపై గ్లోబల్ ఇమామ్స్ కౌన్సిల్ ఒక ప్రకటన చేసింది. ‘‘దాదాపు ఇరవై ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రిన్స్ అల్ వలీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ మరణించారు. అతడి మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం’’ అని ప్రకటించింది. ఇది అల్లా ఆజ్ఞ అని.. మరణించిన తన కుమారుడిని అల్లా కరుణిస్తాడని ప్రిన్స్ తండ్రి తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
