అది గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలోని హనోల్ గ్రామం. గ్రామంలోని లక్ష్మణ్ భాయ్ అతి సాధారణమైన రైతు. ఉన్న పొలంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతనికి 1972 జూలై 1న ఓ బిడ్డ జన్మించాడు. తన కొడుకు ఏదో ఒక రోజు గొప్ప నాయకుడిగా ఎదిగి దేశానికి సేవ చేస్తాడని లక్ష్మణ్ భాయ్ రోజూ కలలు కంటూ ఉండేవాడు. అనుకున్నట్లుగానే లక్ష్మణ్ భాయ్ కల నెరవేరింది, అతని కొడుకు గుజరాత్ రాష్ట్రంలో ఓ పెద్ద రాజకీయ నాయకుడు అయ్యాడు. అతని కొడుకు మరెవరో కాదు..ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మన్సుఖ్ మాండవీయా.
భారత ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఈ సమయంలోనే డాక్టర్ హర్షవర్ధన్ స్థానంలో మన్సుఖ్ మాండవియా దేశానికి కొత్త ఆరోగ్య మంత్రిగా నియమితులయ్యారు. మన్సుఖ్ మాండవియా గుజరాత్‌లో మంచి పేరున్న నాయకుడిగా ఎదిగారు. ఆయన పాటిదార్ సామాజిక వర్గంలోని లేయు పటేల్ కమ్యూనిటీకి చెందిన రాజకీయ నేత. రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు మంచి పట్టు కూడా ఉంది.
మాండవ్య 2002లో గుజరాత్‌లో అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లారు. ఆయన 2002 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో పలిటానా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పటికి ఆయన వయసు 28 సంవత్సరాలు మాత్రమే.. మాండవ్య ఎన్నికల్లో గెలుపొందడం అనేది అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే కాకముందు మాండవ్యకు అనేక సంస్థలతో అనుబంధం ఉంది. ఇంకా భారతీయ జనతా యువమోర్చా, ఏబీవీపీ విద్యార్థి విభాగం, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సభ్యుడిగా కూడా పనిచేశారు. మాండవ్య గుజరాత్ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా కూడా ఉన్నారు.
మన్సుఖ్ మాండవియా 2012, 2018లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2016 జూలై 5న మోడీ క్యాబినెట్‌లో రోడ్డు రవాణా, రహదారులు, షిప్పింగ్ , రసాయన ఎరువుల శాఖ సహాయ మంత్రిగా మాండవియా నియమితులయ్యారు. ప్రధాని మోదీకి ఇష్టమైన నేతల్లో మన్సుఖ్ మాండవియా కూడా ఒకరు. భారతీయ జనతా పార్టీ 2014లో ప్రారంభించిన మెగా మెంబర్‌షిప్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మాండవియా ప్రముఖ పాత్రనే పోషించారు. ఆయన ఇన్ ఛార్జిగా ఉన్నప్పుడు కోటి మంది పైగా కార్యకర్తలు పార్టీలో చేరారు.
మన్సుఖ్ మాండవియా భావ్‌నగర్ విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టాను పొందారు. పొలిటికల్ సైన్స్‌లో ఆయన తన ఎంఏ చేశారు. ఆరోగ్య రంగంలో మాండవ్య చేసిన కృషికి ప్రజలలో ఆయన పట్ల ఆదరాభిమానాలు ఇప్పటికీ సుస్థిరంగా ఉన్నాయి. సరసమైన ధరలకు మందులు అందుబాటులో ఉంచడంతోపాటు కేంద్ర మంత్రిగా జన్ ఔషధి స్టోర్లను ఏర్పాటు చేసిన ఘనత మాండవ్యకే దక్కుతుందని ప్రజలలో పాతుకుపోయిన మాట. దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి ఇటీవలే వైద్య కళాశాలల సంఖ్యను, ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను పెంచుతామని మంత్రి మాండవ్య చెప్పారు.