క్యూబాలో కుప్పకూలిన హెలికాప్టర్.. ప్రమాదంలో ఐదుగురు వ్యక్తుల దుర్మరణం
హెూల్విన్ ప్రావిన్స్ నుంచి గ్వాంటనామో ద్వీపానికి వెళ్తుండగా.. అకస్మాత్తుగా హెలికాప్టర్ కూలిపోయిందని ఆ దేశ సాయుధ దళాల మంత్రిత్వశాఖ ప్రకటించింది.

Helicopter Accident In Cuba : క్యూబా దేశంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారని ఆ దేశ మీడియా ప్రకటించింది. అయితే మృతులకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. క్యూబాలోని ఉత్తర దిశలో హెూల్విన్ ప్రావిన్స్ నుంచి గ్వాంటనామో ద్వీపానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
హెూల్విన్ ప్రావిన్స్ నుంచి గ్వాంటనామో ద్వీపానికి శుక్రవారం తెల్లవారుజామున హెలికాప్టర్ బయల్దేరింది. అయితే మార్గమధ్యలో ఒక కొండపై అకస్మాత్తుగా హెలికాప్టర్ కూలిపోయిందని ఆ దేశ సాయుధ దళాల మంత్రిత్వశాఖ ప్రకటించింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు ప్రమాదస్థలిలోనే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. దీనిపై స్పందించి క్యూబా ప్రభుత్వం.. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. వివరాలు సేకరించి దర్యాప్తుకు ఆదేశించింది. ఇదిలావుంటే 2018లో క్యూబాలో భారీ విమాన ప్రమాదం జరిగింది. దేశ రాజధాని హవానా విమానాశ్రయం సమీపంలో జరిగిన ఘటనలో ఏకంగా 112 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.