Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine Conflict: అభినవ బాహుబలి వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ.. ఇవి కదా వీరుడి లక్షణాలంటే..!

Russia Ukraine Conflict: రాజంటే రాజసాన్ని ప్రదర్శించేవాడు కాదు.. తన రాజ్యాన్ని కంటికి రెప్పలా కాచుకునేవాడు. రాజంటే రాజభోగాలు..

Russia Ukraine Conflict: అభినవ బాహుబలి వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ.. ఇవి కదా వీరుడి లక్షణాలంటే..!
Ukraine
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 26, 2022 | 4:11 PM

Russia Ukraine Conflict: రాజంటే రాజసాన్ని ప్రదర్శించేవాడు కాదు.. తన రాజ్యాన్ని కంటికి రెప్పలా కాచుకునేవాడు. రాజంటే రాజభోగాలు అనుభవించేవాడు కాదు.. తనను నమ్మిన ప్రజలకు ఆపద ఎదురైతే తానున్నానంటూ ముందు నిలిచేవాడు. పోరాడే సమయంలో పారిపోయాడిని పిరికివాడు అంటారు.. అదే పోరాటంలో తానే ముందుకు దూకితే.. వీరుడంటారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీని కూడా వీరుడే మరి. విపత్కర సమయంలో సేఫ్ ఉండేందుకు పారిపోయిన దేశాధ్యక్షులను ఎంతోమందిని చూశాం. కానీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు మాత్రం వెన్ను చూపక.. ఏకంగా సైనికుడిగా మారి ప్రత్యక్ష పోరాటానికి సై అన్నారు. అగ్రరాజ్యం రష్యా దాడులను ఎదుర్కొనేందుకు తాను సిద్ధం అంటూ ముందుకు వచ్చి అభినవ బాహుబలిగా నిలిచారు.

రష్యన్ ఆర్మీ బాంబు దాడులను వెరవకుండా సైనికుడిగా మారారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. అయితే శుత్రువులకు చిక్కకుండా తన ఉనికిని రహస్యంగా ఉంచుతూ.. వ్యూహాత్మకంగా దూసుకెళ్తున్నారు. అధ్యక్షుడిగా కుర్చీకే పరిమితం కాకుండా ప్రజా రక్షణకు కదనరంగంలోకి దూకారు. సైనికులతో కలిసి రష్యన్ బలగాలను ఎదిరిస్తున్నారు ఈ అభినవ బాహుబలి. తన బాధ్యతలను విస్మరించబోయేది లేదంటున్నారు. సైనికుడి దుస్తులు ధరించి తన సైన్యానికి మనోధైర్యం ఇస్తున్నారు. సైన్యానికి ముందుండి దిశానిర్దేశం చేస్తున్నారు అధ్యక్షుడు. అటు నాటో, అమెరికా సహాయం చేయమని స్పష్టం చేసినప్పటికీ ధైర్యం వీడకుండా ముందుకు సాగుతున్నారు. దేశ పౌరులంతా ఆయుధాలు చేతబట్టి పోరాడాలని పిలుపునిచ్చారు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ. తమ తరపున పోరాడేందుకు సిద్ధపడ్డవారందరికీ ఆయుధాలు ఇస్తామని ప్రకటించారు.

జెలెన్ స్కీ ప్రత్యేకత.. నటుడు, హాస్య నటుడిగా రాణించి దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు జెలెన్ స్కీ. ప్రజా రక్షణకు బాధ్యత తీసుకుంటే కడదాకా వెనకడుగువేసేది లేదంటున్నారు ఈ నాయకుడు. ఆగ్నేయ ఉక్రెయిన్‌లో రష్యా మాట్లాడే ప్రాంతంలో పుట్టిన వ్లాదిమిర్ జెలెన్‌స్కీ.. 1978 జనవరి 25న యూదు కుటుంబంలో జన్మించారు. తండ్రి ఒలెక్ సాండ్ర జెలెన్ స్కీ ప్రొఫెసర్. క్రివ్యీవ్ రీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్స్ లోని సైబర్ నెటిక్స్, కంప్యూటింగ్ హార్డ్ వేర్ విభాగం అధిపతి. తల్లి రిమ్మా జెలెస్కా ఇంజినీర్. తాత సైమన్‌ ఇవనోవిచ్‌ జెలెన్‌స్కీ. రెడ్ ఆర్మీలో పనిచేస్తూ రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్న వీరుడు. ఇక జెలెన్ స్కీ.. క్రివ్యీవ్ నేషనల్ ఎకనమిక్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. అయితే జెలెన్ స్కీ న్యాయవాద వృత్తివైపు వెళ్లలేదు. 17వ ఏటనే స్థానిక కమేడియన్ పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. అనంతరం 1997లో క్వర్తల్‌95 అనే సంస్థను నెలకొల్పారు. ఈ క్వర్తల్95 ప్రఖ్యాత కామెడీ గ్రూప్ గా పేరుపొందింది. ఈ హాస్య బృందంలో సభ్యుడిగా ఉంటూ ఒకప్పటి సోవియట్ యూనియన్ దేశాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రదర్శనలు ఇచ్చారు జెలెన్ స్కీ. 2003లో టీవీ షో నిర్మాతగా అనంతరం 2008లో నటుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. 2014లో ఉక్రెయిన్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దేశంలోని రష్యన్ కళాకారులను నిషేధించాలనుకున్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించారు. 2015లో రష్యా కళాకారులు, ప్రదర్శనలు, వారి సాంస్కృతిక ఆనవాళ్లను ఉక్రెయిన్ ప్రభుత్వం నిషేధించింది. ఈ నేపథ్యంలో తన దృష్టిని రాజకీయాలవైపు మరల్చారు జెలెన్ స్కీ. మరోవైపు సినిమాల్లో ఇటు టీవీ షోల్లో నటిస్తూ, షోలు నిర్మిస్తూ మంచి పేరు సంపాదించారు జెలెన్ స్కీ. అదే సమయంలో తన ప్రదర్శనలతో ప్రభుత్వ విధానాలను విమర్శించారు.

పొలిటికల్ ఎంట్రీ.. 2018లో సర్వెంట్ ఆఫ్ ద పీపుల్ అనే రాజకీయ పార్టీ స్థాపించింది క్వర్తర్ 95 గ్రూప్. అనంతరం సర్వెంట్ ఆఫ్ ద పీపుల్ పేర కామెడీ షో నిర్వహించిందీ గ్రూప్. ఈ షోలో దేశ అధ్యక్షుడిగా జెలెన్ స్కీ నటించారు. అంకితభావంతో పనిచేసే రాజకీయ నేతలను అధికారంలోకి రావాలని కోరుకున్నారాయ. ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2019లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి అప్పటి అధ్యక్షుడు పెట్రో పొరొషెంకోను ఓడించి అధ్యక్ష పీఠం అధిరోహించారు. రష్యా సంస్కృతి పరిరక్షణ కోసం ఉక్రెయిన్ ప్రభుత్వానికి ఎదురు నిలిచిన నేత. ఆఖరికి యాంటీ ఉక్రెయిన్ నేతగా ముద్రవేసుకున్నారు జెలెన్ స్కీ.

స్నేహ హస్తం అందించే తత్వం.. ఉక్రెయిన్‌-రష్యాల మధ్య విభేదాలను అంతం చేసేందుకు పుతిన్‌తో చర్చలకు శ్రీకారం చుట్టారు జెలెన్‌స్కీ. ఉక్రెయిన్‌, రష్యన్‌ భాషలు మాట్లాడే ప్రాంతాల మధ్య సమైక్యత తేవాలని కోరుకున్నారాయన. 2021-22 నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దాంతో ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా భారీ స్థాయిలో బలగాలను మోహరించింది. దీంతో అలర్ట్ అయిన ఉక్రెయిన్.. నాటోలో తమదేశానికి సభ్యత్వం ఇవ్వాలని, వెంటనే చర్యలు ప్రారంభించాలని అమెరికా అధ్యక్షుడిని కోరారు జెలెన్ స్కీ. ఇదిలాఉంటే.. దేశంలో ఎన్నికల వ్యవస్థను మార్చాలన్న జెలెన్‌స్కీ తొలి ప్రధాన ప్రతిపాదనను ఉక్రెయిన్ పార్లమెంట్ తిరస్కరించింది.

సాయం రాకున్నా ఒంటరిపోరుకు సై.. తాజాగా రష్యా దాడి నేపథ్యంలో సహాయం కోసం నాటో కూటమిలోని 30 దేశాతో పాటు అమెరికాను అభ్యర్థించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. తటస్థ దేశాలను సైతం సాయంకోసం విజ్ఞప్తి చేశారు. అయితే జెలెన్ స్కీ అభ్యర్థనలకు నాటో, అమెరికా, ఇతర దేశాల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. అయినప్పటికీ ధైర్యం వీడకుండా పోరాటంవైపు అడుగులేస్తున్నారు జెలెన్ స్కీ. మరోవైపు జెలెన్ స్కీ ని మట్టుబెట్టాలని రష్యా బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జెలెన్‌స్కీ ఎక్కడ ఉన్నా పట్టుకోవాలని భావిస్తోంది. అయితే, జెలెన్‌స్కీ తన ఆచూకీ తెలియకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Also read:

Russia-Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభంపై స్పందించిన తాలిబన్లు.. ట్విట్టర్‌ ద్వారా కీలక ప్రకటన

Russia-Ukraine Crisis: ఫ్రత్యేక విమానంలో ఉక్రెయిన్‌ నుండి స్వదేశానికి భారతీయులు.. టీవీ9 ఎక్స్‌క్లూజీవ్ ఫొటోస్…

ఓ వైపు కుమార్తె మరణం.. మరోవైపు రంజీలో కీలక మ్యాచ్.. బరోడా క్రికెటర్‌కి సెల్యూట్ చేస్తోన్న ఫ్యాన్స్.. ఎందుకంటే?