AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dalai Lama : చైనాకు ఝలక్.. తన వారసుడి ఎంపికపై దలైలామా సంచలన ప్రకటన

బౌద్ధ మత గురువు దలైలామా చైనాకు గట్టి షాకిచ్చారు. తన మరణం తర్వాత కూడా తన వారసత్వం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే తన వారసుడిని ఎన్నుకునే హక్కు గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్టుకు మాత్రమే ఉందని.. మరెవరికీ ఆ హక్కు లేదని చెప్పారు. చైనా మాత్రం తమ అనుమతి తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది.

Dalai Lama : చైనాకు ఝలక్.. తన వారసుడి ఎంపికపై దలైలామా సంచలన ప్రకటన
Dalai Lama
Krishna S
|

Updated on: Jul 02, 2025 | 4:27 PM

Share

బౌద్ధ మత గురువు దలైలామా కీలక ప్రకటన చేశారు. తన మరణం తర్వాత కూడా తన వారసత్వం  కొనసాగుతుందంటూ చైనాకు షాక్ ఇచ్చారు. తన వారసుడిని ఎన్నుకునే బాధ్యత టిబెటన్ల చేతుల్లోనే ఉంటుందని ప్రకటించారు. జూలై 6న తన 90వ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన ఈ ప్రకటన చేశారు. 15వ దలైలామాను ఎంపిక చేసే హక్కు గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్టుకు మాత్రమే ఉందని.. మరెవరికీ ఆ హక్కు లేదని చెప్పారు. తన వారసత్వాన్ని కొనసాగించాలా..? వద్దా..? అనే అంశంపై ఎన్నో చర్చలు జరిపానని.. ఎంతోమంది అభిప్రాయాలు కోరానని తెలిపారు. అందరు తన వారసత్వం కొనసాగాలని కోరుకున్నారన్నారు. కాగా టిబెట్ ను తన గుప్పిట్లో ఉంచుకునేందుకు తమకు అనుకూలంగా ఉండే వ్యక్తిని దలైలామా వారసుడిగా ఎంపిక చేయాలని చైనా ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించి ఎప్పటి నుంచో అక్కడి పిల్లలకు బ్రెయిన్ వాష్ చేసి తమకు అనుకూలంగా మార్చుకోవడం, చైనీయులు టిబెట్ లో ఎక్కువగా స్థిరపడేలా చేయడం వంటివి చేసింది.

తాజాగా దలైలామ ప్రకటన చైనాకు పెద్ద ఝలక్ గా చెప్పొచ్చు. టిబెట్ లో అరుదైన లోహాలతో పాటు బొగ్గు, లిథియం, జింక్, సీసం, బోరాన్ వంటి ఖనిజ నిక్షేపాలు ఉండడంతో చైనా ఆ ప్రాంతంపై కన్నేసింది.లాసాలో చైనా నియంత్రణకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు విఫలమైన తర్వాత దలైలామాతో పాటు వేలాది మంది టిబెటన్లు 1959లో భారత్ కు వచ్చారు. అప్పటినుంచి వారు ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు. దలైలామ వారసుడిగా ఎవరొస్తారనే ఆందోళన టిబెటన్లలో నెలకొంది. ఎందుకంటే చైనా ఏమైన కుట్రలు చేస్తుందనేది వారి ఆందోళనకు కారణం. ఈ ఆందోళనల నేపథ్యంలో దలైలామ తన వారసుడి ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని ప్రకటించారు. గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ మాత్రమే తదుపరి దలైలామాను గుర్తించే అధికారం కలిగి ఉంటుందని స్పష్టం చేశారు.

మరోవైపు దలైలామ ప్రకటనపై చైనా స్పందించింది. తమ ఆమోదముద్ర లేకుండా దలైలామ వారసుడిని ఎంపిక చేయకూడదని తెలిపింది. అంతేకాకుండా చైనాలోనే ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టాలని చెప్పింది. చైనా ప్రకటనను దలైలామ ఖండించారు. దేవుడిని నమ్మని కమ్యూనిస్టులు ఈ ఆధ్యాత్మిక ప్రక్రియలో జోక్యం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. గతంలో మాదిరిగానే తన వారసుడి ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..