Haiti Earthquake: హైతీలో విపత్కర పరిస్థితులు.. ఓ వైపు భూకంపం.. మరోవైపు భారీ వర్షాలు..
Earthquake in Haiti: కరేబియన్ ద్వీప దేశం హైతీలో భూకంపం పెను విలయతాండవం సృష్టించిన సంగతి తెలిసిందే. గత శనివారం సంభవించిన ఈ భారీ భూకంపం ధాటికి ఇళ్లన్నీ
Earthquake in Haiti: కరేబియన్ ద్వీప దేశం హైతీలో భూకంపం పెను విలయతాండవం సృష్టించిన సంగతి తెలిసిందే. గత శనివారం సంభవించిన ఈ భారీ భూకంపం ధాటికి ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. వందలాది మంది మరణించారు. వేలాది మందికి గాయాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. శిథిలాలు తొలగిస్తున్న కొద్ది శవాలు బయటపడుతున్నాయి. కాగా ఈ భూకంపం ధాటికి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,941కు పెరిగిందని హైతీ పౌర రక్షణ సంస్థ మంగళవారం తెలిపింది. దీంతోపాటు గాయపడిన వారి సంఖ్య 9,900 కి పెరిగిందని అధికారులు తెలిపారు. దేశంలోని ఆసుపత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. ఇప్పటికే భూకంపం ధాటికి జనం విలవిలలాడుతుండగా.. మరోవైపు తుఫాను భయభ్రాంతులకు గురిచేస్తోంది. తుఫాను ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో సహాయక చర్యలకు సైతం విఘాతం కలుతోందని అధికారులు పేర్కొంటున్నారు. తుఫాను వల్ల జనం బిక్కుబిక్కుమంటూ శరణార్థ శిబిరాల్లో గడుపుతున్నారు.
వర్షాల నేపథ్యంలో వరదలు సంభవించే అవకాశం ఉందని యూఎస్ నేషనల్ హరికేన్ సెంటర్ ఫ్లాష్ అండ్ అర్బన్ హెచ్చరించింది. భూకంపం ప్రభావంతో బీటలు వారిన భవనాల్లో నీరు చేరి కూలి పోయే ప్రమాదం ఉందంటూ అధికారులను అప్రమత్తం చేసింది. కాగా.. భారీ వర్షాలతో ప్రజలకు తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భూకంపం ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం నెల రోజుల అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. గత 48 గంటల్లో రెస్క్యూ సిబ్బంది 30 మందికి పైగా ప్రజలను సజీవంగా శిథిలాల నుంచి బయటకు తీసినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. ఎడతెరపిలేని వర్షం కారణంగా సహాయక చర్యలకు విఘాతం కలుగుతోందని అధికారులు వెల్లడించారు.
హైతీ రాజధాని పోర్ట్-ఓ-ప్రిన్స్‌కు పశ్చిమాన 160 కిలోమీటర్ల దూరంలో నైరుతి దిశలో శనివారం తెల్లవారు జామున 7.2 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు దాదాపు 2వేల మంది మరణించగా.. 76వేలకుపైగా భవనాలు ధ్వంసమయ్యాయి. విపత్తు కారణంగా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో తీర ప్రాంత పట్టణమైన లెస్‌కేస్‌లో నిర్వాసితులు ఫుట్‌బాల్ మైదానాలు, చర్చిల్లో ఆశ్రయం పొందుతున్నారు.
Also Read: