Japan Airlines : వామ్మో..ఒక్కసారిగా 26వేల అడుగులు కిందికి దిగిన ఫ్లైట్..ఆ తర్వాత..?
విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్ ప్రయాణికులను గజగజ వణికించింది. ఒక్కసారిగా 26000 అడుగులు ఫ్లైట్ కిందకు దిగడంతో ప్యాసింజర్స్ భయాందోళనకు గురయ్యారు. తమవారికి ఆస్తుల వివరాలు, తాము ఉన్న స్థితిని మెస్సేజ్ ద్వారా పంపించారు. చివరకు పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఫ్లైట్ ను సేఫ్ గా ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

విమాన ప్రమాదాలు ప్రజలను భయపెడుతున్నాయి. ఇటీవలే అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రపంచాన్ని కలవరపరిచింది. ఆ ప్రమాదంలో ఏకంగా 240 మందికి పైగా మరణించారు. 15 రోజుల ముందు ఉత్తరాఖండ్ లో హెలీకాప్టర్ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. నెలల వ్యవధిలోనే అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. ఇవి మరవక ముందే మరో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయాణికులు గజగజ వణికిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్ 30న జపాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఫ్లైట్ చైనాలోని షాంఘై నుండి టోక్యోకు బయలుదేరింది. అంతా బాగానే ఉంది అనుకునేలోపే సడెన్ గా విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్ తలెత్తింది. దీంతో ఒక్కసారిగా 36 వేల అడుగుల ఎత్తు నుంచి కిందకు దిగింది. ఫ్లైట్ ఒక్కసారిగా 10,500 అడుగుల ఎత్తుకు దిగడంతో అసలు ఏం జరుగుతుందో అర్ధంగాక ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది ప్రయాణికులకు ఆక్సిజన్ మాస్కులు పెట్టుకునే ఏర్పాటు చేశారు.
ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో 191 మంది ఉన్నారు. అయితే తమ ప్రాణాలు పోతాయని బయపడ్డ ప్రయాణికులు తాము ఉన్న స్థితిని, ఆస్తులకు సంబంధించిన వివరాలను తమ బంధువులకు మెస్సేజుల ద్వారా పంపించారు. ఈ సమయంలోనే పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు. ఎమర్జెన్సీ ప్రకటించి విమానాన్ని ఒసాకాలోని కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. చివరకు రాత్రి 8:50 గంటలకు ఒసాకాలో ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో ప్యాసింజర్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత అధికారులు ప్రయాణికులకు వసతి కల్పించి.. వారి స్వస్థలాలకు వెళ్లే ఏర్పాట్లు చేశారు. ఈ సంఘటన బోయింగ్ విమానాలపై పెరుగుతున్న ఆందోళనలను మరింత పెంచుతుంది. ఈ ఘటనపై అక్కడి ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
