Hiroshima Day: నేటితో అమెరికా అణుబాంబు దాడి చేసి 77ఏళ్ళు.. నాటి విధ్వసం తర్వాత ప్రస్తుతం హీరోషిమా, నాగసాకి ఎలా ఉన్నాయంటే..
రెండవ ప్రపంచ యుద్ధం 1939లో ప్రారంభమై.. 1945 వరకు సాగింది. యుద్ధం నిర్ణయాత్మక దశకు చేరుకున్న సమయంలో జపాన్ కలలో కూడా ఊహించని విధంగా అమెరికా నిర్ణయం తీసుకుంది.
Hiroshima Day: ఆగష్టు 6, 1945 చరిత్రలో మరచిపోలేని రోజు.. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ప్రపంచంలోనే అమెరికా మొట్టమొదటిసారిగా అణుబాంబుని ఉపయోగించిన తేదీ ఆగష్టు 6. ఆసియా దేశమైన జపాన్‌లోని హిరోషిమా నగరంపై అణు బాంబును వేసిన తేదీ. మళ్ళీ మూడు రోజుల తరువాత రెండవ బాంబు జపాన్‌లోని నాగసాకి నగరంపై వేసింది. అణుబాంబు దాడితో రెండు నగరాలు ధ్వంసమయ్యాయి. పూర్తిగా శిథిలమయ్యాయి. ఎక్కడ చూసినా మరణ ఘోష.. దాడి జరిగిన కొద్ది నిమిషాల్లోనే లక్షన్నర మందికి పైగా చనిపోయారు. ప్రాణాలతో బయటపడిన వారు వికలాంగులయ్యారు. అణుబాంబు దాడి ప్రభావం వాతావరణంపై కూడా పడింది. ఆ నగరాల్లో అనేక దశాబ్దాలుగా కొనసాగింది.
రెండవ ప్రపంచ యుద్ధం 1939లో ప్రారంభమై.. 1945 వరకు సాగింది. యుద్ధం నిర్ణయాత్మక దశకు చేరుకున్న సమయంలో జపాన్ కలలో కూడా ఊహించని విధంగా అమెరికా నిర్ణయం తీసుకుంది. ప్రమాదకర మైన నిర్ణయంతో 1945 ఆగస్టు 6న ఉదయం 8 గంటలకు హిరోషిమాపై అణుదాడి చేసింది. కనులు మూసి తెరచే లోగా.. 80 శాతం నగరం బూడిదగా మారింది. 80 వేల మందికి పైగా మరణించారు. ఈ అణుబాంబు దాడి అనంతరం వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపించింది. అణు రేడియేషన్ కారణంగా వ్యాధులతో ప్రజలు మరణించారు. ఇలా అనేక దశాబ్దాలపాటు కొనసాగింది.
సంవత్సరాల తరబడి ప్రభావం అణు దాడి తర్వాత 30 కి.మీ ప్రాంతంలో నల్లటి వర్షం కురిసింది. దశాబ్దాలుగా అక్కడి ప్రజలు రేడియేషన్ బారిన పడ్డారు. తమపై జరిగిన అణుదాడి పై 77 ఏళ్ల తర్వాత కూడా జపాన్ ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తోంది. ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పించడంపై గతేడాది హైకోర్టు తీర్పు వెలువరించింది. రేడియో ధార్మిక రేడియేషన్ వల్ల వచ్చే 11 గుర్తించిన వ్యాధులకు వారికి చికిత్స అందిస్తున్నారు.
హిరోషిమా నగరం నేడు ఎలా ఉందంటే? హిరోషిమా నగరం జపాన్‌లోని అతిపెద్ద ద్వీపమైన హోన్షులో ఉంది. అణు దాడి తర్వాత నగరం నాశనమైంది. ఈ నగరం పునరుద్ధరించడానికి జపాన్ చాలా కష్టపడింది. భారీగా డబ్బు వెచ్చించింది. నేడు ఈ నగరంలో దాదాపు 12 లక్షల మంది జనాభ నివసిస్తున్నారు. ఇది చక్కని, అందమైన నగరంగా రూపుదిద్దుకుంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్నప్పటికీ క్రమబద్ధమైన అభివృద్ధి ఈ నగరంలో అడుగడుగునా కనిపిస్తుంది. మంచి నీటి వనరుల కోసం అనేక చర్యలు చేపట్టింది. నగరంలో ఆస్ట్రామ్ లైన్, సీనో లైన్, రైలు సేవలు ఉన్నాయి. పెద్ద కంపెనీలున్నాయి. ఆధునిక పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అనేక సాంస్కృతిక కేంద్రాలు నిర్మించారు.
హిరోషిమా నగరంలో అందమైన విమానాశ్రయం ఉంది. ఈ అంతర్జాతీయ విమానశ్రయం నుంచి జపాన్ రాజధాని టోక్యో, ఇతర దేశీయ విమానాల సహా చైనా, సింగపూర్, తైవాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు విమానాలు అందుబాటులో ఉన్నాయి. నగరంలో నిర్మించిన హిరోషిమా మెమోరియల్, మ్యూజియం ఇప్పటికీ అణు దాడి విధ్వంసాన్ని ప్రజలకు గుర్తు చేస్తుంది. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటారు.
నాగసాకి నగరం నేడు ఎలా ఉందంటే? నైరుతి క్యుషు ద్వీపంలోని సముద్రతీరంలో ఉన్న నాగసాకి నగరం 406 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక్కడ జనాభా దాదాపు 4.7 లక్షలు. రోడ్డు మధ్యలో నడిచే స్ట్రామ్‌లు ఇక్కడ రవాణాను సులభతరం చేస్తాయి. హషిమా ద్వీపం, పీస్ పార్క్, అటామిక్ బాంబ్ మెమోరియల్ మొదలైనవాటిని సందర్శించే లక్షలాది మంది పర్యాటకులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారు.
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి-మార్చిలో నాగసాకి లాంతరు ఉత్సవం అత్యంత ఘనంగా జరుగుతుంది. ఈ సాంస్కృతిక కార్యక్రమం కూడా పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. నాగసాకి నగరం నౌకానిర్మాణ పరిశ్రమతో కూడిన ఓడరేవు నగరం. భారీ సంఖ్యలో ఉద్యోగాల కల్పన ఇస్తుంది ఈ నౌకాశ్రయం. ఈ నగరంలో వాతావరణం ఆగస్టులో గరిష్ట వేడి ఉంటుంది. శీతాకాలంలో మంచు కురుస్తుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..